Monday, October 1, 2007

ద్వారకాతిరుమల(చిన్న తిరుపతి)

అందరికి నమస్కారం.మొన్ననే ద్వారకాతిరుమల వెళ్ళివచ్చాను.ఆ గుడి విశేషాలు మీతో పంచుకుందామని ఇలా వచ్చాను.రాష్త్రంలో తిరుపతి తరువాత అంత ప్రముఖమైన వెంకటేశ్వరక్షేత్రం చిన్న తిరుపతి అనబడే ద్వారకాతిరుమల.పశ్చిమగోదావరి జిల్లాలో అధిక ఆదాయం వచ్చే మొదటి ఆలయం ఇది.దీని చరిత్ర చూద్దాం.
చరిత్ర:

త్రేతాయుగంలో స్వామి ఇక్కడ శేషాకృతిగల కొండపై వెలిశారు.ద్వారకా మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు తనపాదాలను ఆ మహర్షికి ఇచ్చుటచే ఈ క్షేత్రమునకు "ద్వారకాతిరుమల"అని పేరు వచ్చింది. త్రేతాయుగంలో శ్రీరాముని తాతగారైన అజమహారాజు,తండ్రి అయిన దశరధుడు,స్వయముగా శ్రీరాముడు స్వామిని సేవించినట్లు పురాణాలలో వుంది. మైలవరం జమిందారులు సూరానేని వంశీయులు వంశపారంపర్య ధర్మకర్తృత్వం వహించేవారు.ఈ మధ్యే ధర్మకర్తృత్వానికి ఎన్నిక పెట్టాలని అనుకుంటున్నారు.


ఆలయ విశేషాలు:ఇక్కడ స్వామి దక్షిణాభిముఖులై వుంటారు.ఇక్కడ శ్రీనివాసుని పాదాలు పుట్టలోనున్న ద్వారకునిచే పూజించబడుటచే స్వామిని సేవించుకొను భక్తులకు ఆ పాదాలు కనిపించవు.కనుక ధృవమూర్తికి వెనుకభాగమున పీఠంపై సంపూర్ణ శిలావిగ్రహమును ప్రతిష్టించారు.ఇలా ఒకే విమానం కింద రెండు ధృవమూర్తులు వుండటం విశేషం.రెండు ధృవమూర్తులు ఉండటం వల్ల ఏడాదికి రెండుసార్లు కళ్యాణ మహోత్సవములు జరుగుతాయి. మొక్కులు మొక్కుకొని పెద్దతిరుపతి పోలేని భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకోవచ్చని అంటారు.ఇక్కడ స్వామికి కోపం ఎక్కువని ఇక్కడ మొక్కుకొని మొదట ఇక్కడకు రాకుండ పెద్దతిరుపతి వెళ్ళి తర్వాత ఇక్కడికి వస్తే స్వామికి కోపం వస్తుందని అంటారు.ప్రాకారం నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు వున్నాయి.వీటిలో దక్షిణ ద్వారము వైపు గల గోపురం పెద్దది.దీనికి 5 అంతస్తులు వున్నాయి.స్వామివారి సన్నిధి కుడివైపు అలివేలు మంగతాయారు,ఆండాళ్ అమ్మవార్ల ఆలయాలున్నయి.ధ్వజస్తంభానికి వెనుక భాగాన్న స్వామివారికి ఎదురుగా భక్తాంజనేయ,గరుడాళ్వార్ల ఆలయం వుంది.భక్తులు తలనీలాలు సమర్పించటానికి ఆలయం బయట పడమర వైపు కళ్యాణకట్ట వుంది.తూర్పువైపు ప్రసాదాల కౌంటర్ వుంది. ఆలయం తొలిమెట్టు వద్ద పాదుకామండపం వుంది.ఇక్కడ స్వామివారి పాదాలు వుంటాయి.


గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ దణ్ణం పెట్టుకొని వెళ్ళటం సాంప్రదాయం.మెట్లకు తూర్పువైపున అన్నదాన సదనం వుంది.ఊరికి ముందు మనకు గరుడాళ్వారుని భారి విగ్రహం కనిపిస్తుంది.అలాగే టి.టి.డి వారి కళ్యాణ మండపం వద్ద భారి ఆంజనేయ విగ్రహం వుంది.


ఆలయ ఆధ్వర్యంలోనే కాక ఇతరులు కూడా కళ్యాణ మండపములు నడుపుతున్నారు.పెళ్ళిళ్ళ సీజన్లో ఊరు కలకలలాడుతూ వుంటుంది.

కళ్యాణాలు:

వైశాఖ మాసంలో దశమి నుంచి విదియ వరకు ఒకసారి,ఆశ్వీజమాసంలో విజయదశమి నుంచి విదియ వరకు రెండో సారి ఘనంగా జరుగుతాయి.ఇది కాక భోగి రోజున గోదాకళ్యాణం జరుగుతుంది.

వేళలు:

ఉదయం 6 గంటలనుండి మధ్యానం 1 గంటవరకు.తిరిగి 3 గంటల్నుంచి రాత్రి 9 గంటలవరకు.

ప్రయాణం:

మద్రాస్ నుండి కలకత్తా వెళ్ళే జాతీయరహదారిలో భీమడోలుకు 17 కిలోమీటర్లలోను,తాడేపల్లిగూడానికి 47 కి.మీ.,ఏలూరు కి 41 కి.మీ దూరంలో వుంది.ఏలూరు,తాడేపల్లిగూడెం స్టేషన్లలో అన్ని ఎక్స్ ప్రెస్స్ రైళ్ళు ఆగుతాయి.భీమడొలు స్టేషన్లలో తిరుమల,సింహాద్రి ఎక్స్ ప్రెస్స్లు పాసింజర్లు ఆగుతాయి.జిల్లలోని అన్ని ముఖ్యపట్టణాలనుంచే కాకుండా విజయవాడ,రాజమండ్రి,మచిలిపట్ణం నుంచి ప్రతి శనివారము మరియు ప్రత్యేక దినములలో బస్సులు వెళ్తాయి. హైదరాబాదునుంచి కూడా ఎ.పి.టూరిజం వాళ్ళు బస్సు నడుపుతున్నారు. దేవస్థానం వారి సమాచార కార్యాలయం పాదుకామండపం దగ్గర వుంది.ఉండటానికి అనేక సత్రాలు,అతిధి గృహాలు వున్నాయి.

చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు:

మద్ది ఆంజనేయస్వామి దేవాలయం:

ఇది ఇక్కడినుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే మార్గంలో గురవాయిగూడెం లో వుంది.ఈ ఆలయం చాలా విశేషమైనది.స్వామి మద్ది చెట్టుకింద వెలిసారు.తప్పక చూడవలిసిన ప్రదేశం.

రేణుకాదేవి(కుంకుళ్ళమ్మ) ఆలయం:

ఇక్కడినుంచి 1కి.మీ.దూరంలో భీమడోలు మార్గంలో వుంది.ఈ అమ్మవారు ప్రయాణంలో భక్తులకు కష్టాలు కలగకుండా చూస్తారని నమ్మకం.

కొసమెరుపు:మూడుసార్లు ఈ గుడికి వెళ్ళానుగాని ఇంతవరకు పెద్ద తిరుపతి వెళ్ళే భాగ్యం కలగలేదు.

7 comments:

Viswanath said...

మంచి వ్యాసం అందించారు.
బొమ్మలుకూడా బావున్నాయి.
ఒక చిత్రమైన విషయం ఏమంటే ఐదారుసార్లు
తిరుపతి వెళ్ళగలిగాను కాని ప్రక్కనున్న
ద్వారకాతిరుమల మాత్రం వెళ్ళలేక పోయాను.
మీకు రివర్సుగా...
దేనికైనా సమయం రావాలనుకుంటా

A V S Prasad said...

Your article is very nice, u gave us a good information about Sri Venkateswara Swamy, and gives us an interest to visit 'Dwaraka Tirumala'. Thank you very much. Sure u get a good chance of visiting 'Tirupati' also. Finally, from your article, 'final touch' as well as Sri Viswanath's comments gave us a laugh.

మాటలబాబు said...

మంచి సమాచారం , వీలుంటే ఆ సమాచారాన్ని వికీ లొ కూడా చేర్చండి.చిన్న దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్యగా ఈ దేవాలయం కొండ ఎక్కడానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేశారు. మెట్లు 50-75 మాత్రమే ఉంటాయి. కాని అవి ఎక్కలేని వారికి అనువుగా ఘాట్ రోడ్డు నిర్మించారు. గోదావరి జిల్లాల వారు ద్వారక తిరుమల ని చిన్న తిరుపతి గా నమ్ముతారు. పెద్ద తిరుపతి వెళ్ళలేని వారు ఈ స్వామి దర్శించుకొని వారి మొక్కుతీర్చుకొంటారు.

గానలోల said...

ద్వారకాతిరుమల గురించి మీరు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. మీరు అందించిన పొటోలు బాగున్నాయి.

Ramya said...

ramyamవిహారి గారు ద్వారకాతిరుమల గురించిన వ్యాసం బాగుంది.
నేను కూడా (పెద్ద )తిరుపతి గురించి ఒక ఆర్టికిల్ రాసాను ,కాస్త బద్దకించి బ్లాగులో ఇంకా రాయలేదు టైమ్ దొరికితే రేపు రాస్తాను.

విహారి(KBL) said...

@ విశ్వనాథ్ గారు,
@ ఎ.వి.ఎస్.ప్రసాద్ గారు,
@ మాటలబాబు గారు,
@ గానలోల గారు,
@ రమ్యగారు
అందరికి నెనర్లు.

Veeru said...

మంచి వ్యాసం అందించారు. నాకు ఇంతవరకూ ద్వారకాతిరుమల వెళ్ళే అదృష్టం కలగ లేదు. ఈ సారి ఇండియా వచ్చినప్పుడు ప్రయత్నిస్తాను.