Saturday, September 11, 2010

వినాయక చవితి శుభాకాంక్షలుఅందరిపైనా ఆ గణనాధుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని చూడాలని ఆశిస్తూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.

Wednesday, September 1, 2010

విలక్షణ స్వరం పి.బి.శ్రీనివాస్‌


‘ఓహో గులాబీ బాలా...’అంటూ మలయమారుత సమీరంలా వినిపించే ఆ స్వర మాధుర్యానికి పులకించని హృదయముండదు. ఎందరో మంచి పాటల అభిమానులకు ఈ స్వరం స్వరపరిచితమే! స్వరములు ఏడైనా రాగాలెన్నో అని ఓ సినీకవి అన్నట్టుగా గాయకులెందరున్నా, ఓ విలక్షణ స్వరం పి.బి.శ్రీనివాస్‌ది. ఈ స్వర ప్రవాహం దక్షిణాదిన వెల్లువై, ఉత్తరాది వరకూ పల్లవించింది.
స్వరమే కాదు ఆహార్యంలోనూ, అలవాట్లలోనూ ప్రత్యేకత కనిపిస్తుంది పి.బి.శ్రీనివాస్‌లో. ఎప్పుడూ చేతినిండా పుస్తకాలు. జేబులో రకరకాల పెన్నులు, తలమీద టోపీతో నడిచే గ్రంథాలయంలా కనిపిస్తారు. రికార్డింగ్ లేని సమయంలో ఓ చెట్టుకింద కుర్చీలో కూర్చుని ఏదయినా చదువుకోవడం, లేదా మనసుకు వచ్చిన ఆలోచనో, కవితో రాసుకోవడం తప్ప ఇతరుల విషయాలను పట్టించుకోకపోవడం వీరి అలవాటు.
22-7-1930, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు పి.బి.శ్రీనివాస్. వీరి ఇంటిపేరు ప్రతివాద భయంకర. తల్లిదండ్రులు శేషగిరమ్మ, లక్ష్మణ ఫణీంద్ర స్వామిలు. తల్లివైపు వారందరు సంగీతజ్ఞులు. తల్లి శేషగిరమ్మనుంచే శ్రీనివాస్‌కు సంగీతంపట్ల మక్కువ కలిగింది. వీరి సోదరి, మణిరఘునాధ్ వీణావిద్వాంసురాలు. తండ్రిగారిది బదిలీలుండే ఉధ్యోగం కావడం చేత శ్రీనివాస్ మేనమామ వారింట్లో కాకినాడలో వుండి చదువుకున్నారు. కాకినాడలో బికామ్ చదివి, మద్రాసు లా కాలేజీలో చేరారు. చిన్నప్పటినుంచి అన్ని భాషలకు చెందిన చిత్రాలు పలుసార్లు చూడడం, పాటలు సాధన చేయడంతో వీరి సంగీత సాధన నిరంతరాయంగా సాగింది.
మద్రాసులో ‘ప్రియాంక’, ‘ప్రియభాషి’, ‘విశ్వసాక్షి’, ‘త్రిలోక సంచారి’ వంటి కలంపేర్లతో పత్రికలకు రచనలు చేసేవారు. ప్రముఖ వైణిక విద్వాంసులు ఈమని శంకరశాస్ర్తీగారి ప్రోత్సాహంతో సినీ రంగానికి పరిచయమయ్యారు. తెలుగులో వీరి తొలి చిత్రం నటుడు ఆర్.నాగేంద్రరావు నిర్మించిన ‘జాతకఫలం’ (1954. తరువాత 1956లో ‘్భలేరాముడు’ సినిమాకు, ఎస్.రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో రేలంగికి (బంగరు బొమ్మా, భలే జోరుగా పదవే పోదాము) ఓ నేపధ్యగీతం (్భయమేల ఓ మనసా) పాడారు. అప్పటినుంచి ఎందరో హీరోలకు, సైడ్ హీరోలకు, కమెడియన్స్‌కి, గొంతును ఆయా నటులకు అనుగుణంగా పాడి పేరు సంపాదించారు. అనేకమంది సంగీత దర్శకులు ఆయన స్వరంలోని ప్రత్యేకతకు మురిసి అవకాశాలను ఇచ్చి ప్రోత్సహించారు.
పి.బి.శ్రీనివాస్ అష్టా భాషా కోవిదుడు. (సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, ఉర్దు, ఇంగ్లీషు). ఉర్దు, ఇంగ్లీషు భాషల్లో కవితలల్లిన ప్రజ్ఞావంతుడు. అసాధారణమైన ప్రతిభతో ఎనిమిది భాషల్లో వివిధ ఇతివృత్తాలతో రూపొందించిన రచనలను ‘ప్రణవం’ అను గ్రంథంగా ప్రచురించారు. ‘షాబాష్’ అను నామముధ్రతో ఉర్దు భాషలో గజల్స్ రచించారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంధ్రాల్లో పలు తెలుగు, తమిళ గీతాలు ప్రసారమైనాయి. ఆయన రచించి గానం చేసిన ‘పాలవెల్లిరా నా పిల్లనగ్రోవి, నీల గగనమే నా మోవి’ అని కృష్ణుపై రాసిన పాట, ఆయనకు చాలా ఇష్టమైన వాటిలో ఒకటి. ఇంగ్లీషు భాషలో నీల్ ఆమ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలిడినన సందర్భంలో ‘మేన్ హాజ్ సెట్ హిజ్ ఫుట్ ఆన్ ది మూన్’ అనే పాట రాసి కంపోజ్ చేసి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌కు, నీల్ ఆమ్‌స్ట్రాంగ్‌లకు పంపారు. వారిద్దరు ఆ రికార్డు మెచ్చుకుని ప్రత్యేక ప్రశంసా పత్రాలు పంపారు. రవీంద్రనాధ్ శతజయంతి సందర్భంగా శాంత నికేతన్‌నుంచి రవీంద్ర సంగీతంలో నిష్ణాతులైన శాంతిదేవ్ ఘోష్ మద్రాసు వచ్చి పి.బి.శ్రీనివాస్‌చే రవీంద్ర గీతాలు కొన్ని రికార్డు చేయించుకున్నారు. అదో అరుదైన గౌరవంగా శ్రీనివాస్ తెలియజేస్తారు. సంస్కృతంలో శ్రీనివాస వృత్తమ్, గాయత్రీ వృత్తాలు రచించారు. కర్నాటక సంగీతంలో ‘నవనీత సుధ’ అనే రాగాన్ని సృష్టించారు.
ఇతర భాషా చిత్రాలు
తమిళ సినీరంగానికి పి.బి.శ్రీనివాస్‌ను పరిచయం చేసింది సంగీతదర్శకులు ఎం.ఎస్.విశ్వనాధన్. పావమన్నప్పు (1962)అనే చిత్రం ద్వారా శ్రీనివాస్ పాడిన ‘కాలం గళిల్ అవళ వసంతం’ అనే పాట సూపర్ హిట్ అయింది. అలాగే ఈ చిత్రం రజతోత్సవాలు చేసుకుంది. తమిళనటులు జెమినీ గణేశన్‌కు ఈయన పాడిన పాటలన్నీ విజయం సాధించినవే. కన్నడ హీరో రాజ్‌కుమార్‌కు పాడిన పాటలన్నీ హిట్ అయ్యాయి. మలయాళం, తుళు, కొంకణి భాషల్లో పాటలు పాడారు. హిందీలో శ్రీనివాస్ పాడిన ‘చందాసే హోగా ప్యార్’ (మైలడ్కీహూ) పాట మంచి పేరు తెచ్చింది. లతా మంగేష్కర్‌తో ఎన్నో పాటలు పాడారు. సినిమాల్లో మ్యూజిక్ డైరక్షన్ చేయలేదు కానీ ప్రైవేటుగా తాను రాసిన పాటలకే కాక, ఇతరుల పాటలు కంపోజ్ చేసారు. ఎం.ఎస్ శ్రీరామ్ నిర్మించిన ‘పెళ్లిరోజు’ చిత్రానికి కొంత మ్యూజిక్‌పార్టు కంపోజ్ చేసారు. ‘జమున‘తో కలిసి పెళ్లివారమండి పాట పాడారు.
స్వర విన్యాసం
నటుడు సంగీత దర్శకుడు గాయకుడైన చిత్తూరు నాగయ్యకు ‘శాంతి నివాసం’ చిత్రంలో ‘శ్రీరఘురాం, జయరఘురాం’ పాడడం ఓ వింత అనుభవం.
ఎన్టీఆర్‌కు...అనురాగము ఒలికే ఈ రేయి (రాణి రత్నప్రభ), తనువుకెన్ని గాయాలైనా, బుజ్జి బుజ్జి పాపాయి (ఆడబతుకు), గోగో గోంగూర, జై ఆంధ్ర (దేవాంతకుడు), భానుమతితో కలిసి, ఎన్టీఆర్‌కు ’నీటిలోన నింగిలోన’ (వివాహబంధం), ఘంటసాలతో కలిసి పి.బి, ఎన్టీఆర్, కాంతారావులకు ‘చిక్కడు దొరకడు’లో (ఔరా వీరాధివీరా) ఆలపించారు.
ఎఎన్‌ఆర్.. జయభేరి చిత్రంలో (మది శారదాదేవి మందిరమే) ఘంటసాల రఘునాధ్ పాణిగ్రాహి, పి.బి.శ్రీనివాస్ పాడారు. ‘ప్రేమించి చూడు’లో (నీ అందాల చేతులు, అది ఒక ఇదిలే) మనసే మందిరం (తలచినదే జరిగినదా) పాటలు పాడారు. కారణాలేవైనా ఎ.ఎం. రాజా నాగేశ్వరరావుకు పాడినన్ని పాటలు పి.బి పాడలేదు.
జగ్గయ్యతో...అత్తా ఒకింటి కోడలు, జల్సారాయుడు, ఇంటికి దీపం ఇల్లాలే, అన్నపూర్ణ, కానిస్టేబుల్ కూతురు, గుడిగంటలు పాడారు.
కాంతారావు...కాంతారావు నారదుడిగా నటించిన చిత్రాలకు దాదాపుగా పిబియే పాడారు. దేవ దేవ పరంధామా (సీతారామకల్యాణం), మనసులోని కోరిక (భీష్మ), ‘జయ జయ నమో కనకదుర్గ’ (కనకదుర్గ పూజామహిమ)
హరనాధ్‌తో... నటుడు హరనాధ్‌కు పాడిన పాటల్లో ‘చౌదవీక చాంద్‌హో’ అనుకరణ గీతం ‘నీలి మేఘమాలవో, నీలాల తారవో’ ఒరిజినల్‌తో సమానంగా అద్భుతంగా సాగిన పాట. పి.బి.శ్రీనివాస్ అనగానే టక్కున గుర్తుకు వస్తుంది ‘అందాల ఓ చిలుకా..అందుకో నాలేఖ’ (లేత మనసులు) మరో హిట్ సాంగ్. ఇతరులు: చలంతో (అసలు నువ్వు రానేల), రామకృష్ణతో (నీమది పాడెను ఏమని), ’నిత్య కల్యాణం పచ్చతోరణం’, పద్మనాభంకు ‘చక్కని చుక్క సరసకు రావే’ (ఇద్దరు మిత్రులు) చేయి చేయి కలుపు (నటుడు కృష్ణ), ‘లక్ష్మీనివాసం’ , రామ్మోహన్‌తో (ఊరించే అమ్మాయి) పాడారు.పద్యాలను పాడడంలోనూ నేర్పు చూపారు ఆయన. ‘ఇనుప కచ్చడాల్’ (సీతారామకల్యాణం), ‘నల్లనివాడు’ (శ్రీకృష్ణపాండవీయం), ‘మామ మీసాల మీద సీసా’ (కులగోత్రాలు) మంచి పేరుతెచ్చుకున్నవాటిలో కొన్ని. అపస్వరం ఎరుగని శ్రీనివాస్ వయసు శరీరానికే కాని తన స్వరానికి కాదనీ, కళాకారుడు విశ్రాంతి తీసుకోరాదని చెబుతారు. ప్రజలు అభిమానంతో గానసామ్రాట్, గానకళా సార్వభౌమ బిరుదులందించారు. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదుతో సత్కరించింది.