Friday, June 10, 2011

గళం వారి బలం


దూరదర్శన్ కేంద్రంలో ఎనౌన్సర్ ఉద్యోగానికి వెళ్లిన అతన్ని నీ వాయిస్ పనికిరాదని పంపించేశారు. తర్వాత అదే వాయిస్ కారణంగా అతను బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యాడు. తన గంభీరమైన గళంతో హిందీ చిత్ర రంగాన్ని ఓ కుదుపు కుదిపేసిన అతనే మరెవరో కాదు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. దీవార్, కాలియా, అకేలా..అగ్నిపథ్ తదితర సినిమాల్లో అమితాబ్ డైలాగ్స్‌కి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. కేవలం అతడి డైలాగ్స్ వల్లనే అనేక చిత్రాలు హిట్ అయ్యాయి కూడా!
ముఖ్యంగా ‘దీవార్’ డైలాగ్స్ వాయిస్ గంభీరంగా ఉండడం మాత్రమే కాదు సన్నివేశానికి, భావానికి అనుకూలంగా టైమింగ్‌తో చెప్పాలి. అందులో అమితాబ్ సిద్ధహస్తుడు. ఈరోజుకీ కాలర్‌ట్యూన్స్‌గా ఈ డైలాగులు మనకి వినిపిస్తుండడం ఇందులో గొప్పతనం. గళ సంద్ర కెరటాలనుండి ఉవ్వెత్తున ఎగసిన హీరో అమితాబ్.
ఇక మన తెలుగు చిత్రసీమ విషయానికి వస్తే సంభాషణలు పలకడానికి చరిత్ర ఏర్పడింది నాటి ఎస్.వి రంగారావునుండి నేటి ప్రకాశ్‌రాజ్ వరకూ. ఎస్.వి రంగారావు మాటలు వింటేనే సెట్‌లో ఉండేవాళ్లు అదిరిపడేవారు. ఎంతటి డైలాగ్‌నైనా అవలీలగా చెప్పడం ఆయన ప్రతిభకు తార్కాణం. గంభీరమైన వాయిస్‌తో మనిషి కూడా ఎంతో హుందాగా ఉండేవారు. రఫ్‌గా, కేర్‌లెస్‌గా అరవీరభయంకరులు ఎదురుగా నిలిచినా చెక్కుచెదరకుండా తొణక్కుండా ‘పోరా గూట్లే’ అని చెప్పడం అతనికే చెల్లింది. సినిమాలో ఎస్‌వి ఉన్నారంటే సంభాషణా రచయితలు హాట్ హాట్‌గా డైలాగులు రాసేవారు. ఎస్‌వి పలికిన డైలాగుల కారణంగా ఎందరో సినీ రచయితలకి పేరొచ్చింది. ఆతర్వాత అనేక చిత్రాలకి వాళ్లు సంభాషణల రచయితలుగా కొనసాగారు. ఎస్‌వితో పోటీగా ఎంతో వేగంగా డైలాగులు చెప్పడానికి తోటి నటీనటులు తొందరపడేవారు. భయపడేవారు. ‘హే...బానిసలు...బానిసలకి ఇంత అహంకారమా’ పాండవ వనవాసం చిత్రంలోని దుర్యోధనుడిగా ఎస్‌వి పలికిన ఈ డైలాగ్ హైలెట్. ఆయన గంభీరమైన గళానికి అనుకూలమైన పాత్రలే అతనికి ఇచ్చేవారు. దుర్యోధనుడిగా, ఘటోత్కచుడిగా, రౌడీలకి రౌడీగా, కత్తుల రత్తయ్యగా, పోలీసు అధికారిగా ఎస్‌వి దారే వేరు. శకుని పాత్రలకు సరిగ్గా సరిపోయే ధూళిపాళ హావభావాలకి అనుగుణంగా పదాలు పైకి లేపుతూ తగ్గిస్తూ డైలాగ్స్ చెప్పడం ఎందరినో ఆకట్టుకుంటుంది.
సిఎస్‌ఆర్ ఆంజనేయులు కూడా ఓ చిత్రమైన మేనరిజంతో సంభాషణలు పలికేవారు. అమాయకరాజు పాత్రలో సిఎస్‌ఆర్ చెప్పే డైలాగులకు హాలులో చప్పట్లుపడేవి. చాలా సులువుగా భాషలో స్పష్టత కోల్పోకుండా పదాలు పలకడం సిఎస్‌ఆర్ గొప్పతనం. తర్వాత తప్పకుండా చెప్పుకోవాల్సింది రక్తకన్నీరు నాగభూషణం గురించి. ఫలానా సినిమాలో నాగభూషణం ఉన్నాడంటే ఆసక్తికర వ్యంగ్య సంభాషణలు ఉంటాయని ప్రేక్షకులు ఎగబడేవారు. తమిళహీరో ఎం.ఆర్.రాధాకి తెలుగులో నాగభూషణం డబ్బింగ్ చెప్పేవారు. కేవలం తన ప్రత్యేక సంభాషణలు పలకడం ద్వారానే నాగభూషణం ప్రతినాయక పాత్రలో చక్కగా రాణించారు. ఎస్.వి.రంగారావుతో ఆ రోజుల్లో పోటీపడి డైలాగులు చెప్పడం ఇతనికే చెల్లింది.
రేడియో శ్రోతలని తన కంచుకంఠంతో ఆకట్టుకునే కొంగర జగ్గయ్య సినీ రంగానికి అరంగేట్రం చేసి డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సన్నివేశానికి అనుగుణంగా వాయిస్ మార్చడంలో జగ్గయ్య ప్రత్యేకత. అల్లూరి సీతారామరాజు సినిమాలో రూథర్‌ఫర్డ్ పాత్ర అంత గొప్పగా పండిందంటే అందుకు జగ్గయ్య ఇంగ్లీషు దొర మాదిరిగా పలికిన సంభాషణలే కారణం. అప్పట్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. స్వతహాగా జగ్గయ్య భాషావేత్త, సాహితీవేత్త కావడంవలన ఏ భాషలోనైనా అవలీలగా డైలాగులు చక్కగా చెప్పేవారు. సినీ రంగానికి చెందిన వారే కాదు ఇతరత్ర రంగాలల్లోని మేధావులు కూడా జగ్గయ్య గళాన్ని అభినందించారు. దటీజ్ కొంగర జగ్గయ్య. చివరికి ఆయన చనిపోయినప్పుడు ఓ పత్రిక పతాక శీర్షికలో ఫ్రంట్ పేజీలో ‘మూగబోయిన కంచుకంఠం’ అంటూ రాసింది. ఆయన గళంలో గంభీరం, ఆప్యాయత, ప్రేమ ఉండేవి. ముఖ్యంగా ఏదో ఆర్ధత ఉండేది. భాషమీద మాత్రమే కాదు...ఏ డైలాగ్ ఎలా చెప్పాలి అనేదానిపై జగ్గయ్య పరిశోధన చేశారు.
ముత్యాలముగ్గు సినిమా అనగానే అందరికీ రావుగోపాలరావు డైలాగులు గుర్తుకు వస్తాయి. ప్రతిభావంతంగా వ్యంగ్య సంభాషణలు పలికి చిత్ర విజయానికి ‘రావు’ కారణమయ్యారు. ఈ సినిమా డైలాగ్స్ కేసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. ‘ఊరికే తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏముంది..మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి’. ఈ రోజుకీ మన తెలుగు సంస్కృతిలో నాడు ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు చెప్పిన డైలాగ్ గుర్తుండిపోయింది.
ఆ తర్వాత మోహన్‌బాబు, శ్రీహరిలు కూడా ఇదే బాటలో నడిచారు. నటప్రపూర్ణ మోహన్‌బాబు కూడా అమితాబ్ మాదిరిగా తన గళమే అవకాశాలు తీసుకువచ్చింది. హీరోగా పేరు ప్రతిష్టలు వచ్చేలా చేసింది. సింపుల్‌గా, సీరియస్‌గా కత్తితో నరికినట్టు డైలాగులు చెప్పడం మోహన్‌బాబుకే సాధ్యం. ‘ఖైదీగారు’ చిత్రంలో ఓ డైలాగ్ ఉంది ‘ఇద్దరు కలిస్తే పుట్టాం...నలుగరు మోస్తే పోతాం’ భలేగా ఉంటుంది పలికే విధానం. పెదరాయుడు, అసెంబ్లీరౌడీ, ఎమ్.్ధర్మరాజు ఎంఎ, పుణ్యభూమి నాదేశం, కలెక్టరుగారు తదితర చిత్రాలు నటప్రపూర్ణ గళంలోని ప్రతిభకు అద్దం పట్టాయి.
ఆ మధ్య మాటల రచయిత ఓంకార్ కూడా అనేక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు ధరించి..వ్యంగ్యంగా డైలాగ్స్ పలికాడు. కొంతవరకు సంభాషణల సాగరం రావుగోపాలరావును మరిపించాడు. డబ్బింగ్ కళాకారులకి స్టార్‌డమ్ ఇలాంటి వారివలనే వచ్చింది.
ఇలా డబ్బింగ్‌ను నమ్ముకుని తమ గళంపై నమ్మకంతో చిత్రరంగానికి వచ్చింది పి.జె శర్మ కుటుంబం. సినీ డబ్బింగ్‌కి తమ కుటుంబాన్ని అంకితం చేశారు. అందులోనుండి వచ్చిన ప్రళయమే డైలాగ్‌కింగ్ సాయికుమార్. ‘అంకుశం’ సినిమా హిట్ కావడానికి సాయి గళం ప్రధాన కారణం. రాజశేఖర్, సుమన్, మమ్ముట్టి, సురేష్‌గోపిలతో పాటు అనేక భాషల హీరోలకి సాయి కుమార్ తన గళాన్ని అందించారు. ఇక్కడ కూడా గణమే సాయికుమార్‌ని హీరోని చేసింది. ‘పోలీస్‌స్టోరీ’ లాంటి పెద్ద హిట్‌ని అతని ఖాతాలో జమచేసింది. ఈ చిత్రంలో డైలాగ్స్ బాగుండడమేకాదు సాయి పలికేవిధానం కూడా సూపర్‌గా ఉంటుంది. గుక్క తిప్పుకోకుండా సాయికుమార్ అరగంటపాటు డైలాగ్ చెప్పడం గ్రేట్.
రావుగోపాలరావు లాంటి నటుడి కొడుకుగా ఉండి కూడా అష్టకష్టాలు పడి చిత్రసీమలో చేరి కేవలం తన గళం కారణంగానే స్థిరపడిన ప్రత్యేక నటుడు రావు రమేష్. క్రిష్ డైరక్షన్‌లో వచ్చిన ‘గమ్యం’ సినిమాకి రావు రమేష్ డైలాగ్ డెలివరీ బలాన్ని చేకూర్చింది. నటుడిగా అతని కెరీర్‌ని పూర్తిగా నిలబెట్టింది. తర్వాత చెప్పుకోవాల్సింది ప్రకాష్‌రాజ్ గురించి. భాష రాకపోయినా సరే తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకునే దమ్మున్న నటుడు. మనసిచ్చి చూడు, సుస్వాగతం, అమ్మాయికోసం, అజాద్ చిత్రాల్లో ప్రకాష్‌రాజ్ చిత్ర విచిత్ర గళశక్తి మనకి తెలుస్తుంది. తమ గళాన్ని హీరోగా చేసిన వీరందరి జీవితాలు ధన్యం!

No comments: