ఇది రీమేక్ చిత్రాలపై ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన వ్యాసం.గమనించగలరు.
మణిరత్నం తీసిన ఒక తమిళ సినిమాను మరొక భాషలోకి రీమేక్ చెయ్యమని ఒక నిర్మాత అడిగితే ‘చెయ్యను. అది కక్కిన కూటిని మళ్లీ తినడం లాంటిది’ అని చెంప దెబ్బ కొట్టినట్టుగా జవాబు చెప్పాడు. అదీ సృజనాత్మక హృదయం వున్నవాడి స్పందన.
ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరొక భాషలోకి రీమేక్ చేస్తే పోనీ, అది వ్యాపారం అనుకుందాం. తెలుగులో ఒకసారి వచ్చి కళాత్మక చిత్రంగా, సూపర్ డూపర్ హిట్టయి ప్రేక్షకుల హృదయాలలో గూడు కట్టుకున్న సినిమాను మళ్లీ తెలుగులోనే రీమేక్ చేస్తే దాన్ని ఏమనాలి? ఎంత దౌర్భాగ్యం పట్టింది తెలుగు సినీకళామ తల్లికి అని హృదయం తల్లడిల్లదా? సృజనకు ఆది, అంతం వుందా? కళాత్మక హృదయాలకు కరువు వుంటుందా?
ఒకసారి విడుదలై విజయవంతమైన చిత్రంలో కథ, మాటలు, సన్నివేశాలు సంగీతంలో మిళితమై, కళాత్మకమైన విలువలు కలిగి వుంటాయి. నటీనటులు తమ పాత్రలలో జీవించి ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచి వుంటారు. అటువంటి చిత్రాలను మళ్లీ నిర్మించి తమ దౌర్భాగ్యాన్ని చాటుకోవడం తప్ప ఎటువంటి విలువలు వుండవు. 1957లో విడుదలై తెలుగుదేశమంతా విజయవిహారం చేసిన ‘మాయాబజార్’ ను మళ్లీ రీమేక్ చేసే సాహసం ఎవరికుంటుంది? ఏ పారిశ్రామిక వేత్తనుగానీ, వృత్తి కళాకారునిగానీ, ఎనభై ఏళ్లున్న సీనియర్ సిటిజన్నుగానీ మీకునచ్చిన సినిమా ఏదీ అని అడిగితే తడుముకోకుండా ‘మాయాబజార్’ అని చెబుతారు. అంత ఘనమైన చరిత్ర వుంది కాబట్టే నలుపు తెలుపుల ‘మాయాబజార్’కి రంగులద్ది ముచ్చటపడ్డారు తెలుగువారు. కానీ ఒకప్పుడు కళాఖండాలుగా చరిత్రలో నిలిచిన చిత్రాలను సూపర్ డూపర్ హిట్టయి కనకవర్షం కురిపించి అశేష ప్రేక్షకులను అలరించిన చిత్రాలను మళ్లీ రీమేక్ చేయకూడదనే బుద్ధి మన నిర్మాతలకు ఎప్పుడొస్తుందో తెలియడంలేదు. తెలుగు సినిమా టాకీ మొదలైన రోజుల్లో ఒకే కథను ఇద్దరు నిర్మాతలు తీసి పోటా పోటీగా ఒకేరోజున విడుదల చేయడం చరిత్రలోవుంది. ఒకరు ‘ద్రౌపదీ మానసంరక్షణ’ అని మొదలుపెడితే మరొకరు ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ అని టైటిల్ నిర్ణయించేవారు. అలా ఒకే కథతో పోటాపోటీగా నిర్మాణం జరుపుకోవడం 1950లో వచ్చిన ‘లక్ష్మమ్మ’, ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ వరకూ జరిగింది. లక్ష్మమ్మలో నారాయణరావు, కృష్ణవేణి హీరో హీరోయిన్లు, శ్రీ లక్ష్మమ్మలో అప్పటి సూపర్‌స్టార్ అక్కినేని నాగేశ్వరరావు హీరో, అంజలి హీరోయిన్. అయినా లక్ష్మమ్మ కథ ఘనవిజయం సాధించి, శ్రీ లక్ష్మమ్మ కథ పరాజం పాలైంది. ఇమేజ్ పరంగా చూస్తే అక్కినేని అప్పటికి నెంబర్ వన్ స్థానంలో వున్నారు. కీలుగుర్రం, బాలరాజు వంటి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలోవున్నాయి. శ్రీ లక్ష్మమ్మ కథలో బూతు పాటలు ‘నా అప్పడాల కర్ర, నీ ఆవకాయ బద్ద’ వంటివి వున్నందున ప్రేక్షకులు తిరస్కరించారని అప్పట్లో చెప్పుకునేవారు. ఒకసారి సూపర్ హిట్టయిన సినిమాను మళ్లీ రీమేక్ చేస్తే విజయవంతమైన దాఖలాలు లేవు. ‘మరోచరిత్ర’ను అట్టహాసంగా ఫారిన్ లొకేషన్స్‌లో తీసినా డిజాస్టర్ ఎందుకైందో? ప్రేక్షకులు పాత మరోచరిత్రను ఎందుకు స్మరించుకుంటున్నారో సమీక్షించుకోవాలి. సంగీతపరంగా, సాహిత్యపరంగా, దర్శకత్వపు విలువలు, భీమిలి సముద్రపు సౌందర్యం ఇలా ఎన్నో విధాలుగా వున్నతమైంది మరో చరిత్ర. మహానటుడు కమలహసన్ పరిణిత నటనతో సరిత పాత్రలకు జీవంపోసి ప్రేక్షకుల హృదయాలలో శాశ్వతమైన స్థానం సంపాదించిన ‘మరోచరిత్ర’ను రీమేక్ చేయడం ఎంతో సాహసం. ఎన్నికోట్లు ఖర్చు చేసినా మరోచరిత్రను మరపించడం, కనీసం దాని పాదాల దరిదాపులకు పోవడం కూడా జరగలేదు కొత్త మరో చరిత్రకు. ఇదొక చరిత్రహీనమైన చిత్రం. గొప్ప చిత్రాలు మళ్లీ నిర్మించిన దాఖలాలు లోగడవున్నాయి. అవేవీ పాత చిత్రాలను మించి గొప్పగా లేవు సరికదా, విజయవంతం కూడా కాలేదనడానికి అనేక ఉదాహరణలున్నాయి. ‘అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించి సిల్వర్ జూబ్లీ చేసుకున్న ‘బ్రతుకు తెరువు’ చిత్రాన్ని మళ్లీ కలర్లో రీమేక్ చేస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. గమ్మత్తయిన విషయం ఏమిటంటే రెండింటిలోనూ హీరో అక్కినేని నాగేశ్వరరావే. భాస్కర్ ప్రొడక్షన్స్ తీసిన నలుపు తెలుపు చిత్రం ‘బ్రతుకుతెరువు’లో హీరోయిన్ సావిత్రి, ముఖ్యపాత్ర శ్రీరంజని. కొత్త ‘్భర్యాబిడ్డలు’లో కథానాయిక జయలలిత, ముఖ్య పాత్రలో కృష్ణకుమారి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేవదాసు. 1952లో విడుదలై అక్కినేని నట జీవితంలో మరుపురాని పాత్రగా నిలిచి సిల్వర్ జూబ్లీ చేసుకుంది. తమిళంలో తెలుగుకి మించి విజయవంతం అయింది. మధురై చింతామణి థియేటర్లో అరవై ఆరు వారాలు ఆడింది. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాలలో తాగుబోతు పాత్ర ‘జగమేమాయ’ అంటూ హమ్ చేస్తుందంటే ఆ దేవదాసు ప్రేక్షకుల హృదయాలలో ఎంతగా నిలిచిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. కృష్ణ కొత్త దేవదాసు రంగుల హంగులతో నిర్మించి విడుదల చేస్తే అపజయంపాలై నష్టాలు కొని తెచ్చింది. అదేరోజున పాత దేవదాసుని రిలీజ్ చేస్తే 23 ఏళ్ల తర్వాత థియేటర్లలో వందరోజులు ఆడింది. కొత్తతరం ప్రేక్షకులు విరగబడి చూసారు అదీ కళకున్న విలువ.
గొల్లభామను, భామా విజయమని మళ్లీ తీసారు. పల్నాటి యుద్ధం రీమేక్ చేసారు. అన్నీ పరాజయం పాలయ్యాయి. గుడ్డిలో మెల్లగా బాలనాగమ్మ కథ రీమేక్ ఎస్విరంగారావు విలక్షణమైన మాయల ఫకీర్ పాత్రవలన విజయవంతమైంది. ఒకప్పుడు విజయవంతమైన తెలుగు చిత్రాలనే మళ్లీ రీమేక్ చేయగూడదని చరిత్ర ఎంత హెచ్చరిస్తున్నా మన నిర్మాతలు ఎందుకు పట్టించుకోరు? రీమేకులు మేకులై గుచ్చుకుంటున్నా స్పందన లేని వారిని ఏమనాలి? ‘నవ్విపోదురుగాక మాకేమి సిగ్గు?’ అనుకునే వారిని ఏమనగలం? పగలబడి నవ్వగలం. అంతే! చారిత్రక తప్పిదాలను పదే పదే చేసిన వారిని చరిత్ర క్షమించదు.