Friday, January 28, 2011
హాస్యానికి చిరునామా ఇవివి
మిడిమిడి కామెడీ కాదు వారిద్దరిది. మాటలు, మనుషుల సైకాలజీపై అధారటీ..చూసిన వారికి ఎక్కడో చురుక్కున గుచ్చుకునే సూదంటు హాస్యం. తక్కువ కాలంలో ఎక్కువ నవ్వించేసి..హఠాత్తుగా పేకప్ చెప్పేసి, జనానికి ‘ఇప్పుడు నవ్వండి చూద్దాం’ అని ఓ ఝలక్ ఇచ్చి మాయమైన ఆ ఇద్దరు జంధ్యాల-ఇవివి.
ఒకరు గురువు..ఇంకొకరు శిష్యుడు.
ఇద్దరివీ పడి లేచిన బతుకులే. తెలుగుహాస్యచిత్రాలకు జంధ్యాల బొమ్మ అయితే ఈవీవీ బొరుసు. ఈ నాణెం తాలూకూ నాణ్యత గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ వుండదు. వల్లె వేసుకుని, జ్ఞాపకాల దొంతరలు మరోసారి తిరిగేసుకోవడం మినహా. గురువుదంతా మధ్యతరగతి మందహాసం. శిష్యుడిది మాస్ జనం మాటల మూటలు.
గురువు రాసి..తీసి..నవ్వించి, నిన్నగా మిగిలిపోతే, ఇప్పుడు శిష్యుడూ అదే పోకపోయి, జ్ఞాపకంగా మిగిలిపోయాడు.
ఇవివి సత్యనారాయణకు కాసింత గోదావరి గోరోజనం ఎక్కువ. ఆ నీళ్లిచ్చిన వెటకారపు పాలెక్కువ. అక్కడ జనం మధ్య తిరిగి నేర్చుకున్న ఎకసెక్కం మరింత ఎక్కువ.
‘ఏం చదివావమ్మా..’అని నెమ్మదిగా ప్రశ్నిస్తే..‘శివరంజని, సితార, జ్యోతిచిత్ర..’ఇదీ జవాబు.
‘చెయ్యేడకడుక్కోవాల్రా’ అంటూ సినిమా ప్రారంభం నుంచి చివరివరకు తిరిగి తిరిగిన పాత్ర చివరకు వేసే సెటైర్ ఏమిటంటే..‘అందుకే రాజుల పెళ్లికి రాకూడదు’..అని
అడ్రస్ కోసం వెదుక్కునే అమాయకుడికి మరో అమాయకుడు అరగంట సేపు స్పీచిచ్చి..చివరకు చేతిలో పెట్టేది ఏమిటంటే..‘వెంకట్రామా అండ్ కో ఎక్కాల పుస్తకం’..
కాస్త దగ్గరగా రావచ్చా అని ప్రియురాలు ప్రేమగా అడిగితే..ప్రియుడు చెప్పే జవాబు..‘వచ్చుకో’..
ఇలా మాట విరుపు ముందు పుట్టి..ఆ తరువాత పుట్టినవాడు ఇవివి.
ఇది తరువాత, తరువాత నేర్చుకున్నది కాదు..‘చెవిలోపువ్వు’ దగ్గర్నుంచీ అదే వ్యవహారం. సినిమాకు పేర్లు పెట్టడం..సినిమాలో పేర్లు రావడం, అన్నింటా మహా వెటకారం.
వేసింది..రాసింది..తీసింది..కూసింది..కోసింది..లెక్కెట్టింది..ఇవీ టెక్నీషియన్లకు ఆయనిచ్చిన బిరుదులు.
మిక్చర్‌పాటలంటే ఈవీవీకి మహాసరదా. సినిమా చివరిలో ఎంత గందరగోళం వుంటే అంతిష్టం. పేర్ల తమాషా..పేరడీ అంటే మరింత ఇష్టం. ‘నాదెండ్ల అంజయ్యగారు..నన్నపనేని గంగాభవానీగారు..అంటూ వాస్తవిక పేర్లను సినిమాల్లోకి తేవడం..సినిమా రిపోర్టర్లను కూడా పాత్రలను చేయడం..ఇలా ఒకటేమిటి ఎన్ని చమక్కులో..అసలు ఇన్ని చమక్కులు ఎక్కడ నేర్చాడా అనిపిస్తుంది. చెవిలోపువ్వు..ఆ ఒక్కటీ అడక్కు..నీమీద ఒట్టు..మీ ఆవిడ చాలా మంచిది’..ఇలా రాసుకుంటూ పోతే..ఈవీవీ సినిమాలన్నీ వల్లెవేయాలి.
భాగ్యరాజా తమిళ సినిమా ‘చిన్నరాజా’గా తెలుగులోకి వచ్చిన తరువాత, అదే సినిమా హిందీలో ‘బేటా’గా రీమేక్ అయ్యాక, మళ్లీ తెలుగులో, ‘అబ్బాయిగారు’ పేరిట తెలుగులో తీస్తే, హిట్ అయిదంటే అందులో ఈవీవీ చమత్కారాలు ఎన్ని చిత్రాలు చేయబట్టి. ఆమని, రంభ, రోజా, రచన, ఎల్బీ శ్రీరామ్, శ్రీకాంత్ తదితరులకు తెరజీవితాన్ని సుసంపన్నం చేసే మార్గాలు పరిచిన వాడు ఇవివి. కేవలం కామెడీ కాదు..మాస్ మసాలాలు కూడా తీయగలనని, హలోబ్రదర్, ఇంట్లోఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు లాంటి సినిమాలతో రుజువు చేసుకున్నవాడు ఇవివి.
అయితే..నిజమే కానీ..ఈవీవీ సినిమాలు కాస్త మోటుగా వుంటాయట..మాటల్లో బూతు ధ్వనిస్తుందట..అంటే..అవుననే చెప్పాలి. కానీ అతగాడికి అవే ఇష్టం అని మాత్రం చెప్పలేం. ఈవీవీ అయితే తనకు నచ్చి..తన కోసం తీసిన సినిమా ‘ఆమె’. ఆయనే ఎన్నో సార్లు చెప్పాడు..కమర్షియల్‌గా తప్పదు కాబట్టి తీస్తున్నా..కానీ నాకు ఇష్టమై కాదు..అని.
తొలిసినిమా పెద్దగా ఆడని కసితో రామానాయుడి కోసం ‘ప్రేమఖైదీ’ తీసిన ఇవివి..చివరిగా ఇచ్చిన మంచి హిట్ ‘బెండు అప్పారావు ఆర్‌ఎమ్‌పి’ కూడా ఆయన బ్యానర్‌లోనే తీయడం చిత్రం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment