Saturday, April 9, 2011

నూటొక్క జిల్లాల అందగాడు నూతన్‌ప్రసాద్


‘కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ’ అంటూ బాపు-రమణలు రూపొందించిన ‘రాజాధిరాజా’ చిత్రంలో సైతాన్ పాత్ర అనితర సాధ్యం అనే విధంగా కొత్త తరహాలో ఆవిష్కరించిన నటుడు నూతన్‌ప్రసాద్. తెరపై విభిన్నపాత్రల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నూతన్‌ప్రసాద్ డిసెంబర్ 12, 1945లో కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు. బందరులో ఐటిఐ చదివి నాగార్జునసాగర్, హైదరాబాద్‌లో చిరుద్యోగాలు చేసి హెచ్‌ఎఎల్ కంపెనీలో సెటిలయ్యారు. అప్పుడే రంగస్థల నటుడు, దర్శకుడు భానుప్రకాశ్ పరిచయం కావడంతో రంగస్థలంపై ‘సుడిగాలి’, ‘గాలివాన’, ‘గాలిపటం’, ‘వలయం’, ’కెరటాలు’ వంటి నాటకాల్లో, నాటకరంగ ప్రయోక్త ఎ.ఆర్ కృష్ణగారి దర్శకత్వంలో ‘మాలపిల్ల’ నాటకాన్ని నూటొక్కసార్లు ప్రదర్శించిన నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్.
బాపుగారి ‘అందాల రాముడు’తో సినీరంగ ప్రవేశం చేసి ‘ముత్యాల ముగ్గు’లో నిత్యపెళ్లికొడుకులా వేషం కట్టి ఆపైన ‘చలిచీమలు’ చిత్రంతో నూతన్‌ప్రసాద్‌గా మారి, నూటొక్క జిల్లాల అందగాడిగా ప్రసిద్ధిపొందారు. అది 1975-76 నాటి మాట. అప్పటినుంచి భానుమతి భర్తగా నటించిన ‘బామ్మమాట బంగారు బాట’ చిత్రం వరకూ 365 సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు. ‘బామ్మమాట-బంగారుబాట’ చిత్రం షూటింగ్ సందర్భంగా యాక్సిడెంట్ కావడంతో కాలు కోల్పోయి కొంతకాలం విశ్రాంతి తీసుకుని భగవంతుడు పునర్జన్మ ప్రసాదించాక వీల్‌చైర్‌లో ఉంటూ శతాధిక చిత్రాల్లో నటించారు. ఇది భారత చలనచిత్ర చరిత్రలో అపూర్వమైన విషయం. దాదాపు 20 చిత్రాల్లో జడ్జిగా నటించారు. సినిమా జడ్జి పాత్ర పోషించడంలో అదో రికార్డు. ‘సంసారం ఓ చదరంగం’లో ఎడ్మండ్ శ్యామ్‌వెల్ పాత్రలో విలక్షణమైన హాస్యాన్ని పండించారు. విజయబాపినీడు చిత్రం ‘పట్నం వచ్చిన పతివ్రతలు’లో పోలీస్ ఆఫీసర్‌గా ఆయన పలికిన ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది’ అన్న డైలాగ్ పాత్రపరంగా పండింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో దాన్ని వాడుకున్నారు. ‘విజయ’, ‘బొట్టూకాటుక’, ‘కాయ్‌రాజా కాయ్’, ‘వసుంధర’, ‘ఇంటింటి రామాయణం’ చిత్రాల్లోని పాత్రలు తొలి దశకంలో ఆయనకు నటుడిగా ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. పరమ కర్కోటకుడిగా, బ్రోకర్‌గా ‘పూజకు పనికిరాని పువ్వు’ చిత్రంలోను, మూర్ఖత్వం, ప్రేమ, సెంటిమెంట్ పలికిన పాత్రలో ‘అహనాపెళ్లంట’ చిత్రంలో ప్రదర్శించిన నటన మరవలేం.
అక్కినేని నాగేశ్వరరావు-నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ చిత్రంలో విలన్‌గా ఆ ఇద్దరితోనూ పోటీపడి నటించడం చెప్పుకోదగ్గ విశేషం. కె.రాఘవేంద్రరావు ‘అగ్నిపర్వతం’, దాసరి నారాయణరావు ‘తిరుగుబాటు’, ఇవివి సత్యనారాయణ ’అబ్బాయిగారు’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘సుందరి-సుబ్బారావు’, ‘ప్రజాస్వామ్యం’, ‘నవభారతం’, ‘వసుంధర’ చిత్రాల్లో నటనకుగాను రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలను అందుకున్నారు.
‘నేరాలు-ఘోరాలు’, ‘హేట్సాఫ్’ వంటి కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నూతన్‌ప్రసాద్ కొంతకాలం సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతికి కార్యదర్శిగా పనిచేశారు. అంగ వైకల్యంతో జీవితాన్ని జయించిన నటుడిగా అనుకున్నది సాధించిన నూతన్ ప్రసాద్ అనారోగ్యంతో పోరాడి పరాజితుడై మార్చి 30న కీర్తిశేషులయ్యారు. నిజానికి క్యారెక్టర్ ఆర్టిస్టు అనే నటవర్గానికి నూతన్ ప్రసాద్ లేని లోటు పూడ్చలేనిదే.

Monday, April 4, 2011

ఉగాది శుభాకాంక్షలు

అందరికి ఖరనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు