Sunday, February 20, 2011

యుగానికి ఒక్కడు

====
యుగానికి ఒక్కడు
రచన: వినాయకరావు
ప్రతులకు:
జయా పబ్లికేషన్స్, ఫ్లాట్ నెం 102
శ్రీశ్రీ శ్రీనివాసనిలయం
7-1-303/డి/2, బాలయ్యనగర్
సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్-38
ఫోన్: 939 473 6301
=====



సాధారణంగా ఎవరి జీవితమైనా అక్షరాల్లో పొదగాలంటే కేవలం ఆ వ్యక్తి గురించి తెలిసి వున్నా, లేదా పరిశోధించి తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ మనిషిపై గుండెల్లో ఎక్కడో కాస్తయినా అభిమానం వుండాలి. మళ్లీ అది దురభిమానం కాకూడదు. వీలయినంత ఎక్కువ అనుభవించి, జాగ్రత్తగా పలవరించగలగాలి. అప్పుడే సరైన పుస్తకం జనం ముందుకు వస్తుంది. ఎన్టీఆర్ లాంటి ప్రముఖుడిపై పుస్తకాలు ఇప్పటికే లెక్కకుమిక్కిలిగా వచ్చాయి. అలాంటిది మరో పుస్తకం తీసుకురావాలంటే కూడా చిన్న విషయం కాదు. వచ్చినవాటన్నింటిలో లేనిది, భిన్నమైనది మరేదో వుండాలి. ఇలా ఇన్ని ఈక్వేషన్లు దృష్టిలో వుంచుకుని సీనియర్ జర్నలిస్టు వినాయకరావు చేసిన అక్షరవిన్యాసం ‘యుగానికి ఒక్కడు’. పుస్తకరచన కోసం పరిశోధన సాగించడం, పరిచయాలు ఉపయోగించి వివిధ ఛాయా చిత్రాలు సేకరించడం ఒక ఎత్తు. వాటన్నింటినీ సినిమాకు స్క్రీన్‌ప్లే మాదిరిగా, ఒక పద్ధతిలో అందించడం అన్నది మరొక ఎత్తు. ఈ విషయంలో రచయిత జర్నలిస్టుగా తనకున్న అనుభవాన్ని బాగా వాడుకున్నారు. ఏ విధంగా ప్రెజెంట్ చేస్తే పాఠకజన రంజంకంగా వుంటుందన్నది బాగా పసికట్టినట్లు పుస్తకమే చెబుతుంది. దానికి తగినట్లు సరైన శీర్షికలు, ప్రెజెంటేషన్ కూడా అమరింది. మొత్తం మీద ఏదో సినిమా పుస్తకం, ఓసారి అలా అలా తిరగేస్తే సరిపోతుందని అనిపించకుండా, కాస్సేపు చదిపింపచేసేలా చేయడంలో కూడా ఆయన కష్టం కనిపించింది. మొత్తం మీద ఎన్టీఆర్‌పై కాస్త భిన్నంగా, కొత్తగా పుస్తకం తీసుకువచ్చారు.