Wednesday, March 24, 2010

ఆ రెండు మల్టీ స్టారర్‌లకు అరవై ఏళ్లు!

(అగ్రహీరోలు అక్కినేని, నందమూరి కలిసి నటించిన రెండు చిత్రాలు పల్లెటూరి పిల్ల, సంసారం 1950లో విడుదలయ్యాయి. అంటే ఆ రెంటికీ ఇది డైమండ్ జూబ్లీ. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం)


సినీ పరిభాషలో ఇద్దరు కథానాయకులు, ఒక చిత్రంలో కలిసి నటిస్తే దానిని మల్టీస్టారర్ చిత్రంగా పేర్కొనటం పరిపాటి. నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, కాంతారావు, జగ్గయ్య, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వీరిలో అభిమానులకున్న ఫాలోయింగ్‌నుబట్టి ఏ ఇద్దరు కలిసి నటించినా దాన్ని మల్టీస్టారర్ చిత్రంగా ట్రేడ్‌లో ఉదహరించేవారు. అందుకు తగ్గస్థాయిలోనే మిగతా తారాగణం ఎంపిక, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుండేది. 1950నాటికి దర్శకుడుగా ఎల్.వి.ప్రసాద్ రచయితలుగా తాపీ ధర్మారావు, సదాశివబ్రహ్మం ఫోక్‌లోర్ హీరోగా నాగేశ్వరరావు, గ్లామరస్ స్టార్‌గా అంజలీదేవి, టాలెంట్ ఉన్న ఆర్టిస్టుగా లక్ష్మీరాజ్యం, కమేడియన్‌గా రేలంగి, అప్పుడే సినీరంగ ప్రవేశంచేసి అందాల నటుడిగా పేరొందిన ఎన్.టి.రామారావు, సత్తా ఉన్న నటుడిగా నిరూపించుకున్న ఎ.వి.సుబ్బారావు, ఎస్.వి.రంగారావు, సూర్యకాంతం వీరంతా ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోనూ పేరొందినవారే. వీరిలో కొందరి కాంబినేషన్‌లో ఒక జానపద చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (ఏప్రిల్ 1950) ఒక సాంఘిక కుటుంబ కథాచిత్రం ‘సంసారం’ (డిసెంబరు 1950) విడుదలయ్యాయి. అంటే ఆ రెండు చిత్రాలకు అరవై ఏళ్లన్నమాట.


పల్లెటూరిపిల్ల:




శోభనాచల సంస్థలో నిర్మాణ, దర్శకత్వ శాఖల్లో పొందిన అనుభవంతో బి.ఏ.సుబ్బారావు దర్శక, నిర్మాతగా మారి ఆ సంస్థ భాగస్వామ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిచర్ట్ షెరిషన్ నాటకంలో ‘పిజారో’ ఆధారంగా రచయిత తాపీ ధర్మారావు, సంగీత దర్శకుడు ఆదినారాయణరావు కథ, కథనాన్ని రూపొందించారు. ఆదినారాయణరావు ‘శాంత వంటి పిల్ల లేదోయి’ అన్న పాటను కూడా రాయడం ఓ విశేషం. నాగులాపురం కోటలోని కంపనదొర కర్కోటకుడు. ఆ ప్రక్కనగల పల్లెటూరిని దోచుకోవడానికి జయంత్ (ఎన్.టి.ఆర్) నాయకత్వంలో అనుచరుల్ని పంపుతాడు. ఆ గ్రామ పెత్తందారు కూతురు శాంత (అంజలీదేవి). ఆమె జయంత్ దోపిడీని నిరసిస్తూ అతన్ని చెంపపై కొడుతుంది. మనసు మార్చుకున్న జయంత్ కంపన దొరతో గొడవపడి తిరిగి ఆ గ్రామం చేరి యువకులకు యుద్ధవిద్యలు నేర్పుతూ, శాంతను ప్రేమించి, ఆమె ప్రేమను పొందుతాడు. మరదలు శాంతను అంతకుముందే గాఢంగా ప్రేమించిన ఆమె బావ వసంత (నాగేశ్వరరావు) మొదట ఆగ్రహించినా, తరువాత త్యాగబుద్ధితో వారిరువురి వివాహం జరుపుతాడు. కక్ష కట్టిన కంపనదొర అనుచరులు జయంత్‌ను, అతని బిడ్డనూ బంధిస్తే వసంత్ నాగులాపురం కోటకు వెళ్లి వారిని విడిపించి తిరిగివస్తూ గాయపడి మరణిస్తాడు. కంపనదొర మారి పల్లెటూరిలో ఒకనిగా మారటంతో కథ ముగుస్తుంది. పల్లెటూరి పిల్ల చిత్రంలో ఎన్.టి.ఆర్ సంభాషణలు పలికిన తీరుకు, నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ‘డూప్’ వద్దని వారించి ఎద్దుతో ఫైట్‌చేసే సన్నివేశాలను తానే స్వయంగా నటించారు ఎన్.టి.ఆర్. ఆయనలోని అంకితభావానికి ఇది ఒక తార్కాణం. ఎ.ఎన్.ఆర్‌ది త్యాగంతో కూడిన అమాయకపు పల్లె యువకుని పాత్ర. శాంతపట్లగల ప్రేమను, జయంత్‌తో పెళ్లి చేయడంలో, చివరకు ఆమెచే నిందింపబడినా శాంత భర్తను, బిడ్డనూ కాపాడటంలో, కంపన దొరను చంపక విడవడంలో శాంత చెప్పే కృతజ్ఞతలు స్వీకరించకుండానే తనువు చాలించే సన్నివేశాలు అక్కినేని అభినయానికి వందనాలు చెప్పాల్సిందే.
చిలిపితనం, గడసరితనం కలిసిన హీరోయిన్‌గా అంజలీదేవి, స్ర్తి ఔన్నత్యాన్ని, పురుషాధిక్యతను చక్కగా పలికించిన నర్తకి లక్ష్మీకాంతం మిగిలిన పాత్రధారులు తమ పాత్రలను బాగా మెప్పించారు.
ఈ చిత్రానికి సహాయ దర్శకత్వం వహించిన తాపీ చాణక్య, సంగీత సహాయకునిగా పనిచేసిన టి.వి.రాజు, గూఢచారులుగా కొద్దిసేపు కన్పిస్తారు. వసంత పాత్రకు మొదట ఈలపాట రఘురామయ్యను అనుకున్నా, ఆయన ఫైట్ సీన్లు ఉన్నాయని చెయ్యననటంతో ఎ.ఎన్.ఆర్‌ను బుక్ చేసారు.
అక్కినేని, నందమూరి తొలిసారిగా నటించిన ఈ చిత్రం 100రోజులుపైగా ప్రదర్శింపబడింది. జెమినీ వాసన్ ఈ చిత్రాన్ని హిందీలో ‘ఇన్సాయత్’ పేరుతో దిలీప్‌కుమార్, దేవానంద్, బీనారాయ్‌ల కాంబినేషన్‌తో నిర్మించగా అదికూడా ఘనవిజయం సాధించింది.



సంసారం :




సాధనా పతాకంపై, నిర్మాత సి.వి.రంగనాథ్‌దాస్, ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో సదాశివబ్రహ్మం రచనతో, సుసర్ల దక్షిణామూర్తి సంగీతంతో రూపొందించిన కుటుంబ కథాచిత్రం- సంసారం.
రఘు, వేణు అన్నదమ్ములు. వేణు పల్లెటూరిలో ఉంటుంటాడు. రఘు, భార్య మంజుల పిల్లలతో పట్నంలో ఉంటాడు. రఘు మెతక మనిషి కావడంతో, అతని తల్లి, పెళ్లయిన చెల్లెలు అతని ఇంటిలో చేరి కష్టాలు పెట్టటంతో రఘు ఇల్లు వదలి వెళ్లిపోతాడు. మంజుల కుటుంబం సాకటానికి ఒకచోట పనిమనిషిగా చేరి చివరకు హత్యానేరంలో కూడా చిక్కుకుంటుంది. వేణును ప్రేమించిన పట్నం యువతి కమల సహాయంతోను, ఆమె తండ్రి సలహాతోనూ నాటకమాడి తల్లి, చెల్లెలుకు బుద్ధి చెప్పడంతో కథ సుఖాంతమవుతుంది.
అన్నగా ఎన్.టి.ఆర్, అతని భార్యగా లక్ష్మీరాజ్యం సాత్వికత, సహనంతో కూడిన పాత్రలు పోషిస్తే జానపద కథానాయకుడిగా పేరుపడిన ఎ.ఎన్.ఆర్‌కి, ఇది తొలి సాంఘిక చిత్రం. ఎం దరి అంచనాలనో తన నటనతో తలక్రిందులు చేస్తూ, సాంఘిక హీరోగా తన్నుతాను నిరూపించుకున్నారు అక్కినేని. రెండవ కథానాయికగా మొదట సావిత్రిని బుక్‌చేసినా కారణాంతరాలవల్ల ఎల్.వి.ప్రసాద్ పుష్పలతకు చోటిచ్చారు. ఆమె స్నేహితురాళ్లలో ఒకరిగా, అచ్చం హీరో నాగేశ్వర్రావులా ఉన్నావే అనే డైలాగ్‌తోనూ సావిత్రి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో రేలంగి తల్లిగా నటించిన సూర్యకాంతం ఉపయోగించిన డైలాగ్ ‘నువ్ తిరిగొచ్చేదేమిటి కానీ కార్డు దేశాలు తిరుగుతుంది’ అనేది ఆరోజుల్లో బాగా పేలింది.
రఘు పిల్లలుగా ఎల్.వి.ప్రసాద్ గారబ్బాయి ఆనంద్, ఆర్ట్ డైరెక్టర్ కళాధర్‌గారి అమ్మాయి అరుణ నటించారు. సురభి బాలసరస్వతి, రేలంగి హాస్యజంట కూడా ముద్రపడింది. చిత్రంలో సంగీతం, పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. టైటిల్‌సాంగ్ ‘సంసారం, సంసారం ప్రేమసుధాసారం’ వేణు, పుష్పలతలపై, అందాలా చందమామా, టక్కుటక్కు టమకుల బండి, పుష్పలతపై, ‘కలనిజమాయెగా’ రేలంగిపై, సొగసైన క్రాప్ పోయే వాటిల్లో కొన్ని.
ఉమ్మడి కుటుంబాలు, అత్తల, ఆడపడుచుల ఆరళ్లు పల్లెటూరి బైతు పట్నం వచ్చి ప్రయోజకుడై కుటుంబాన్ని సరిచేయటం, ఇలా ఒక్కో సమస్యపై ఒక చిత్రం వచ్చినా, అనేక సమస్యలు కలిసిన ఈ సంసారం చిత్రం పాతిక వారాలు ప్రదర్శించబడింది. మల్టీస్టారర్ చిత్రాలకు స్ఫూర్తినిచ్చిన ఆ రెండు చిత్రాల రూపశిల్పులకు నివాళులర్పిస్తూ, తీపిగుర్తుగా మిగిలిన కళాకారులు అక్కినేని, అంజలీదేవి, సుసర్ల దక్షిణామూర్తులను అభినందించుదాం.

1 comment:

Vinay Datta said...

I learnt many things though this article.