Saturday, November 27, 2010

హాస్యానికి కేరాఫ్ అడ్రస్


‘నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వకపోవడం ఒక రోగం’. ఈ సుభాషితం ఎవ్వరిని ఉద్దేశించి చెప్పడం కాదు. నవ్వించడం ఒక యోగంగా భావించిన వారు అలనాటి హాస్యనటుడు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య. ఆయనది విలక్షణమైన శైలి. హాస్యాన్ని పండించడంలో రేలంగి దిట్ట. వెకిలి చేష్టలతో, కొంటె పనులతో, కుప్పిగంతులు వేస్తూ వెక్కిరింత కూతలతో నవ్వించడం ఆయన శైలికి విరుద్ధం. తెనాలి రామకృష్ణలాంటి చతురోక్తులతో హాస్యాన్ని పండించగలరు. ఆయన నడక నవ్విస్తుంది. ముక్కు, నోరు, కనుబొమ్మలు, హావభావాల్ని మనమీద హాస్యపు జల్లుల్ని కురిపిస్తుంటాయి. అలా నవ్వనివారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా రోగులేనని ధృవీకరించవచ్చును. త రాలు మారినా రేలంగి హాస్యం అమరమైనది. నేటి తరం ప్రేక్షకులు నవ్వకుండా ఉండలేరు. జానపదులకు ‘రేలింగోడు’గా గుర్తింపు. రేలంగికి పూర్వం సదాశివరావు హాస్యాన్ని రంగరించి విసుగెత్తించే సినిమా అయినా మూడు గంటలసేపు కుర్చీలోనుంచి లేవనిచ్చేవారు కాదు. అనంతరం రేలంగి సినీ రంగప్రవేశం అయ్యాక శివరావు కెరీర్ కుంటుపడసాగింది. రేలంగి లైమ్‌లైట్‌లోకి వచ్చారు.
రేలంగి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామంలో 1909 ఆగస్టు 9న అచ్చాయమ్మ, రేలంగి దంపతులకు జన్మించారు. తండ్రిగారు హరికథకుడు, సంగీత మాస్టారు. సంగీతంలోను, హరికథలు చెప్పడంలోను తండ్రివద్ద మెళకువలు నేర్చుకున్నారు. రేలంగి మూడేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. తండ్రి ద్వితీయ వివాహం చేసుకున్నాక రేలంగి ఆలనా పాలనా సవతితల్లే చూసుకునేది. కాకినాడ మెకర్షాన్ స్కూలులో మూడవ తరగతి చదువుకున్నారు. చదువుకన్నా పాటలు పద్యాలు పాడడంలో శ్రద్ధచూపేవారు. నాటకాలమీద మక్కువతో 1919లో బృహన్నల అనే నాటకంలో స్ర్తిపాత్రను ధరించారు. అప్పుడే నటనకు అంకురార్పణ జరిగింది. యంగ్‌మెన్ హాపీ క్లబ్ ఆధ్వర్యంలో నాటకాలు వేసేవారు. ఎస్‌వి రంగరావు, అంజలిదేవీ కూడా ఈ క్లబ్‌కు సభ్యులు. వీరి సినీరంగ ప్రవేశం కొన్నాళ్లకు జరిగింది. రేలంగి కూడా మెలమెల్లగా సినీరంగంలో కాలుమోపారు. హాస్యనటునిగా వెండితెరను శాసించారు. 1931వ సంవత్సరంలో ‘్భక్తప్రహ్లాద’ సినిమా విడుదల సందర్భంలో రేలంగి చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. తనలోని నటుని నాటకరంగానికే అంకితం కాకూడదనుకుని వెండి తెరపై నటునిగా తన ప్రతిభను కనబర్చాలని నిశ్చయించుకున్న ఆయన కలకత్తా చేరుకున్నారు. సినిమాల్లో నటించాలనే కుతూహలంతో, పట్టుదల చూసి దర్శకుడైన సి.పుల్లయ్య తను దర్శకత్వం వహిస్తున్న శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో అవకాశమిచ్చారు. ఈ చిత్రంలో నటించిన లక్ష్మీరాజ్యం, ఋష్యేంద్రమణి, కాంచనమాలకు కూడా ఇదే తొలిచిత్రం కావడం విశేషం. రేలంగి నటించిన వరవిక్రయం, గొల్లభామ చిత్రాలతో వాసి పెరగలేదు. చిన్నా చితకా వేషాలతో చేసిన సినిమాలు గుర్తింపునివ్వలేదు. పుష్కరకాలం గడిచిపోయింది. మరోసారి సి.పుల్లయ్య దర్శకత్వంలో ‘అనసూయ’ చిత్రంలో నటించడానికి రేలంగికి అవకాశం ఇచ్చారు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి, గర్భవతి అయిన భార్య కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేసాయి. అయినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. హెచ్‌ఎంరెడ్డి దర్శకత్వం వహించిన గుణసుందరి కథ చిత్రంలో మంచి పాత్రే లభించింది. తదుపరి వింధ్యారాణి, కీలుగుర్రం, మదాలస చిత్రాలలో మంచి పాత్రలొచ్చాయి. గుణసుందరి కథ చిత్రంతో ఆయన ఓ వెలుగు వెలిగారు. అందాక హాస్యనటునిగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న కస్తూరి శివరావు పేరు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అటు పరిశ్రమ ఇటు ప్రేక్షకులు రేలంగి నటనకు బ్రహ్మరథం పట్టారు.
మాయాబజార్, విప్రనారాయణ, వెలుగునీడలు, మిస్సమ్మ, దొంగరాముడు, నర్తనశాల, అప్పుచేసి పప్పుకూడు, లేతమనసులు, ఇల్లరికం, చదువుకున్న అమ్మాయిలు, ప్రేమించి చూడు, వరకట్నం, రాముడు భీముడు, నిప్పులాంటి మనిషి చిత్రాల్లో కారెక్టర్ పాత్రలు పోషించారు. రేలంగి నటుడే కాదు, గాయకుడు, నిర్మాత కూడా. పాతాళ భైరవిలో రేలంగి పాడిన ‘వినవే బాల నా ప్రేమగోల’ ఆయన క్రేజ్‌ని ఆకాశానికెత్తేసింది. ‘కాశీకి పోయాము రామాహరి’, ‘సరదా సరదా సిగరెట్టు’ పాటలు జనాదరణ పొందాయి. ‘ఇల్లరికంలో ఉన్న మజా’, కోడలు దిద్దిన కాపురంలో ‘వంట ఇంటి ఫ్రభువులం పాకశాల యోధులం’ అని హీరో ఎన్టీఆర్‌తో ఆడిపాడిన వైనం నవ్వుపుట్టిస్తుంది. మిస్సమ్మ చిత్రంలో రమణారెడ్డి సావిత్రిని ‘మేరీ ప్లీజ్’ అని అభ్యర్థిస్తుంటే రేలంగి ‘్ధర్మం ప్లీజ్’ అని అడ్డు తలగడం నవ్వు పుట్టిస్తుంది. పెద్దమనుషులు, విప్రనారాయణ, బ్రతుకుతెరువు చిత్రాలలో పాటలు పాడారు.
పాతాళభైరవిలో రాణిగారి తమ్ముడిగా, నర్తనశాలలో ఉత్తరకుమారుడిగా, మాయాబజార్‌లో లక్ష్మణకుమారుడిగా, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడిగా, జయభేరిలో లచ్చన్న బంగారయ్యగా, లవకుశలో రజకునిగా, సువర్ణసుందరిలో కైలాసంగా, ప్రేమించి చూడులో బుచ్చబ్బాయ్‌గా, జగదేకవీరుడులో రెండు చింతలుగా, వెలుగునీడలులో వెంగళప్పగా, తోడికోడళ్లులో రమణయ్యగా, అగ్గిరాముడు చిత్రంలో ఫోర్‌ఫార్టీవన్ పోలీసుగా, మిస్సమ్మలో దేవయ్యగా, అప్పుచేసి పప్పుకూడులో భజగోవిందంగా, శ్రీకృష్ణ తులాభారంలో నారదుడిగా, పక్కింటి అమ్మాయిలో సుబ్బారాయుడి పాత్రలు చిరస్మరణీయం. 1960లో ‘సామ్రాజ్యం’ ‘సమాజం’ చిత్రాలకు నిర్మాత ఆయన.
రేలంగి ఆప్తమిత్రులైన ఒకరు మరణించిన సమయంలో శవ సంస్కారాలకు స్మశానికి వెళ్లారు. రేలంగి శోకతప్త హృదయం తల్లడిల్లిపోయింది. దుఃఖం తన్నుకొచ్చింది. అంతే రేలంగి వలవల ఏడ్చేశారు. శోకంలో వున్న అక్కడివారు రేలంగిని చూసి నవ్వడం మొదలుపెట్టారు. ఆయన ఏడుపు కూడా ఎదుటివారిని నవ్వు తెప్పిస్తుంది. రేలంగి దుఃఖంలో ఏడ్చేసినా అది హాస్యంగా భావించడం ఆయన హాస్యపోషణలో అంత ఉదాత్తంగా నిలిచిపోయార్నమాట.
రేలంగికి కష్టం అంటే ఏమిటో తెలుసు. పేదరికం ఇంకా బాగా తెలుసు. ఆయన చేసిన గుప్త దానాలకు కొదవలేదు. యూనివర్సిటీలకు విరాళాలు ఇచ్చారు. ఎంతోమంది వివాహాలకు సహాయం చేశారు. ఆకలి బాధ తెలిసిన అన్నదాత. తన ఇంట్లోనే దాదాపు పాతికమందికి పైగా భోజనం పెట్టించేవారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హాస్యనటుడు మన రేలంగికి ఏ యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేయకపోవడం విచారకరమైన విషయం. రేలంగి సరసన సూర్యకాంతం, గిరిజ, ఛాయాదేవి, మీనాకుమారి, గయ్యాళి పాత్రల్లో నటించారు. గయ్యాళి భార్యలతో వేగలేక సన్యాసుల్లో చేరిపోయి భజనలు చేయడం అలనాటి హాస్యపాత్రలకు ఒరవడి సృష్టించిన ఘనత రేలంగిదే. హాస్యప్రియులైన రేలంగి చివరి చిత్రం నిప్పులాంటి మనిషి. ఈ చిత్రంలో సీరియస్‌గా నటించారు. అతిథి పాత్ర అయినా ఆవేదన చెందే పాత్ర. నవ్వుతూ నవ్వించే రేలంగి 1975 నవంబర్ 26న తనువు చాలించి అటు ప్రేక్షకుల్ని, ఇటు పరిశ్రమను దుఃఖసాగరంలో ముంచెత్తారు. అలాంటి హాస్యనటుడు తెలుగు చలనచిత్ర ప రిశ్రమలో పుట్టడు పుట్టబోడు. నభూతో నభవిష్యతి. దటీజ్ లెజండరీ కమెడియన్ రేలంగి వెంకట్రామయ్య

Friday, November 5, 2010

దీపావళి శుభాకాంక్షలు


అందరి జీవితాలలో చీకటి తొలిగి వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షిస్తూ అందరికి దీపావళి శుభాకాంక్షలు.