Tuesday, October 5, 2010
సందేశాత్మక దర్శకుడు కె.బి.తిలక్
తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో లబ్ధప్రతిష్టులైన నిర్మాతలు, దర్శకులున్నారు. కానీ వారిలో అంకిత భావంతో, తాము నమ్మిన సిద్ధాంతాలకే విలువనిస్తూ అభ్యుదయ భావాలతో చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించినవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో కె.బి.తిలక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1926 జనవరి 14న జన్మించిన కొలిపర బాల గంగాధర తిలక్ (కె.బి.తిలక్) స్వంత వూరు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు. చిన్నతనంనుంచి వామపక్ష భావాలను అలవరుచుకున్న తిలక్ క్విట్ ఇండియా ఉద్యమంలో రాజమండ్రి జైలులో కారాగార శిక్ష కూడా అనుభవించారు. ప్రజా నాట్యమండలి సభ్యులుగా అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. స్వంత మేనమామ ఎల్.వి.ప్రసాద్ (అక్కినేని లక్ష్మీవరప్రసాద్) సినీ దర్శకుడిగా మద్రాసులో స్థిరపడడంవలన ఆయన శిష్యుడిగా స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా సినీరంగప్రవేశం చేసారు. 1949లో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం చిత్రం ద్వారా పరిచయమైన మహానటుడు ఎన్.టి.రామారావు మొ దటి మేకప్ స్టిల్‌ను తీసింది కూడా కె.బి. తిలకే. ఆ తర్వాత ఎడిటింగ్ శాఖలో చేరి ఎన్‌టిఆర్ హీరోగా యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన జయసింహ (55) అలాగే తాపీ చాణ క్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ‘రోజులుమారాయి’ చిత్రానికి కూడా ఎడిటర్‌గా పనిచేసారు.
నవయుగ సంస్థ ఎస్.వరలక్ష్మి రామచంద్ర కాశ్యప నటించిన ‘జ్యోతి’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారు. ఈ చిత్రం ఆర్థిక కారణాలవల్ల సగంలోనే నిర్మాణం ఆగిపోవడంవలన ఛాయాగ్రాహకుడు శ్రీ్ధర్‌తో కలిసి ఆ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా వహించి జ్యోతి చిత్రాన్ని 1954లో విడుదల చేసారు. ఆ చిత్రం టైటిల్స్‌లో తిలక్, శ్రీ్ధర్‌ల పేర్లు కనిపిస్తాయి.
‘అనుపమ’ ఫిల్మ్స్ సంస్థను స్థాపించి జగ్గయ్య, జమునలతో ముద్దుబిడ్డ (1956) చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఆరుద్ర స్క్రిప్ట్‌ను అందించగా పెండ్యాల సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. రెండవ చిత్రంగా భూసంస్కరణలు కథాంశంగా ఎంఎల్‌ఎ (1957) చిత్రాన్ని నిర్మించారు. రంగస్థల నటుడు జె.వి.రమణమూర్తిని నటుడిగా ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత అత్తా ఒకింటి కోడలే (1958) చిత్న్రా నిర్మించి దర్శకత్వం వహించారు. తిలక్ చిత్రాలలో అంతర్లీనంగా ఒక సందేశం వుండడం మామూలే. అత్తా ఒకింటి కోడలే కుటుంబ గాథా చిత్రమైనా అందులో టైటిల్‌లోనే మనకు సందేశం కనపడుతోంది. ఆ తర్వాత ఈడుజోడు (63). ఉయ్యాల జంపాల (65), భూమికోసం (74), నిర్మించి జయప్రద, ప్రభలను పరిచయం చేశారు. అయితే అదే సంవత్సరంలో ప్రభ నటించిన నీడలేని ఆడది కూడా విడుదలైంది. తర్వాత కృష్ణ-ప్రభలతో కొల్లేటి కాపురం (76) నిర్మించారు. ఇవి కాక బయటి బ్యానర్లకై చిట్టితమ్ముడు, పంతాలు పట్టింపులు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1982లో విడుదలైన గోపీచంద్ నవల ఆధారంగా వచ్చిన ధర్మవడ్డీ తిలక్ దర్శకత్వంలో వచ్చిన ఆఖరి చిత్రం. విశేషమేమిటంటే మొదటి చిత్రం ఎంఎల్‌ఎ ఆఖరి చిత్రం ధర్మవడ్డీలో జగ్గయ్య నటించారు. (చిట్టితమ్ముడు, పంతాలు పట్టింపులు తప్ప) ఆరుద్ర, పెండ్యాల తిలక్ దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు పనిచేసి ఆణిముత్యాలు లాంటి పాటలను అందించారు.
తిలక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు జనబాహుళ్యానికి హత్తుకుని తమ సమస్యలకు పరిష్కార మార్గం కూడా ఆ చిత్రాలలో ప్రేక్షకులకు గోచరించాయి. పత్రికా రంగం అంటే తిలక్‌కు ఎనలేని ప్రేమ. భూమి కోసం చిత్రం గురించి సీనియర్ జర్నలిస్టు వెటరన్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఎస్.వరదాచారి రాసిన రివ్యూ కాపీలను ఆ చిత్రం ప్రదర్శించబడుతన్న థియేటర్స్‌కు కూడా ప్రింటుతోపాటు పంపించి పత్రికారంగంపట్ల ఆయనకు వున్న మక్కువను చాటుకున్నారు. ఆ చిత్రం ప్రదర్శించబడుతున్న నల్గొండ, భువనగిరి, మిర్యాలగూడలలో జరిగిన అభినందన కార్యక్రమాలకు జగ్గయ్య, ప్రభలతో పాటు వరదాచారిని కూడా ఆహ్వానించి గౌరవించారు. సినిమా ఒక పవర్‌ఫుల్ మీడియా. అది ప్రజల సమస్యల పరిష్కార మార్గానికి ఉపయోపడాలి అని నమ్మి కమర్షియల్ హంగులవైపు తొంగి చూడక, సందేశాత్మక చిత్రాలనే నిర్మించారు. కె.వి.రెడ్డి, ఎన్‌టిఆర్ లాగా చిత్రం స్క్రిప్టు సిద్ధం అయిన తరువాత ఎన్ని అడ్డంకులు వచ్చినా స్క్రిప్టును మార్చక చిత్రాలను నిర్మించారు. మొదటి చిత్రం ముద్దుబిడ్డలో ప్రధాన పాత్ర నటి జి.వరలక్ష్మి ఒక డైలాగ్ మార్చాలని పట్టుపట్టినప్పుడు షూటింగ్ ఆపుచేసి ఆ నటిని మార్చి ఆమె స్థానంలో లక్ష్మీరాజ్యంను బుక్‌చేసి చిత్రాన్ని నిర్మించి అఖండ విజయం సాధించారు.
ఇండోపాకిస్తాన్ మైత్రికై తనవంతు కృషిగా ఇండి యా పాకిస్తాన్ సాంస్కృతిక బృందాలను ఒకేవేదికపై తీసుకుని వచ్చి, 1997లో హైదరాబాద్‌లో సాంస్కృతిక మైత్రిని స్థాపించి భారీ కార్యక్రమాలను నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. హైదరాబాద్‌లో రఘుపతి వెంకయ్యనాయుడు విగ్రహ నిర్మాణానికి ఎనలేని కృషి జరపడమే కాకుండా 2009లో తకు లభించిన బిఎన్‌రెడ్డి జాతీయ పురస్కారం ద్వారా లభించిన నగదు పురస్కారం నుంచి లక్ష రూపాయలను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టెలివిజన్ నాటక రంగ సంస్థలకు విరాళంగా ప్రకటించి రఘుపతి వెంకయ్యనాయుడు విగ్రహ నిర్వహణ ఖర్చులకై కేటాయించారు.
ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకిని తాను నిర్మించిన ఎం.ఎల్.ఎ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం గావించారు. ప్రముఖ దర్శకులుగా వెలుగొందిన కె.బాపయ్య, బి.ఎస్.నారాయణతోపాటు రాజాశివానంద్, వైఆర్ బాబు, శ్యాం మొదలగు వారు ఆయన శిష్య బృందం నుండి వచ్చినవారే. గయ్యాళి పాత్రలలో రాణించిన రంగస్థల నటి లక్ష్మీకాంతమ్మ (అత్తా ఒకింటి కోడలే ద్వారా)ను వెండితెరకు పరిచయం చేసింది కూడా తిలక్‌గారే. సంగీత దర్శకుడు పెండ్యాల, రాజాశివానంద్, సుంకర లాంటి వారిని కూడా తన చిత్రాలలో నటింపచేశారు. గుమ్మడిని తాను దర్శకత్వం వహించిన ‘చోటీ బహు’ ద్వారా హిందీ చిత్రరంగానికి పరిచయం చేశారు. అలాగే ప్రముఖ హిందీ నటుడు అశోక్‌కుమార్‌ను ‘్భమికోసం’ చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు.
తిలక్ మంచినటుడు కూడా. యు.విశే్వశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన నగ్నసత్యం (79) చిత్రంలో కార్మిక నాయకుడిగా నటించి మెప్పించారు. ఈ చిత్రం రీజినల్ ఫిల్మ్ విభాగంలో జాతీయ అవార్డు పొందింది. తిలక్ నటించిన రెండవ ఆఖరి చిత్రం ‘ఆలయం’ (ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో) జాతీయ అవార్డు పొందింది. ఆలయం చిత్రం షూటింగ్ సమయంలో మరణించిన తిలక్ సతీమణి ‘శకుంతల’ ఫోటోతో చిత్రీకరించిన ఆ చిత్రంలోని ఒక ప్రధాన పాటలో నటించి నటనలోనే భార్యా వియోగాన్ని తనలోనే దాచుకున్నారు.
తెలుగు చిత్రాలనే కాకుండా చోటిబహు, సాస్ భీ బహుధీ (అత్తా ఒకింటి కోడలే) లాంటి హిందీ చిత్రాలను కూడా దర్శకత్వం వహించారు. తిలక్‌కు సంగీతం, సాహిత్యంఅంటే అభిమానం ఎక్కువ. చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది (ముద్దుబిడ్డ), ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము (ఎంఎల్‌ఎ) పైలాపైలా పచ్చీసూ (అత్తా ఒకింటి కోడలే) కొండగాలి తిరిగింది (ఉయ్యాల జంపాల), ఎవరో వస్తారని ఏదో చేస్తారని (్భమికోసం), అందాలా రాముడూ ఇందీవర శ్యాముడు (ఉయ్యాల జంపాల) తిలక్ చిత్రాలనుంచి వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. తిలక్‌కు సంతానం లేరు. స్వంత మరదలు భానుమతి కుమారుడు లోకేష్ తిలక్ దత్తపుత్రుడు.
ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా రంగానికి ఎనలేని సేవలు చేసిన తిలక్‌ను ఏ యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కరించుకోలేదు. పద్మ పురస్కారాలు దరిదాపుకే చేరుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009లో జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసిన బిఎన్ రెడ్డి అవార్డు ఒక్కటే ఆయనకు లభించిన మొదటి ఆఖరి విలువైన పురస్కారం. నేడు తిలక్ భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన చిత్రాలు రాబోయే తరాలకు ఒక తీపి గుర్తులుగానే కాకుండా కలకాలం గుర్తుంటాయి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment