Tuesday, December 14, 2010

అక్కినేని కథానాయికలు


విలాసినులైనా, విషాద నాయికలయినా సమతూక సరసవతులైనా, పాత్రబరువైనా, తేలికయినా, ఇలా వచ్చి అలావెళ్లే మెరుపు తీగలైనా ఎయన్నార్ సరసన, సరిసరి నటనల సిరిసిరి సితారలే. హీరో అంటే వీరుడు, శూరుడు, పరాక్రమవంతుడే కాదు, విషాద కథానాయకుడు, విమల భక్త శిఖామణి, రొమాంటిక్ హీరో అని నిరూపించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ‘ఏంట్రా దేవదాస్‌లా?’, ‘వచ్చాడండీ విప్రనారాయణుడూ!’, ‘వాడో బాటసారి’ అని జనం తమకి తాము ఆపాదించుకునేలా పాత్రే కనబడే నటన అతనిది.
అక్కినేని సరసన నటించిన హీరోయిన్లతో విశాఖపట్నంలోని వంశీ రామరాజు ఆధ్వర్యంలో అతనికోసారి పుష్పాభిషేకం జరిగింది. కానీ 1940నుండి నేటిదాకా 60మంది అక్కినేని కథానాయికలు, సహపాత్రధారుల సమాచార, ఛాయా చిత్ర సహిత ‘అక్షరాభిషేకం’ ఎస్వీరామారావు వెలువరించిన ‘అక్కినేనీ కథానాయికలు’. అక్కినే‘ని’లో ‘నీ’ అనడంలోనే శీర్షికా ఔచిత్యం తెలుస్తుంది. అక్కినేని నట జీవితంలో ట్రెండ్ సెట్టింగ్ పాత్రలు బాలరాజు, విప్రనారాయణ, సీతారామయ్యగారి మనవరాలు. ఆ ఛాయా చిత్రాల్ని పుస్తకం అట్టమీద పొందుపరచడం బాగుంది.
‘ఎ సెలబ్రిటీ ఈజ్ సమ్‌వన్ హూ గోస్ బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ హిజ్/హెర్ ఫీల్డ్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ పాపులర్ కల్చర్ అండ్ పీపుల్’’-ప్రతి ఏడు సెప్టెంబర్ 20వ తేదీన ఎయన్నార్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన పేరిట జరిగే సాంస్కృతిక మేళా అరుదైనది. ఏ ఇతర హీరోకి లభించని అపూర్వ అదృష్టం. అలాగే అక్కినేని తను స్వయంగా రాసిన ‘అఆలు’తో సహా ఆయన మీద వచ్చినన్ని పుస్తకాలు ఏ తెలుగు హీరోపైనా రాలేదు. ముళ్లపూడి వెంకటరమణగారి (కథానాయకుడి కథ) బోణీ ఎందరికో బాణియై అక్కినేని గ్రంథాలుగా విలసిల్లుతోంది. అందులో తాజాగా వెలువడిందే ఈ ‘అక్కినేనీ కథానాయికలు’.
ఎన్ని రాసినా, ఎన్ని చెప్పినా, ఎన్ని జ్ఞాపకాల దొంతర్లు పేర్చినా ఎనె్నన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకుని గుట్టలు పోసినా పరిశోధకులకు పలు అంశాలు మిగిలే ఉండే అభినయ సముద్రుడు అక్కినేని. ఆ పయోధినుండి అరవై ఆణిముత్యాలను ఎంచి మునుపెన్నడూ ఎవరూ స్పృశించని అంశాలను అపురూపంగా అందించారు ఎస్.వి.రామారావు.
ఎఎన్నార్ తొలి కథానాయిక ధర్మపత్నిలో సీతగా నటించిన బాల త్రిపుర సుందరి నుండి 168వ పేజీలోని సూర్యకాంతం దాకా ఏకబిగిన చదివిస్తుంది. మధ్య మధ్య వచ్చే పాటల పల్లవులు పఠితను ఊహలపల్లకి ఎక్కిస్తాయి. ఏ పరిశోధనకైనా విషయ సేకరణ ప్రణాళిక పద్ధతి అత్యంత కీలకమైనది. ఒ విశ్వవిద్యాలయ పరిశోధనా విద్యార్థిలా 65 అంశాలను వింగడించారీ పుస్తకంలో అరుదైన ఛాయాచిత్రాలు, చదువరిని మూడ్‌లోకి తీసుకువెళ్లేపాటల ఎంపిక ప్రత్యేకంగా, ప్రధానంగా ప్రశంసాపాత్రమైనవి. ఆయా తారల అప్‌డేట్ సంగతులు ఆహా! అనిపిస్తాయి.
కథానాయికలు, ఇతరులు, ఆయా సంస్థలు, నిర్మాత, దర్శకులు, కథా కమామీషు, సంగతి సన్నివేశ సందర్భాల ప్రస్తావన సంక్షిప్తీకరించినతీరు రచయితకు సబ్జెక్టుమీద వున్న పట్టును తెలియజేస్తుంది. దాదాపు 200 సినిమాలను ఫోటోలతో, పాటలతో జతచేసి సౌందర్యవంతంగా పేజీలను అలంకరించారు. ఒక్క సురభి బాలసరస్వతి ఫోటో లేని లోటు లోటే.
ఒక సినిమా చూసి బైటికొస్తే కనీసం ఒక్క పాట పల్లవయినా మన వెంట రావాలి. ఈ పుస్తకం చదివాక గ్యారంటీగా అనేక పాటల పల్లవుల పరిమళాలు మనల్ని వెంటాడి అలరిస్తాయి. వినూత్న కోణంలో విభిన్న అంశాలను అందించి, పరిశ్రమించిన ఎస్.వి.ఆర్ ప్రతిభా బ్యాంక్‌లోకే ఆ క్రెడిటంతా జమ అవుతుంది. చరిత్రను నమోదు చేసే ఇలాంటి మంచి ప్రయత్నాలు ఎంతో అభినందనీయం. ఎఫ్‌డిసి వారు ఇటువంటి రచయితలకు ఆ పనులు అప్పగిస్తే తెలుగు చలనచిత్ర చరిత్ర భావి తరాలకు నిధి అవుతుంది.

No comments: