Friday, June 11, 2010

తెలుగు సినిమాకు ‘శుభప్రదం’

పాశ్చాత్యసంగీతపు పెనుతుపానుకు రెపరెపలాడుతున్న శాస్ర్తియసంగీతాన్ని కాపాడ్డానికి చేతులడ్డుపెట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.ఇంచుమించు ఇవే మాటలు చెపుతాడు శంకరాభరణం చిత్రం క్లయిమాక్స్ సన్నివేశంలో శంకరశాస్త్రి పాత్రధారి.ఇప్పుడు కళాతపస్వి విశ్వనాధ్ అదే పనిచేస్తున్నారనిపిస్తుంది..
ఎనభై సంవత్సరాల వయస్సు శరీరానికి. దాదాపు యాభై అయిదేళ్ల్ల అనుభవంలో..దగ్గరదగ్గర యాభై అయదు సినిమాలు.. వచ్చిన తరుణంలో,మళ్లీ మరోసారి మెగాఫోన్ పట్టుకుని కెమేరా వెనక్కు రావడం... ఇంకోసారి కట్..ఓకె. చెప్పేందుకు మాత్రం కాదు..తెలుగుసినిమా ప్రేక్షకులకు మరోసారి ఓ మంచి ‘తెలుగుసినిమా’ చూపించేందుకు..
మరోసారి కళాతపస్వి ఓపిక తెచ్చుకుని తనదైన బాణీలో అందిస్తున్న సినిమా ‘శుభప్రదం’.

విశ్వనాధ్ చాలా సినిమాల్లో అవకాశం దొరికినపుడల్లా, తెలుగుసినిమా పోకడలపై చిన్న చిన్న సెటైర్లు వేస్తుంటారు. అవి చిన్నవైనా చీమమిర్చిలా చురుక్కుమంటుటాయ.‘మలేరియా వ్యాధిగ్రస్తుడి మూలుగుల్లాంటి సంగీతం..కాటెయ్యనా, వాటెయ్యనా లాంటి సంగీతమూ..వస్తున్నాయని, గతంలోని ఓ చిత్రంలో చాన్నాళ్ల క్రితం చురక వేసారు. అవి అక్షరాలా నిజమైకూర్చున్నాయి ఇప్పుడు. హీరో ‘నీయమ్మ’ అనకుండా, హీరోయిన్ ‘నీయబ్బ’ అనడం ఫ్యాషనైపోయింది.
ఇలాంటి సమయంలో విశ్వనాధ్ సినిమా రావడం అంటే నిజంగా తెలుగుసినిమాకు శుభప్రదమే.
కానీ మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా విశ్వనాధ్ సినిమా వుంటుందా? స్వరాభిషేకం చిత్రం జనానికి అంతగా పట్టలేదన్నది చేదువాస్తవం. మరోపక్క అల్లరి నరేష్‌ను కేవలం కామెడీ చిత్రాల్లోనే జనాలు చూస్తున్నారన్నది మరో నిజం. కాస్త ట్రాక్ పక్కకు తప్పిద్దామని నరేష్ తండ్రి ఈవీవీ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పైగా విశ్వనాధ్ సినిమాల్లో కామెడీ అక్కడక్కడ చటుక్కున మెరిసి, చురుక్కుమనిపిస్తుంది. చిన్న సన్నివేశాలైనా ఎన్నాళ్లైనా గుర్తుండిపోతాయి. అంతేకానీ ఔట్ అండ్ ఔట్ కామెడీ వుండదు. వీటన్నింటి నేపథ్యంలో విశ్వనాధ్ ‘శుభప్రదం’జయప్రదంగా ప్రేక్షకులకు రీచ్ అవుతుందా?

అవుతుందనే భావిస్తున్నారు..సినిమా నిర్మాతలు. ‘సినిమాలో నరేష్ కనిపించినపుడల్లా..అది ఔట్ అండ్ ఔట్ కామెడీనే..కానీ నేపధ్యమంతా విశ్వనాధ్ విశ్వరూపమే’ అన్నది వారి మాట.. నరేష్ కామెడీ హీరో ఇమేజ్‌ను ఏమాత్రం విస్మరించలేదని, పైగా కథ పూర్తిగా అందుకు తగినదేనని వారి ఫీలింగ్.
అసలు కథలో హీరో పాత్రే నరేష్‌కు సూటైన పాత్ర. అచ్చంగా బద్ధకిష్టి..కష్టపడడానికి పెద్దగా ఇష్టపడనివాడు. ఇలా అనగానే విశ్వనాధ్ ‘శుభోదయం’లోని చంద్రమోహన్ పాత్ర..అది చేసే విన్యాసాలు గుర్తుకువస్తాయి. ‘..కావచ్చు..ఆ పాత్ర ఛాయలైతే వుండొచ్చు కానీ..ఇది పూర్తిగా భిన్నమైన పాత్ర..పైగా సినిమాటిక్ ఛాయలు వుండవు..పుట్టిన బుద్ధి..అన్న సామెతలా, అలాగే సాగిపోయే క్యారెక్టర్’ అంటున్నాయి యూనిట్ వర్గాలు.నిజానికి ఇలాంటి క్యారెక్టర్ మరో డైరక్టర్ ఎవరైనా అయతే సినిమా చివరకు వచ్చేసరికి పరివర్తన చెందుతుంది. కానీ విశ్వనాధ్ చిత్రం స్టయల్ వేరు కదా..ఎలాంటి క్యారెక్టర్ అలాగే నడుస్తుంది తప్ప సినిమాటిక్ వ్యవహారాలుండవు.

ఇంతవరకు కథ గురించి విశ్వనాధే కాదు ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. కానీ తెలుస్తున్న మేరకు ఈజీగోయింగ్‌ను నమ్ముకున్న కుర్రాడు అనుకోకుండా ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం, ఆమె తండ్రి పెళ్లికి నిరాకరించడం, ఆఖరికి మెత్తబడి అంగీకరించడం, వారి కాపురం సాగిన వైనం..ఇందులో శరత్‌బాబులాంటి పెద్దమనిషి పాత్ర జోక్యం..కేరళ నుంచి విజయనగరం వరకు షూటింగ్ జరిపినది ఇదే.
సరే కథ, కథనాలు అలా వుంచితే, ఎనభై ఏళ్ల వయసులో విశ్వనాధ్ షూటింగ్ ఎలా జరపగలిగారు?
ఆయనకు వయస్సు ఎంతమాత్రం అడ్డంకి కాలేదట. ఇప్పటి యువదర్శకుల మాదిరిగానే 56 రోజుల్లో సినిమా పూర్తిచేయగలిగారట. అదీ ఎండలు మండుతున్న కాలంలో. పక్కాగా స్క్రిప్ట్‌తో, తనదైన చిత్రీకరణతో విశ్వనాధ్ సినిమాను అనుకున్న సమయంలో కచ్చితంగా ముగించగలగడం చెప్పుకోదగ్గ విషయమే. నిర్మాతలకు కావాల్సింది కూడా అదే కదా.
అందమైన అమ్మాయి
విశ్వనాధ్ సినిమా అంటే అందమైన చిత్రం. అందునా అందులో అందమైన అమ్మాయి..అది జయప్రదైనా, సుమలతైనా, మీనాక్షిశేషాద్రి అయినా ఆఖరికి తాళ్లూరి రామేశ్వరి అయినా. మరి ఇప్పుడు ఈ సినిమాలో. మంజరీ ఫడ్నీస్. ఆ ఉత్తరాది అమ్మాయి, ఇప్పుడు అచ్చమైన విశ్వనాధ్ హీరోయిన్లా మారిపోయింది. చూస్తున్నవారు కళ్లు తిప్పుకోలేనంత తెలుగుదనం. మీనాక్షిశేషాద్రి..జయప్రద కలిసినంత అందం. నిజంగా సరైన హీరోయిన్ దొరికిందని సంబరపడుతున్నారు షూటింగ్ స్టిల్స్ చూసినవారంతా. అచ్చమైన తెలుగుదనంతో కూడిన మేకప్‌తో మంజరి కాస్తా పక్కింటి అమ్మాయలా మారిపోయంది.

మణిశర్మ సంగీతం

విశ్వనాధ్ సినిమాకు సంగీతానికి వున్న బంధం గురించి సినీ అభిమానులకు విడమర్చి చెప్పడం అంటే డిగ్రీ పూర్తిచేసిన వాడికి ఎబిసీడీల గురించి వివరించినట్లే. ఆదుర్తి దగ్గర అసిస్టెంట్‌గా వున్నప్పటి నుంచే మామ మహదేవన్‌తో బంధం ఏర్పడింది. ఆదుర్తి-మహదేవన్‌ల బంధంలాగే విశ్వనాధ్-మామ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు సినిమాను సుసంపన్నం చేసాయ. ఆ బంధం మధ్యమధ్య కాస్త తప్పినా..దాదాపు పాతిక చిత్రాల సంగీతబంధం. అటువంటి బంధం స్వాతికిరణంతో శాశ్వతంగా వీడిపోయింది. అద్భుతమైన పాటలు పొదిగిన ఆ చిత్రమే అటు మామ-విశ్వనాధ్‌ల బంధానికి, ఇటు మామ సినీ సంగీతానికి ఆఖరుచిత్రం. అప్పటి నుంచీ విశ్వనాధ్ చిత్రానికి ఒక్కొక్కరు మారుతూనే వస్తున్నారు. ఎవరు మారినా పాటల మాధుర్యానికి ఎంతమాత్రం కొరత లేదు. కానీ ఇంతవరకు విశ్వనాధ్ దృష్టి మణిశర్మపై పడలేదు. మంచి విద్వత్ వున్న మణిశర్మకు ఆ ప్రతిభాప్రకర్ష ప్రదర్శించే సరైన అవకాశమూ రాలేదు. ఇప్పుడదే ‘శుభప్రద’మైంది. ఆ కసితో తనేమిటో, విశ్వనాధ్ ఇచ్చిన అవకాశం ఇచ్చిన ఊపు ఏమిటో తెలిసేలా, ఆరుపాటలు స్వరపరిచాడు మణిశర్మ. ‘వౌనమే చెబుతోంది..ఏ మాట నీ మాటున దాగివుందో..’ ‘నీ చూపే కడదాక నాకలిమి..’, ‘బయిలెల్లె బయిలెల్లె పల్లకి’..‘తప్పట్లోయ్ తాళాలోయ్’..ఇవి నాలుగు పాటల పల్లవులు. త్వరలో వచ్చే ఆడియో కోసం విశ్వనాధ్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వీటిని సిరివెనె్నల, అనంత్‌శ్రీరామ్, రామజోగయ్య శాస్ర్తీ రచించారు. విశాఖ ఆకాశవాణిలో పనిచేసే రాంభట్ల తొలిసారి ఓ గీతం రాసారు. అలాగే విశాఖకే చెందిన ఎస్పీబాలు బంధువు ఒకరు కీలకపాత్ర ధరించారు. ఇక బాలు అయితే ఓసారి సినిమాలో అలా తళుక్కున మెరిసారు. విశ్వనాధ్-బాలుల సోదర బంధం జగద్వితమే కదా. ఒకపాటనైనా వేటూరి చేత రాయించాలనుకున్నా కుదరలేదని తెలిసింది. లేకుంటే విశ్వనాధ్ సినిమాతో ఆరంభమై విశ్వనాధ్ సినిమాకే ఆఖరి పాట రాసి వుండేవాడేమో ఆ మహానుభావుడు వేటూరి.

కేరళ టు విజయనగరం వయా అన్నవరం
కథ రీత్యా హీరో నేపథ్యం కేరళలో ప్రారంభమవుతుంది. అందుకే అక్కడ ఎక్కువభాగం షూటింగ్ జరిపారు. కేరళలో చిత్రీకరించిన సన్నివేశాల్లో బాలు పాల్గొన్న సన్నివేశం కూడా వుంది. ఒక పాటల కార్య క్రమంలో బాలు, నరేష్‌ల నడుమ సంభాషణ, జానపద సంగీత ప్రస్తావన, పాట, ఇందులో భాగం. ఇక కథలో కీలకమైన మరో పాత్ర ఇంటి కోసం ఆ నోటా ఈ నోటా విని విజయనగరం సమీపంలోని ఒక ఫార్మ్‌హౌస్‌లో షూటింగ్ జరిపారు. దాదాపు అయిదెకరాల స్థలంలోని రిచ్‌నెస్ వుట్టిపడే ఇల్లు అది. దానికి కొన్ని అదనపు సొగసులు అమర్చి షూటింగ్ జరిపారు. ఈ నడుమ అన్నవరం కొండ కింద పంపా రిజర్వాయిర్ పక్కన పదిహేనులక్షల వ్యయంతో హీరో ఇంటి కోసం చక్కటి సెట్ వేసారు. ఇటు దేవుడి కొండ, అటు నిండుగా నీరున్న పంపా రిజర్వాయర్, నడుమ చక్కటి ఇల్లు. విశ్వనాధ్ శంకరాభరణం, సూత్రధారుల్లో కొన్ని సన్నివేశాలు అన్నవరంలో షూట్ చేసారు. శంకరాభరణంలో సామజవరగమన ఇక్కడి రిజర్వాయిర్ పక్కన , అలాగే టీటీడీ కళ్యాణమండపం పైన చిత్రీకరించారు. మళ్లీ చాన్నాళ్లకు విశ్వనాధ్ తన సినిమా షూటింగ్ అన్నవరంలో జరపడం మరో విశేషం.
చివరగా మిగిలిపోయన పాట చిత్రీకరణను రామానాయుడు స్టూడియోలో ఈనెల ఫస్ట్ నుంచీ ప్రారంభించి మూడు రోజుల్లో ముగించారు.
ఫైట్లు?
విశ్వనాధ్ సినిమాలో ఫైట్లుంటాయా? మహాఅయతే రెండు పిడిగుద్దులు, అంతవరకే అది జీవితనౌక అయనా, శుభలేఖ అయనా, సిరిసిరిమువ్వ అయనా. కానీ చిన్నబ్బాయ, ఆపద్భాంధవుడు లాంటి స్టార్ సినిమాలు కొంచెం మినహాయంపు. శుభమస్తులో కూడా ఓ బుల్లి ఫైట్ వున్నట్లు వినికిడి. ఎప్పటిలాగే విశ్వనాధ్ సినిమాల్లో కనిపించే తారాగణం శరత్‌బాబు, అనంత్,
ఇక సిరిసిరిమువ్వ నుంచి ప్రారంభమైన (ఆపద్భాంధవుడు, చిన్నబ్బాయి, ప్రెసిడెంట్ పేరమ్మ వదిలేస్తే) స,శ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా పేరూ..శుభప్రదం. సినిమా జయప్రదం అయితే తెలుగుసినిమాకు శుభప్రదం.

1 comment:

seshu said...

shbham bhooyat. Waiting for a nice movie