Thursday, December 30, 2010

మైనా సినిమా చూసారా?


నేను చెప్పబోయేది తమిళ చిత్రం మైనా గురించి. మీకు తమిళ్ వచ్చినా రాకపోయినా తప్పకుండా చూడవలిసిన సినిమా మైనా. మొన్న దీపావళికి విడుదలైంది ఈ సినిమా. మంచి సినిమా చూడాలనుకొనేవారెవ్వరు మిస్ అవ్వకూడని సినిమా. అంతా కొత్త తారలతో ఒక హృద్యమైన ప్రేమ కావ్యంలా ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఇక కథ విషయానికొస్తే అందమైన కొండప్రాంతంలో పెరిగిన హీరో హీరోయిన్ల ప్రేమకథ ఏ ఏ మలుపులు తిరిగి ఎలా ముగిసింది అనేది. సినిమా అంతా ఒక రకమైన ఉత్కంఠతతో, ఒక తీయని భావనతో సాగుతూ చివరికి మనసును మెలిపెట్టేస్తుంది.ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు కాకుండా మిగిలిన కథంతా ఒక్కరొజులో జరిగిన సంఘటనలతో కూడుకొని ఉంటుంది. ఒక్కరోజులో ఎవరి జీవితాలు ఎలా మారాయి అనేది ఆసక్తికరంగా చిత్రీకరించాడు దర్శకుడు ప్రభుసాల్మన్. తమిళనాట విజయదుంధుభి మ్రోగించిన ఈ సినిమా తెలుగులో డబ్ అవుతుందో లేదో చూడాలి.

అంతా కొత్తవారైనా చాలా బాగా చేశారు. ముఖ్యంగా "తేని" ప్రాంతం అందాలు చాలా బాగున్నాయి. సినిమా చూసాకా కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది. మొత్తం పది భాగాలు. వరసగా చూడొచ్చు. మీరు కూడా ఈ సినిమా చూడాలనుకుంటే ఈ కింద లింకులో మొదటి భాగం చూడొచ్చు. మిగతా భాగాలు ఆ పక్కనే ఉంటాయి.

http://www.youtube.com/watch?v=eYMR3eNJ6-E&feature=related

మీకూ ఈ సినిమా నచ్చితే ఒక కమెంటు పడేయండి. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Tuesday, December 28, 2010

అన్నపూర్ణ వారి దొంగరాముడు


కళాత్మక విలువలు కలిగిన, కలకాలం కళ్లల్లో కాపురం చేసే కమనీయ చిత్రాలు నిర్మించి తెలుగు చిత్రాల స్థాయిని అపురూపమైన అంతస్తుకు తీసుకుని పోయిన ప్రతిష్ఠాత్మక సంస్థ ‘అన్నపూర్ణ’. కథ, కథా కథనం, నటనాస్థాయి, సంభాషణలు, సంగీత సాహిత్యాల విషయంలో అత్యున్నత ప్రమాణాలను అగపరిచిన ఈ సంస్థ 1955లో ఊపిరిపోసుకుని దుక్కిపాటి మధుసూదనరావు నేతృత్వంలో ఒక నూతనాధ్యాయనానికి ప్రాణప్రతిష్ఠ సలిపింది. దుక్కిపాటి తల్లిగారి పేరుతో నెలకొల్పిన ఈ సంస్థ కె.వి.రెడ్డికోసం రెండేళ్లపాటు వేచి వుండి ఆయన దర్శకత్వంలోనే ప్రధమ ప్రయత్నంగా ‘దొంగరాముడు’ నిర్మించి విడుదల చేసింది.
అన్న దొంగతనాలు చేసి తమ్ముడ్ని చదివించడం అంశంగా కల ‘లవింగ్ బ్రదర్స్’ అనే ఆంగ్ల కథలోని తమ్ముడి పాత్రను చెల్లెలుగా మార్చి సజీవమైన పాత్రతో చిత్రకథను పకడ్బందీగా తయారుచేసారు కె.వి.రెడ్డి, దుక్కిపాటి, డి.వి.నరసరాజులు స్క్రీన్‌ప్లేను తయారుచేయడం విశేషం. కథలోని అనేక పాత్రలను అతి సహజంగా ప్రవేశపెట్టి పరిచయం చేయడం కె.వి.రెడ్డి ప్రతిభకు నిదర్శనం. కొత్తగా దర్శకులు కాగోరే ప్రతి ఒక్కరు ‘దొంగరాముడు’ తప్పక చూడవలసిందేనని ప్రఖ్యాత దర్శకులు బాపు పేర్కొనడం ఈ చిత్రం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అందుకే నేడు పూనా ఇన్‌స్టిట్యూట్‌లో పాఠ్యాంశంగా ‘దొంగరాముడు’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దొంగరాముడు స్క్రిప్ట్ తెలుగు సినీ దర్శకుల పాఠ్య గ్రంథంగా నిలిచిపోయిందని నవతరం దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి కూడా పేర్కొన్నారు.
టైటిల్ పాత్రను అక్కినేని అత్యంత సహజంగా పోషించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు. ఆయన ప్రేమించిన యువతిగా కూరలమ్ముకునే పాత్ర సావిత్రి ధరించింది. ఆ పాత్ర పోషణపట్ల సావిత్రి తీసుకున్న శ్రద్ధాసక్తులు అమోఘం. గంపనిండా గడ్డిపెట్టి పైన నాలుగు వంకాయలు, టమాటాలు వేసి ఇవ్వడంతో దుక్కిపాటి చెప్పినా, వినకుండా గంపనిండా కాయగూరలు వేసి ఆ బరువుతోనే సావిత్రి నటించడం విశేషం. జగ్గయ్య, జమున, రేలంగి, సూర్యకాంతం ఆయా పాత్రలకు జీవరేఖలు దిద్దారు. ‘బాబుల్‌గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి’ అంటూ ఆర్.నాగేశ్వరరావు మరుపురాని నటనను ప్రదర్శించాడు. జగ్గయ్య అన్నగా రంగస్థల నటులు రామన్నపంతులు నటించడం విశేషం. డి.వి.నరసరాజు డైలాగులు బుల్లెట్లను మరిపించాయి. సీనియర్ సముద్రాల పాటలు, పెండ్యాల సంగీతం పాలుతేనె కలయికలా అతి మధురంగా తయారై ప్రేక్షకులను అలరించాయి. భీంప్లాస్ రాగంలో పి.సుశీల పాడిన ‘అనురాగము విరిసేనే’ పాట ప్రేక్షకుల గుండెల్లో పూలు పూయిస్తుంది. ఘంటసాల, జిక్కి పాడిన ‘చిగురాకులలో చిలకమ్మా’ పాట పాపులర్ అయింది. జిక్కిపాడిన ‘రావోయి మా ఇంటికి’ పాటలో వినిపించిన మాటలు అచ్చం ఆర్.నాగేశ్వరరావులా పలికినవారు క్యారెక్టర్ నటుడు మద్దాలి కృష్ణమూర్తి. ఆయన ఈ చిత్రంలో ఇన్‌స్పెక్టర్ వేషం వేశారు. ‘లేవోయి చిన్నవాడా’ అంటూ కుచలకుమారి చక్కని నృత్యం చేసింది. ఈ చిత్రాన్ని ‘తిరుట్టురామన్’ పేరుతో తమిళంలోకి డబ్ చేయగా ఎవిఎంవారు కృష్ణన్‌పంజు దర్శకత్వం, మదన్‌మోహన్ సంగీతం, కిశోర్‌కుమార్, సాధనలలో హిందీలో ‘మన్‌వౌజ’ నిర్మించారు. ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవం 1-10-1955న విడుదలైన ఈ చిత్రం శత దినోత్సవం జరుపుకుంది.

Tuesday, December 14, 2010

అక్కినేని కథానాయికలు


విలాసినులైనా, విషాద నాయికలయినా సమతూక సరసవతులైనా, పాత్రబరువైనా, తేలికయినా, ఇలా వచ్చి అలావెళ్లే మెరుపు తీగలైనా ఎయన్నార్ సరసన, సరిసరి నటనల సిరిసిరి సితారలే. హీరో అంటే వీరుడు, శూరుడు, పరాక్రమవంతుడే కాదు, విషాద కథానాయకుడు, విమల భక్త శిఖామణి, రొమాంటిక్ హీరో అని నిరూపించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ‘ఏంట్రా దేవదాస్‌లా?’, ‘వచ్చాడండీ విప్రనారాయణుడూ!’, ‘వాడో బాటసారి’ అని జనం తమకి తాము ఆపాదించుకునేలా పాత్రే కనబడే నటన అతనిది.
అక్కినేని సరసన నటించిన హీరోయిన్లతో విశాఖపట్నంలోని వంశీ రామరాజు ఆధ్వర్యంలో అతనికోసారి పుష్పాభిషేకం జరిగింది. కానీ 1940నుండి నేటిదాకా 60మంది అక్కినేని కథానాయికలు, సహపాత్రధారుల సమాచార, ఛాయా చిత్ర సహిత ‘అక్షరాభిషేకం’ ఎస్వీరామారావు వెలువరించిన ‘అక్కినేనీ కథానాయికలు’. అక్కినే‘ని’లో ‘నీ’ అనడంలోనే శీర్షికా ఔచిత్యం తెలుస్తుంది. అక్కినేని నట జీవితంలో ట్రెండ్ సెట్టింగ్ పాత్రలు బాలరాజు, విప్రనారాయణ, సీతారామయ్యగారి మనవరాలు. ఆ ఛాయా చిత్రాల్ని పుస్తకం అట్టమీద పొందుపరచడం బాగుంది.
‘ఎ సెలబ్రిటీ ఈజ్ సమ్‌వన్ హూ గోస్ బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ హిజ్/హెర్ ఫీల్డ్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ పాపులర్ కల్చర్ అండ్ పీపుల్’’-ప్రతి ఏడు సెప్టెంబర్ 20వ తేదీన ఎయన్నార్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన పేరిట జరిగే సాంస్కృతిక మేళా అరుదైనది. ఏ ఇతర హీరోకి లభించని అపూర్వ అదృష్టం. అలాగే అక్కినేని తను స్వయంగా రాసిన ‘అఆలు’తో సహా ఆయన మీద వచ్చినన్ని పుస్తకాలు ఏ తెలుగు హీరోపైనా రాలేదు. ముళ్లపూడి వెంకటరమణగారి (కథానాయకుడి కథ) బోణీ ఎందరికో బాణియై అక్కినేని గ్రంథాలుగా విలసిల్లుతోంది. అందులో తాజాగా వెలువడిందే ఈ ‘అక్కినేనీ కథానాయికలు’.
ఎన్ని రాసినా, ఎన్ని చెప్పినా, ఎన్ని జ్ఞాపకాల దొంతర్లు పేర్చినా ఎనె్నన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకుని గుట్టలు పోసినా పరిశోధకులకు పలు అంశాలు మిగిలే ఉండే అభినయ సముద్రుడు అక్కినేని. ఆ పయోధినుండి అరవై ఆణిముత్యాలను ఎంచి మునుపెన్నడూ ఎవరూ స్పృశించని అంశాలను అపురూపంగా అందించారు ఎస్.వి.రామారావు.
ఎఎన్నార్ తొలి కథానాయిక ధర్మపత్నిలో సీతగా నటించిన బాల త్రిపుర సుందరి నుండి 168వ పేజీలోని సూర్యకాంతం దాకా ఏకబిగిన చదివిస్తుంది. మధ్య మధ్య వచ్చే పాటల పల్లవులు పఠితను ఊహలపల్లకి ఎక్కిస్తాయి. ఏ పరిశోధనకైనా విషయ సేకరణ ప్రణాళిక పద్ధతి అత్యంత కీలకమైనది. ఒ విశ్వవిద్యాలయ పరిశోధనా విద్యార్థిలా 65 అంశాలను వింగడించారీ పుస్తకంలో అరుదైన ఛాయాచిత్రాలు, చదువరిని మూడ్‌లోకి తీసుకువెళ్లేపాటల ఎంపిక ప్రత్యేకంగా, ప్రధానంగా ప్రశంసాపాత్రమైనవి. ఆయా తారల అప్‌డేట్ సంగతులు ఆహా! అనిపిస్తాయి.
కథానాయికలు, ఇతరులు, ఆయా సంస్థలు, నిర్మాత, దర్శకులు, కథా కమామీషు, సంగతి సన్నివేశ సందర్భాల ప్రస్తావన సంక్షిప్తీకరించినతీరు రచయితకు సబ్జెక్టుమీద వున్న పట్టును తెలియజేస్తుంది. దాదాపు 200 సినిమాలను ఫోటోలతో, పాటలతో జతచేసి సౌందర్యవంతంగా పేజీలను అలంకరించారు. ఒక్క సురభి బాలసరస్వతి ఫోటో లేని లోటు లోటే.
ఒక సినిమా చూసి బైటికొస్తే కనీసం ఒక్క పాట పల్లవయినా మన వెంట రావాలి. ఈ పుస్తకం చదివాక గ్యారంటీగా అనేక పాటల పల్లవుల పరిమళాలు మనల్ని వెంటాడి అలరిస్తాయి. వినూత్న కోణంలో విభిన్న అంశాలను అందించి, పరిశ్రమించిన ఎస్.వి.ఆర్ ప్రతిభా బ్యాంక్‌లోకే ఆ క్రెడిటంతా జమ అవుతుంది. చరిత్రను నమోదు చేసే ఇలాంటి మంచి ప్రయత్నాలు ఎంతో అభినందనీయం. ఎఫ్‌డిసి వారు ఇటువంటి రచయితలకు ఆ పనులు అప్పగిస్తే తెలుగు చలనచిత్ర చరిత్ర భావి తరాలకు నిధి అవుతుంది.