Tuesday, December 28, 2010

అన్నపూర్ణ వారి దొంగరాముడు


కళాత్మక విలువలు కలిగిన, కలకాలం కళ్లల్లో కాపురం చేసే కమనీయ చిత్రాలు నిర్మించి తెలుగు చిత్రాల స్థాయిని అపురూపమైన అంతస్తుకు తీసుకుని పోయిన ప్రతిష్ఠాత్మక సంస్థ ‘అన్నపూర్ణ’. కథ, కథా కథనం, నటనాస్థాయి, సంభాషణలు, సంగీత సాహిత్యాల విషయంలో అత్యున్నత ప్రమాణాలను అగపరిచిన ఈ సంస్థ 1955లో ఊపిరిపోసుకుని దుక్కిపాటి మధుసూదనరావు నేతృత్వంలో ఒక నూతనాధ్యాయనానికి ప్రాణప్రతిష్ఠ సలిపింది. దుక్కిపాటి తల్లిగారి పేరుతో నెలకొల్పిన ఈ సంస్థ కె.వి.రెడ్డికోసం రెండేళ్లపాటు వేచి వుండి ఆయన దర్శకత్వంలోనే ప్రధమ ప్రయత్నంగా ‘దొంగరాముడు’ నిర్మించి విడుదల చేసింది.
అన్న దొంగతనాలు చేసి తమ్ముడ్ని చదివించడం అంశంగా కల ‘లవింగ్ బ్రదర్స్’ అనే ఆంగ్ల కథలోని తమ్ముడి పాత్రను చెల్లెలుగా మార్చి సజీవమైన పాత్రతో చిత్రకథను పకడ్బందీగా తయారుచేసారు కె.వి.రెడ్డి, దుక్కిపాటి, డి.వి.నరసరాజులు స్క్రీన్‌ప్లేను తయారుచేయడం విశేషం. కథలోని అనేక పాత్రలను అతి సహజంగా ప్రవేశపెట్టి పరిచయం చేయడం కె.వి.రెడ్డి ప్రతిభకు నిదర్శనం. కొత్తగా దర్శకులు కాగోరే ప్రతి ఒక్కరు ‘దొంగరాముడు’ తప్పక చూడవలసిందేనని ప్రఖ్యాత దర్శకులు బాపు పేర్కొనడం ఈ చిత్రం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అందుకే నేడు పూనా ఇన్‌స్టిట్యూట్‌లో పాఠ్యాంశంగా ‘దొంగరాముడు’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దొంగరాముడు స్క్రిప్ట్ తెలుగు సినీ దర్శకుల పాఠ్య గ్రంథంగా నిలిచిపోయిందని నవతరం దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి కూడా పేర్కొన్నారు.
టైటిల్ పాత్రను అక్కినేని అత్యంత సహజంగా పోషించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు. ఆయన ప్రేమించిన యువతిగా కూరలమ్ముకునే పాత్ర సావిత్రి ధరించింది. ఆ పాత్ర పోషణపట్ల సావిత్రి తీసుకున్న శ్రద్ధాసక్తులు అమోఘం. గంపనిండా గడ్డిపెట్టి పైన నాలుగు వంకాయలు, టమాటాలు వేసి ఇవ్వడంతో దుక్కిపాటి చెప్పినా, వినకుండా గంపనిండా కాయగూరలు వేసి ఆ బరువుతోనే సావిత్రి నటించడం విశేషం. జగ్గయ్య, జమున, రేలంగి, సూర్యకాంతం ఆయా పాత్రలకు జీవరేఖలు దిద్దారు. ‘బాబుల్‌గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి’ అంటూ ఆర్.నాగేశ్వరరావు మరుపురాని నటనను ప్రదర్శించాడు. జగ్గయ్య అన్నగా రంగస్థల నటులు రామన్నపంతులు నటించడం విశేషం. డి.వి.నరసరాజు డైలాగులు బుల్లెట్లను మరిపించాయి. సీనియర్ సముద్రాల పాటలు, పెండ్యాల సంగీతం పాలుతేనె కలయికలా అతి మధురంగా తయారై ప్రేక్షకులను అలరించాయి. భీంప్లాస్ రాగంలో పి.సుశీల పాడిన ‘అనురాగము విరిసేనే’ పాట ప్రేక్షకుల గుండెల్లో పూలు పూయిస్తుంది. ఘంటసాల, జిక్కి పాడిన ‘చిగురాకులలో చిలకమ్మా’ పాట పాపులర్ అయింది. జిక్కిపాడిన ‘రావోయి మా ఇంటికి’ పాటలో వినిపించిన మాటలు అచ్చం ఆర్.నాగేశ్వరరావులా పలికినవారు క్యారెక్టర్ నటుడు మద్దాలి కృష్ణమూర్తి. ఆయన ఈ చిత్రంలో ఇన్‌స్పెక్టర్ వేషం వేశారు. ‘లేవోయి చిన్నవాడా’ అంటూ కుచలకుమారి చక్కని నృత్యం చేసింది. ఈ చిత్రాన్ని ‘తిరుట్టురామన్’ పేరుతో తమిళంలోకి డబ్ చేయగా ఎవిఎంవారు కృష్ణన్‌పంజు దర్శకత్వం, మదన్‌మోహన్ సంగీతం, కిశోర్‌కుమార్, సాధనలలో హిందీలో ‘మన్‌వౌజ’ నిర్మించారు. ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవం 1-10-1955న విడుదలైన ఈ చిత్రం శత దినోత్సవం జరుపుకుంది.

No comments: