Monday, May 31, 2010

పద ఝరి వేటూరి

వేటూరి గారి స్మృత్యర్ధం




తెలుగుపాటను కొత్త పుంతలు తొక్కించిన కలం ఆయనది. తెలుగు మాటను మురిపించి, మైమరిపించిన పద ఝరి వేటూరి. ఆయన లేని లోటు తెలుగు మాటకు, పాటకు, భాషకే తీరనిది. ఆయన కలం బలం అంతటిది. ఆయన భావజాలం అంత గొప్పది. ఆ కలానికి అడ్డులేదు. భాషాపరమైన అవరోధాలూ లేవు. అందుకే ఎలదేటి పాటలా సాఫీగా మూడున్నర దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా సాగిందా సిరా. ఆయన పాటలో తత్వం పలుకుకుంది. అరమరికల్లేని ఆనందం పరవశిస్తుంది. శృంగారం పరవళ్లు తొక్కుతుంది. విరహమూ వీరంగం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వేటూరి కలం పడితే కలకలమే. భావ ప్రవాహమే. ఎలాంటి భావ లోతులకైనా ఆయన కలం వెళ్లగలుగుతుంది. ‘సిరిమల్లె పువ్వా’ అంటూ పలుకరించిన ఆ తెలుగుదనం ‘కోకిలమ్మ పెళ్లికీ కోనంతా పందిరీ’ అంటూ అడవికీ కోకిలమ్మకు మధ్య ఉన్న ప్రకృతి సంబంధిత అనుబంధాన్నీ హృద్యంగా ఆవిష్కరించింది. అదేపాటలో చిగురాకులనే తోరణాలుగా చేసి చిరుగాలుల్నే సన్నాయిగా మార్చిందా కలం. అందుకు భాషాపరమైన పట్టుమాత్రమే ఉంటే సరిపోదు. భావస్ఫోరక ప్రయోగమూ అవసరమే. అలాంటి ప్రయోగాలెన్నింటినో వేటూరి చేశారు. ‘వేట నాది వేటు నాది వేటాడే చోటునాది’ అంటూ భక్తకన్నప్ప చిత్రంలో ఆయన చేసిన పద శబ్ద ప్రయోగం మనస్సును పులకింపజేసేదే. సందర్భాన్ని బట్టి భావలహరిలో ఎంతలోతుకైనా వెళ్లగలిగే ‘పాట’వం వేటూరిది. అందుకే ఆయన తెలుగుదనానికే కాదు తెలుగు పాటకూ చిరునామా అయ్యారు. తొలి పాట రాసిన ఓ సీత కథ నుంచి ఆయన ప్రతి పాటకూ తెలుగు ప్రేక్షకులు పట్టంగట్టారు. ఆయన విరుపులకు, విసుర్లకు ఉప్పొంగిపోయారు. పదాలను పరుగులు తీయించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న వేటూరి ఆ తరహాలో ఎన్నో వేల గీతాలను హృదయాలు పరుగులెత్తించేలా రాశారు. చిన్న మాటల్లో నిగూఢ అర్థాన్ని చెప్పగలిగిన ఆత్రేయ స్థాయిలో వేటూరి విరచిత గీతాలెన్నో ఉన్నాయి. ‘చిన్నమాట ఒక చిన్న మాట’ అంటూ ఆయన అలతి పదాలతో రాసిన పాట సైతం విశేష ప్రాచుర్యాన్ని చూరగొంది. వేటూరి అంత తేలిక పదాలతో అంత సునాయాసంగా, సునిశిత భావంతో పాటలు రాయగలిగారంటే దాని వెనుక తెలుగు భాషను ఔపోసన పట్టిన అనుభవం ఉంది. తెలుగు పదం ఎంతగొప్పదో అధ్యయనం చేసిన కృషి ఉంది. అన్నింటికీ మించి సమాజాన్ని లోతుగా చూసిన, మనస్తత్వాన్ని కోణాల్లోనూ స్పృశించిన అవగాహనా శక్తి ఉంది. అందుకే వేటూరి పాటలో సజీవత్వం కనిపిస్తుంది. ఆయన పాటలోని సందర్భోచితమైన భావ పరంపర పదపదంలోనూ ద్యోతకమవుతుంది. మూడున్నర దశాబ్దాల పాటు సాగిన వేటూరి గేయరచన ఎక్కని పుంతల్లేవు. ఆయన అందుకోని భావ శిఖరాల్లేవు. ఆయన కలం శృంగారాన్నీ పండించింది. వయ్యారాన్నీ ఒలకబోసింది. అద్వైతాన్ని ప్రబోధించింది. తెలుగుదనానికి నిండైన చిరునామా ఆయన పాట. మాటలకందని భావాలనెన్నింటినో తన పాటల్లో పరంపరగా పొదివారు. తెలుగుపదానికి ఎన్ని అర్థాలున్నాయో.. అన్నింటిలోనూ అందెవేసింది కలం ఆయనది.
తెలుగు పాటకు తొలి నాళ్లలో తాత్విక కోణాన్ని అందించిన ఘనత సముద్రాల వారిదైతే, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి సరళపదాలతో ఘనమైన అర్థాలనందించిన పాటవం వేటూరిది. దేనిపైనైనా పాట రాయగలిగే పదాల పందిరి ఆయన మనసు. దానికి సందర్భానుసారం స్పందించడం తెలుసు. ఆ స్పందనలో తెలుగు తీయదనాన్ని ఎలా అందించాలో తెలుసు. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ అంటూ భావలోతులకెళ్లిన ఆయన ‘వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికీ’ అంటూ ప్రేక్షకుల గుండెలను ఆర్ద్రతతో పిండేశారు వేటూరి. పదాలందరికీ తెలుస్తాయి. భావ గర్భితంగా, భావస్ఫోరకంగా వాటిని సందర్భాన్ని బట్టి అందించడంలోనే గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనం వేటూరి సొంతం. అందుకే వేటూరి పాట తెలుగుదనానికి ప్రతీక. తవ్వేకొద్దీ వేటూరి పాటలో కొత్త భావాలు పుట్టుకొస్తాయి. కొత్త అర్థాలు సాక్షాత్కరిస్తాయి. అందుకే ఆయనది తెలుగు పద ‘పాట’వం. తెలుగు పాటకు సాహితీ గౌరవాన్ని తెచ్చిన తేజం. తెలుగు మాటకూ ఉత్తేజం.

Wednesday, May 12, 2010

అమర గాయకుని అర్ధాంగి



ప్రతి మగవాడి విజయం వెనక ఓ స్త్రీమూర్తి వుంటుంది అన్న మాటకు అక్షరసత్యంగా నిలిచినవారు సావిత్రమ్మ. గంధర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అర్ధాంగిగా ఆమెకు కళాలోకం నీరాజనాలు పడుతోంది. మహాగాయకుడు ఘంటసాల వారి సతీమణిగా, అద్భుత గాత్ర పరిమళానికి ప్రధమ శ్రోతగా, ఆయన తదనంతరం ఆయనకు దక్కాల్సిన సన్మాన సత్కారాలన్నీ అందుకుంటూ, తన భర్తను నిత్య వసంతునిగా చేస్తున్నారు. ఆంధ్రదేశంలో ఘంటసాల గానామృతాన్ని సేవించనివారు వుండరు. పాడితే ఘంటసాలే పాట పాడాలని సువర్ణ్ధ్యాయంగా భావించే పాతతరం చిత్రాల్లో పట్టుపట్టి మరీ ఆయనచే పాడించేవారు. నిరంతరం రికార్డింగులు, మ్యూజిక్ సెట్టింగ్‌లు వగైరాలతో తిరిగే ఆయన్ను కంటికి రెప్పలా కాచుకుంటూ ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తూ ఆ అమృత గానఝురిని నేల నాలుగు చెరగులా ప్రవహించడానికి తనవంతు ప్రయత్నంగా కృషి చేసిన సావిత్రమ్మ జీవితం ధన్యం. అటువంటి వ్యక్తిత్వాన్ని ఘంటసాల అభిమానులకు పరిచయం చేస్తుందీ గ్రంథం. ‘అమరగాయకుని అర్థాంగి’ పేరిట శ్రీమతి ఘంటసాల సావిత్రి జీవిత ప్రస్తానాన్ని చూపుతుందీ పుస్తకం. ఘంటసాల గానసభనుండి వెలువడిన ఈ గ్రంథాన్ని డా.కె.వి.రావు రచించారు. ముందుగా ఘంటసాలవారి వాక్కుకు వున్న శక్తిని తెలియజేసారు. ఆయన ఏది మాట్లాడితే అది జరిగేదట. భవిష్యత్తులో తనలా పాటలు పాడే గాయకులు తెలుగు సీమలో పుట్టి, గానకళను అజరామరం చేస్తారని ఆయన ఆనాడే ఊహించారట. ఆ నోటి చలవనే నేటి కాలంలో ఎంద రో గాయకులు ఆయన పాటలు పాడి జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అటువంటి గాత్రం మరి ఇంతవరకు రాలేదని పరిశీలకులు నిర్ణయించారు. తన తరువాత వారసుడు ఎస్.పి బాలు అని ఆనాడే ఘంటసాలవారు సెలవిచ్చారు.
భారత ప్రభుత్వం ఆయన గౌరవార్ధం ఓ తపాలా బిళ్లను ముద్రించింది. ఇది ఏ సినిమా గాయకునికి అందని అరుదైన గౌరవంగా సావిత్రి వివరిస్తారు. ఘంటసాల తదనంతరం చిన్నపిల్లలతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ, ఆమె తర్వాత ఓటమి అంగీకరించరాదని వారి పాటలతోనే స్ఫూర్తి పొందారు. అప్పటికి ఎన్ని ఇబ్బందులు వున్నా, ఎవరినీ చేయిచాచి అడగని మహా వ్యక్తిత్వం ఆమె సొంతం. అనేకమంది రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు ఆయన వున్నప్పుడు నిత్యం ఇంటికి వస్తూనే వుండేవారు. వారందరికీ తాను అతిథి సత్కారాలు చేయడం అదృష్టంగా భావిస్తారామె. స్వాతంత్య్ర పోరాట కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారని, ఘంటసాల మాస్టారును జైలులో పెట్టారు. ఆయన తదనంతరం భారత ప్రభుత్వం స్వతంత్ర వీరులకు ఇచ్చే సదుపాయాలన్నీ సావిత్రమ్మకు కలగజేసింది. ఆయన పాటలనే స్మరించుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసారు. కష్టసమయంలో ఎవరూ ఆదుకోకపోయినా, అభిమానుల అండతో జీవితాన్ని ఒడిదుడుకులు లేకుండా ఈదుకొచ్చారు. అవసరాలకు మద్రాసులోని ఇల్లు అమ్మితే అభిమానుల్లో ఓ వ్యక్తి ఐదు లక్షలు ఇచ్చి మళ్లీ ఆ ఇల్లువెనక్కి ఇప్పిస్తానన్నా ఆమె వారించారు. తనతోపాటు ఎంతమంది గాయకులున్నా, వారికి మంచి అవకాశాలు రావాలని అభిలషించేవారు ఘంటసాల. ఆ కోరికను అలాగే సావిత్రమ్మ కూడా కొనసాగించారు. నూతన గాయకులు ఘంటసాలను దైవంగా భావించి, ఇప్పుడు అనేకమంది రియాల్టీ షోలలో ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. వారందరికీ తన ఆశీస్సులు అందిస్తున్నారు.
ఘంటసాల అభిమానులు అనేక పట్టణాలలో గానసభలు ఏర్పాటుచేసి పాటలను వినిపిస్తున్నారు. దానికి వెన్నుదన్నుగా ఆమె ప్రోత్సాహం అందిస్తున్నారు. ఓ మహామనిషిలో అర్ధ్భాగాన్ని పాఠకులకు పరిచయం చేయడంలో ఈ గ్రంథం తనవంతు ప్రయత్నాన్ని చేస్తుంది. ముఖ్యంగా రచయిత ఘంటసాల అభిమాని కావడంతోఈ గ్రంథానికి తావి అబ్బి, గంధర్వలోక పారిజాత పరిమళం అబ్బింది. ఇప్పటివరకు ఘంటసాల పేరుతో ఎక్కడెక్కడ ఏఏ కార్యక్రమాలు జరిగాయి, కళాపీఠాలు స్థాపించి ఎవరెవరు ఆయన బాటలో సాగుతున్నారు తదితర విషయాలు ఆహ్వాన పత్రాలతో సహా ముద్రించారు. అక్కడక్కడ విషయానికి తగ్గట్టు అరుదైన మంచి ఫొటోలు అందించారు. పుస్తకంలోని కాగితం క్వాలిటీ బాగుండి రచయిత శైలి చదివింపచేస్తుంది. అన్నింటితోపాటు సావిత్రమ్మగారి స్వగతంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఘంటసాల అభిమానులందరూ చదవదగ్గ పుస్తకం ఇది. తన భార్య దృష్టిలో ఆ అమరగాయకుని మూర్తిత్వాన్ని దర్శింపచేస్తూ సాగిన ఈ రచన, సినీ ప్రియకులకు అలనాటి విశేషాలను అందిస్తుంది.