Friday, January 28, 2011

హాస్యానికి చిరునామా ఇవివి


మిడిమిడి కామెడీ కాదు వారిద్దరిది. మాటలు, మనుషుల సైకాలజీపై అధారటీ..చూసిన వారికి ఎక్కడో చురుక్కున గుచ్చుకునే సూదంటు హాస్యం. తక్కువ కాలంలో ఎక్కువ నవ్వించేసి..హఠాత్తుగా పేకప్ చెప్పేసి, జనానికి ‘ఇప్పుడు నవ్వండి చూద్దాం’ అని ఓ ఝలక్ ఇచ్చి మాయమైన ఆ ఇద్దరు జంధ్యాల-ఇవివి.
ఒకరు గురువు..ఇంకొకరు శిష్యుడు.
ఇద్దరివీ పడి లేచిన బతుకులే. తెలుగుహాస్యచిత్రాలకు జంధ్యాల బొమ్మ అయితే ఈవీవీ బొరుసు. ఈ నాణెం తాలూకూ నాణ్యత గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ వుండదు. వల్లె వేసుకుని, జ్ఞాపకాల దొంతరలు మరోసారి తిరిగేసుకోవడం మినహా. గురువుదంతా మధ్యతరగతి మందహాసం. శిష్యుడిది మాస్ జనం మాటల మూటలు.
గురువు రాసి..తీసి..నవ్వించి, నిన్నగా మిగిలిపోతే, ఇప్పుడు శిష్యుడూ అదే పోకపోయి, జ్ఞాపకంగా మిగిలిపోయాడు.
ఇవివి సత్యనారాయణకు కాసింత గోదావరి గోరోజనం ఎక్కువ. ఆ నీళ్లిచ్చిన వెటకారపు పాలెక్కువ. అక్కడ జనం మధ్య తిరిగి నేర్చుకున్న ఎకసెక్కం మరింత ఎక్కువ.
‘ఏం చదివావమ్మా..’అని నెమ్మదిగా ప్రశ్నిస్తే..‘శివరంజని, సితార, జ్యోతిచిత్ర..’ఇదీ జవాబు.
‘చెయ్యేడకడుక్కోవాల్రా’ అంటూ సినిమా ప్రారంభం నుంచి చివరివరకు తిరిగి తిరిగిన పాత్ర చివరకు వేసే సెటైర్ ఏమిటంటే..‘అందుకే రాజుల పెళ్లికి రాకూడదు’..అని
అడ్రస్ కోసం వెదుక్కునే అమాయకుడికి మరో అమాయకుడు అరగంట సేపు స్పీచిచ్చి..చివరకు చేతిలో పెట్టేది ఏమిటంటే..‘వెంకట్రామా అండ్ కో ఎక్కాల పుస్తకం’..
కాస్త దగ్గరగా రావచ్చా అని ప్రియురాలు ప్రేమగా అడిగితే..ప్రియుడు చెప్పే జవాబు..‘వచ్చుకో’..
ఇలా మాట విరుపు ముందు పుట్టి..ఆ తరువాత పుట్టినవాడు ఇవివి.
ఇది తరువాత, తరువాత నేర్చుకున్నది కాదు..‘చెవిలోపువ్వు’ దగ్గర్నుంచీ అదే వ్యవహారం. సినిమాకు పేర్లు పెట్టడం..సినిమాలో పేర్లు రావడం, అన్నింటా మహా వెటకారం.
వేసింది..రాసింది..తీసింది..కూసింది..కోసింది..లెక్కెట్టింది..ఇవీ టెక్నీషియన్లకు ఆయనిచ్చిన బిరుదులు.
మిక్చర్‌పాటలంటే ఈవీవీకి మహాసరదా. సినిమా చివరిలో ఎంత గందరగోళం వుంటే అంతిష్టం. పేర్ల తమాషా..పేరడీ అంటే మరింత ఇష్టం. ‘నాదెండ్ల అంజయ్యగారు..నన్నపనేని గంగాభవానీగారు..అంటూ వాస్తవిక పేర్లను సినిమాల్లోకి తేవడం..సినిమా రిపోర్టర్లను కూడా పాత్రలను చేయడం..ఇలా ఒకటేమిటి ఎన్ని చమక్కులో..అసలు ఇన్ని చమక్కులు ఎక్కడ నేర్చాడా అనిపిస్తుంది. చెవిలోపువ్వు..ఆ ఒక్కటీ అడక్కు..నీమీద ఒట్టు..మీ ఆవిడ చాలా మంచిది’..ఇలా రాసుకుంటూ పోతే..ఈవీవీ సినిమాలన్నీ వల్లెవేయాలి.
భాగ్యరాజా తమిళ సినిమా ‘చిన్నరాజా’గా తెలుగులోకి వచ్చిన తరువాత, అదే సినిమా హిందీలో ‘బేటా’గా రీమేక్ అయ్యాక, మళ్లీ తెలుగులో, ‘అబ్బాయిగారు’ పేరిట తెలుగులో తీస్తే, హిట్ అయిదంటే అందులో ఈవీవీ చమత్కారాలు ఎన్ని చిత్రాలు చేయబట్టి. ఆమని, రంభ, రోజా, రచన, ఎల్బీ శ్రీరామ్, శ్రీకాంత్ తదితరులకు తెరజీవితాన్ని సుసంపన్నం చేసే మార్గాలు పరిచిన వాడు ఇవివి. కేవలం కామెడీ కాదు..మాస్ మసాలాలు కూడా తీయగలనని, హలోబ్రదర్, ఇంట్లోఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు లాంటి సినిమాలతో రుజువు చేసుకున్నవాడు ఇవివి.
అయితే..నిజమే కానీ..ఈవీవీ సినిమాలు కాస్త మోటుగా వుంటాయట..మాటల్లో బూతు ధ్వనిస్తుందట..అంటే..అవుననే చెప్పాలి. కానీ అతగాడికి అవే ఇష్టం అని మాత్రం చెప్పలేం. ఈవీవీ అయితే తనకు నచ్చి..తన కోసం తీసిన సినిమా ‘ఆమె’. ఆయనే ఎన్నో సార్లు చెప్పాడు..కమర్షియల్‌గా తప్పదు కాబట్టి తీస్తున్నా..కానీ నాకు ఇష్టమై కాదు..అని.
తొలిసినిమా పెద్దగా ఆడని కసితో రామానాయుడి కోసం ‘ప్రేమఖైదీ’ తీసిన ఇవివి..చివరిగా ఇచ్చిన మంచి హిట్ ‘బెండు అప్పారావు ఆర్‌ఎమ్‌పి’ కూడా ఆయన బ్యానర్‌లోనే తీయడం చిత్రం.

Wednesday, January 19, 2011

రాజువయ్యా...మహరాజువయ్యాఅందానికి ఇదిగో...ఇతగాడు నిలువెత్తు ఉదాహరణ..అన్నట్టుగా ఉంటాడు శోభన్‌బాబు. ఆరోజుల్లో ఎంతమంది కనె్నపిల్లల కలల్లోకి వచ్చి మనసుల్ని కొల్లగొట్టాడో ఈ ‘సోగ్గాడు’. మరణించేనాటికి కూడా అదే అందం...అదే దర్పం! సినిమా నటుడే అయినా...ఏదో తెలీని తాత్వికత ఆయనలో అంతర్లీనంగా తొణికిసలాడేది. చాలా మంది తమ జీవితాల్ని ‘స్కాచి’ వడబోసి పారబోసుకుంటుంటారు. కానీ జీవితాన్ని కాచి వడబోసి నిండా అనుభవించి రసాస్వాదన సంపూర్ణం చేసుకుని తెరమరుగైన ‘మహరాజు’ శోభన్‌బాబు!
శోభన్‌బాబు స్వర్గం చేరుకుని అప్పుడే మూడేళ్లయిపోతోంది. అయినా ఇంకా ఆ అందాల నటుడ్ని తలుచుకుంటుంటే ఆత్మ ఆవేదనతో మునిగిపోతుంది...కనులు చెమ్మగిల్లుతాయి...ఏదో తెలీని బాధ మనసుని మెలిపెట్టేస్తుంది. అంతలోనే వేగంగా సాగే డైలాగ్ డెలివరీ...నుదుటిపైకి వాలే రింగు..ఇద్దరు భార్యల ముద్దుల భర్త...అన్నీ గుర్తుకొచ్చేసి...శోభన్ చిలిపి తలపులతో హృదయమంతా సంక్రాంతయిపోతుంది. ‘లేదు...మా ‘జూదగాడు’ ఎక్కడికీ వెళ్లిపోలేదు...ఇదిగో ఈ జేబుదొంగ మన గుండెల్లోనే భద్రంగా ఉన్నాడు’ అనిపిస్తుంది అంతలోనే!
తొలిరోజుల్లో శోభన్ అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బిఎస్సీ పూర్తిచేసి సినిమాల్లో వేషాలకోసం మద్రాసు వెళ్లాడు శోభన్ జూన్ ఒకటి 1958న! అప్పటికే పెళ్లయింది. 35 రూపాయల అద్దె ఇంట్లో కొత్తకాపురం! ఉదయంపూట ‘లా’ క్లాసులు. మధ్యాహ్నం నుంచి రాత్రివరకు వేషాలకోసం తిరగడాలు. కొంతకాలానికి శ్రమ ఫలించింది. తొలి అవకాశం ‘దైవబలం’ చిత్రం ద్వారా వచ్చింది. మూడే మూడు రోజులు షూటింగ్...రెండు వందల రూపాయల పారితోషికం...అయితేనేం..ఓ ఆశ!
దైవబలం రిలీజైంది 1959లో. 1963 నాటికి అయిదారు సినిమాల్లో చిన్నా చితకా వేషాలు దొరికాయి. కుప్పలు తెప్పలుగా ఆఫర్లేమీ లేవు. ముందుకు వెళ్లలేని వెనక్కూ రాలేని పరిస్థితి. కాలేజీకి, చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టేసాడు. అప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టేసారు. ఒక పిక్చర్ వచ్చిందంటే రెండు మూడు నెలలు గడవడం. అలా గడుపుకునే పరిస్థితి.
డబ్బు ఎంతటి మాయ కలిగిందో శోభన్‌కు తెలిపిన కాలమది. ఒక్కోసారి ఇల్లు గడపడమే కష్టమయ్యే పరిస్థితి దాపురించేది. అద్దె కట్టలేక పోవడమేమిటి కనీసం కరెంటు బిల్లే కట్టలేని పరిస్థితి. ఒకటిరెండుసార్లు ఓనరు వచ్చి కరెంటు కనక్షనే తీసేసిన దుస్థితి. రెండు పూటలా అన్నంలేక..పిల్లలకు పెట్టి తాను, భార్య శాంతా మాత్రం ఉన్న చిల్లరతో బిస్కట్లు కొనుక్కుని తినేవారు. అంత నీరసంలోనూ ఆయన భార్య ‘అధైర్య పడకండి. మనకీ మంచి రోజులొస్తాయి’ అంటూ ధైర్యం చెప్పేది.
ఒక దశలో-ఇక సినిమాలే వదిలేసి సొంత వూరు వెళ్లిపోయి వ్యవసాయం చేసుకుందామా అన్నంత బెంగ వచ్చేసేది. అలాంటి నిరాశామయ స్థితిలో ‘నర్తనశాల’ చిత్రంలో అభిమన్యుడి వేషం దొరికింది. స్టార్ తిరిగిందనిపించింది. 1963లో విడుదలైన నర్తనశాల అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత రెండేళ్లు చిన్నా చితకా పాత్రలు వేసినా 1965లో ‘వీరాభిమన్యు’లో టైటిల్ పాత్రతో శోభన్ సినీరంగంలో స్థిరపడేందుకు పరిస్థితి ఏర్పడింది.
విచిత్రం ఏమిటంటే వీరాభిమన్యు అఖండ విజయం సాధించినా శోభన్‌కు తదుపరి అవకాశాలు మాత్రం రాలేదు. హీరోవేషం వేసిన అదే శోభన్ అతిథి పాత్రలో అల్పపాత్రలో చేయాల్సి వచ్చింది. డబ్బులకోసం, కుటుంబం గడవడం కోసం తప్పదుమరి. అప్పుడే శోభన్‌కు జీవితమంటే ఏమిటో తెలిసొచ్చింది. వెలుగునీడలు, ఎత్తుపల్లాలు, జీవితంలో తప్పవని అర్ధమైంది. అలా..అలా..క్రమంగా నిలదొక్కుకుంటూ సినీ పరిశ్రమలో తనదైన స్టార్‌డమ్‌ని సంపాదించుకోగలిగారు.
ఆ కష్టాలే శోభన్‌కు అంతులేని క్రమశిక్షణను, డబ్బుపట్ల మితిమీరిన జాగ్రత్తను, సినిమారంగంలో తామరాకుపై నీటిబొట్టులా ఉండగల సాహసాన్ని అందించాయి. ఒకసారి ఓ విలేఖరి ‘ఏమిటీ తీవ్రంగా ఆలోచిస్తున్నారు’ అని అడిగినపుడు- ‘అది మామూలే! నిత్యం నాలో ఏదో ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా నా జీవితం గురించి, అనుసరించవలసిన విధానాల గురించి నా హృదయం ఎప్పుడూ ఆలోచనా సముద్రంలో మునకలు వేస్తూ ఉంటుంది. నాకు స్వతహాగా సహజంగా నిరాడంబరంగా, సగటుమనిషిగా, మధ్యతరగతి కుటుంబీకుడిగా బతకాలని ఉంటుంది. ఎంతో అవసరమైతే తప్ప ఎక్కువ శాతం లుంగీ లాల్చీలోనే ఉండాలని ఉంటుంది. లేనిరోజుల్లో లేదనేది ఒక్కటే బాధ. కానీ స్టార్ నయ్యాక ఉన్నది, సంపాదించుకున్నది ఎక్కడ పోతుందో అని అంతకుమించిన బాధ...తపన...ఏది ఏమైనా సామాన్య మానవుడే ధన్యుడు. ఎన్ని సమస్యలున్నప్పటికీ తన జీవితాన్ని తాను స్వేచ్ఛగా జీవిస్తాడు’’ అని చెప్పారు శోభన్.
ఆయనలో నిరంతరం వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి, వృత్తికి మధ్య జరిగే సంఘర్షణ సుస్పష్టంగా కనిపిస్తుంది. అదే విషయాన్ని ఓసారి చెబుతూ ఆయన-‘‘ఆమధ్య నేను మా తాతగారిని చూద్దామని మా స్వగ్రామం వెళ్లాను. ఎవరికీ చెప్పకుండా వెళ్లి మా తాతగారి దగ్గర రెండురోజులు కాలక్షేపం చేసి బెంగ తీర్చుకుని వద్దామని మనసు ఆరాటపడింది...ఆశపడింది..కానీ ఎలా తెలిసిందో, ఎవరు చెప్పారో ఇంటిముందు నా కారు ఆగేసరికి ఓ వందమంది జనం గుమిగూడి ఉన్నారు. అక్కడున్న రెండురోజులూ ఆ జనంనుంచి తప్పించుకోవడానికి వీలులేకపోయింది. మా తాతగారితో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశమే రాలేదు. నాలోని నటుడు ఇంతమంది అభిమానం పొందినందుకు నిత్యం ఆనందిస్తూనే ఉంటాడు. కానీ మా మనోగతం మాత్రం ఆత్మీయుల ఆప్యాయత పొందాలని ఆరాటపడుతునే ఉంటుంది’’ అని అన్నారాయన.
కుటుంబానికి సినిమా షోకుల్ని అంటనివ్వని ఏకైక నటుడు శోభన్. ఆయన కుటుంబం నివసించేది ‘శాంతి’ అనే ఇంటిలో. ఆ పక్కనే ఆయన ఆఫీసు. దానిపేరు ‘ప్రశాంతి’. అతిథుల్నీ, అభిమానుల్నీ కలుసుకునేది ‘ప్రశాంతి’లోనే. మేకప్ వేసుకునేది కూడా ప్రశాంతిలోనే. మేకప్ వేయించుకుంటూ ఎదురుగా టేబుల్‌పై అద్దానికి అటు ఇటు చెల్లెలి ఫోటో, తాతగారి ఫోటో పెట్టుకుని వాటిని చూస్తూ ఉండడం శోభన్‌కు చెప్పలేనంత ఇష్టం. మేకప్ వేసుకుని ‘శాంతి’లోకి అడుగుపెట్టడం కానీ, తన కుటుంబ సభ్యుల్ని షూటింగ్‌లకి తీసుకువెళ్లడం కానీ, తన సినిమాలు టీవీలో వచ్చినా చూడడం కానీ...శోభన్ జీవితంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా జరగలేదు. అది గొప్పకాదు. తన వృత్తిపట్ల తనకే గౌరవం లేకపోవడం కాదు.
ఎప్పుడు డబ్బు వస్తుందో పోతుందో, ఎప్పుడు కీర్తి ఉంటుందో ఊడుతుందో, ఎప్పుడు అభిమానులు జైకొడతారో ఛీకొడతారో, ఎప్పుడు ఏ సినిమా హిట్టవుతుందో ఫట్టవుతుందో తెలీని రంగంలో తాను అడుగుపెట్టినప్పుడు తన అనుభవాలు తనను జాగ్రత్తపడేలా చేసాయి. కిందనుంచి పైకి ఎదిగిన క్రమంలో ఎన్నో ఉలి దెబ్బలు తనను శిల్పంలా మలిచాయి. పుడుతూనే సిల్వర్‌స్పూన్‌తో పుట్టిన తన సంతానానికి ఆ ‘జీవితసారం’ తెలీకపోవచ్చు...అర్ధం కాకపోవచ్చు.
తనకు జీవితంలో ఎలా బతకాలో నేర్పిన భార్య శాంతకుమారి అంటే ఆయన మాటల్లోనే...‘‘నా జీవితంలోని విజయాలన్నింటికీ మూలకారణం నా శ్రీమతి. ఆమె లేకుండా నేను లేను. ఆమెలేని నేను నేను కాను. బొత్తిగా చిన్నపిల్లాడి మనస్తత్వం నాది. అంతలోనే కోపం, అంతలోనే నవ్వు, అంతలోనే తాపం-ఇవి హానికరం కావు కానీ సునిశితంగా సుతిమెత్తగా ఉంటాయి. అన్నీ నేను అనుకున్నట్టే జరగాలి. నా కాంపౌండ్‌లో గాలి కూడా నేను చూపినవైపే వీచాలి. అంతటి క్రమశిక్షణ నాలో నరనరాన జీర్ణించుకుపోయింది. నాతో జీవించి నన్ను తీర్చిదిద్ది, విజయాలకు నన్ను అధిపతిని చేసిన ఘనత నా అర్ధాంగికే దక్కుతుంది. అందుకే నా ఇంటిపేరు శాంతి. నా పూలతోట పేరు శాంతినికేతన్. అన్ని మాటలెందుకు నా జీవితం పేరే శాంతి’’.
చివరగా- ‘‘జీవించడమంటే బతికి ఉన్నప్పటి జీవితం కాదు. మరణించిన తర్వాత పొందే జీవితమే నా దృష్టిలో జీవించడం. రేపు నా తదనంతరం నా బిడ్డలు నాన్నలాగ బతకాలి అనుకుంటే నేను పుట్టినట్లే. నా అభిమానులు నేను పోయాక కూడా శోభన్‌బాబు సినిమా చూడాలి అనుకుంటే నేనింకా జీవించినట్లే. వారి గుండెల్లో ఎప్పటికీ అమరుడైనట్లే. నేను పదిమందికీ సాయపడకపోవచ్చుగాక ఎవ్వరికీ ఏ హానీ చేయకుండా నన్ను నమ్ముకుని బతుకుతున్నవారికి ఉన్నంతలో సహాయపడి, పోయిన రోజున మనసారా పదిమంది పది కన్నీటి బొట్లు రాలిస్తే చాలు! నా జీవితం సార్ధకం అయినట్లే’’ అని అంటారు శోభన్.
అవును...ఆయన జన్మ సార్ధకమైంది. పదులమంది కాదు వందల వేల లక్షల మంది అభిమానంతో శోభన్ ఎందరి గుండెల్లోనో కొలువున్నాడు.

Saturday, January 15, 2011

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి మీ ముంగిళ్ళలో సిరులను కురిపించాలని ఆశిస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

Friday, January 7, 2011

ఘంటసాల జ్ఞాపకాలు

రచన: శ్రీమతి ఘంటసాల సావిత్రి
పేజీలు: 240 వెల: 150
ప్రతులకు: నవోదయ బుక్‌హౌజ్ ,
కాచిగూడ ఎక్స్‌రోడ్స్
హైదరాబాద్-500 027
‘మనం పిల్లలు గలవాళ్లం..జాగ్రత్త పడకపోతే ఎలా చెప్పండి’
‘మీరు ఆ సినిమా తీయకండి..నష్టపోతారు’
‘ఆయన చుట్టతాగి పాడారు’
‘నా దగ్గర ఎప్పుడూ ఒకటి ఎక్‌స్ట్రా ఉంటుంది..ఇచ్చేవాడ్ని కదా’
‘అందరం బతికేందుకు వచ్చాం..అందరూ బతకాలి..అందరికీ అవకాశాలు రావాలి’
ఈ మాటల్లోతుల్లోకి ఎంతగా వెళితే అంతగా అర్ధం దొరుకుతుంది. ఓ వ్యక్తుల మధ్య అనుబంధానికి ఆనాడు ఎంత ప్రాధాన్యత ఉండేదో తెలుస్తుంది. పది మంది మంచి కోరుకోవాలన్న వారి విశాల హృదయం గోచరమవుతుంది.
తెలుగుపాటకు మారుపేరుగా, మాధుర్యానికి నిలువెత్తు నిదర్శనంగా భాసిల్లిన ఘంటసాల గురించి ఎంత చెప్పినా అది ఇసుమంతే అవుతుంది. ఓ వ్యక్తి జీవితాన్ని అతి సమీపం నుంచి చూసిన అనుభూతి కలగాలంటే..ఆయన గురించి సన్నిహితులే రాయాలి. ఆత్మీయులు రాస్తే ఇంకా హృదయానికి హద్దుకుంటుంది. మరి ఆయన జీవిత భాగస్వామే రాస్తే..ఆమె తన అనుభవాలను, అనుబంధాన్ని ఆవిష్కరిస్తే అది కచ్చితంగా ‘ఘంటసాల జ్ఞాపకాలు’అవుతుంది. ఘంటసాల జీవితాన్ని అణువణువూ ఆవిష్కరించిన ఓ అపురూపమైన పుస్తకమే అవుతుంది. ఘంటసాల పేరుచెబితేనే మది పులకిస్తుంది. మనసు పరవళ్లు తొక్కుతుంది. హృదయం పాటల పూదోటలో ఆహ్లాదంగా విహరిస్తుంది. వందలు కాదు వేల పాటలతో తెలుగునాట వాణిని బాణిని వినిపించిన ఘనాపాటి అయన. ఘంటసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా మిగిలే ఉంటుంది. ఎందుకంటే..సంగీత ప్రపంచంలో ఆయన స్థానం అంత ఉన్నతమైనది. ఎవరు అందుకోలేనంత సమున్నతమైనది. అలాంటి ఘంటసాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి..ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రతి తెలుగువాడికి ఉంటుంది. పాట విలువ తెలిసిన ప్రతి సంగీత హృదయుడికి ఉంటుంది. ఎన్నో పుస్తకాలు వచ్చినా అన్నీ ఘంటసాల పాట గురించి ఆయన సంగీత పటిమ గురించే చెప్పాయే తప్ప అసలు ఘంటసాల అంటే ఏమిటో చెప్పలేదు. అలా చెప్పే ప్రయత్నమే ‘ఘంటసాల జ్ఞాపకాలు’..ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రతిభను, మానవత్వాన్ని అనేక కోణాల్లో రంగరించిన ఈ పుస్తకం ఆద్యంతం ఆసక్తి కలిగించే విధంగా చదివిస్తుంది. విజయనగర వీధుల్లో విహరించిన నాటి నుంచి సినీవీనీలాకాశంలో ధృవతారగా మారిన ఓ గంధర్వగాయకుడిగా ఎదిగిన ఘంటసాలను మనకు పరిచయం చేస్తుంది. ఆయన వ్యక్తిత్వానికి, ఆదర్శనీయతకు అద్దం పడుతుంది. ముఖ్యంగా ఈ పుస్తకం అంతా ఒక అత్మీయభావనతోనే సాగుతుంది. మనకు ఎక్కడా పుస్తకం చదువుతున్నామన్న ధ్యాస ఉండదు. ఓ ప్రపంచంలో విహరిస్తున్నామన్న ఆనుభూతే ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారితో ఆయన అనుబంధానే్న కాదు.. ఆత్మీయతాబంధాన్ని కూడా ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది. ఘంటసాల పాటల గురించి చెప్పడమంటే సూర్యుడికి దివిటీ పట్టడమే అవుతుంది. కాబట్టి ఆ పాటల జోలికి పోకుండా వ్యక్తిగా ఘంటసాల ఏమిటో, మనిషిగా ఆయన మానవీయ దృక్కోణాలేమిటో ఈ పుస్తకంలో దృష్టాంతాల సహితంగా వివరించారు. తోటి గాయకులకు ఘంటసాల అవకాశం ఇచ్చేవారు కారన్న అపప్రధను కూడా ఈ పుస్తకం ద్వారా ఆయన భార్య తొలగించేందుకు ప్రయత్నించారు. ఘంటసాలకు సంబంధించి వచ్చిన పుస్తకాలన్నింటికంటే కూడా ఈ పుస్తకానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే..ఆయన జీవితం ఇందులో ఉంది. గాయకుడిగా ఎదిగేందుకు ఆయన పడ్డ తపన, ఆరాటం ఎంతటిదో ఈ పుస్తకం చెబుతుంది.