Sunday, October 2, 2011

సినిమా పోస్టర్

ముక్కలు చేసింది తిరిగి అతికితే ఎంతయినా కృతకంగానే వుంటుంది. కానీ అదేం చిత్రమో.. ముక్కలు ఎన్ని ఎక్కువైతే అంతకు అంతా అందంగా తయారవుతుంది....సినిమా పోస్టర్.. చెప్పే విషయం ఏదైనా చదివించేదిగా వుండాలంటే, అక్షరాలు అందంగా అమరాలి.. విడివిడి అక్షరాలు కలివిడిగా మారితేనే అందమైన కావ్యం అవతరిస్తుంది. 24ముక్కలు కలిసి కమనీయ పోస్టర్‌గా మార్చిన వాడికి, వేన వేల అక్షరాలు కూర్చి జీవిత కావ్యం అందించడం అసాధ్యమా..కానే కాదు. అందుకే చిత్రకారుడు ఈశ్వర్ జీవితకథ..సినిమా పోస్టర్ అందంగా..అంతకన్నా ఠీవిగా జంక్షన్‌లో జయకేతనం ఎగురేసింది. 3గీతా2చార్యుల్లో, రాతనేర్చిన వారు అరుదు. రమణ చాటు నేస్తం బాపుసంగతి అంతగా తెలియదు కానీ, మోహన్, చంద్ర భలేగా రాయగలరు. భావాలను కుంచెతోనే కాదు..కలంతో కూడా చెప్పేయగలరు. ఇప్పుడు చిత్రకారుడు ఈశ్వర్ సొంత కథ చదివాక ఈ జాబితాకు మరో పేరు జోడయిందనిపిస్తుంది. ఈశ్వర్‌కు పబ్లిసిటీ ఆర్టిస్టు అనో, సినిమా డిజైనర్ అనో, పోస్టర్ డిజైనర్ అనో విశేషణం జోడిస్తే, కచ్చితంగా ఆయన్ను తక్కువ చేసినట్లే అవుతుంది. తెలుగుసినిమా ప్రగతిలో ఆయన వాటా ఆయనకు వుంది. ఆ రంగ చరిత్రలో ఆయన పేజీ ఆయన డిజైన్ చేసుకున్నదే. ఎన్ని సినిమాలు..ఎంత మంది హీరోలు..ఎన్ని పాత్రలు..ఎన్ని ఆహార్యాలు..ఎన్ని వైవిధ్యమైన డిజైన్లు. రచయిత ఊహలో దాగుడుమూతలాడుతున్న పాత్రలను తన ఊహతో ఒడిసిపట్టి, కుంచెలోకి కుదించి, కాగితంపైకి మళ్లించి, జనం కళ్ల ముందుంచడంలో తొలి కష్టం ఈశ్వర్‌దే. కంప్యూటర్ కాలం కాదది. ప్రతీదీ స్వంత కష్టంపైనే ఆధారపడి చేయాల్సింది. అలాంటి రోజుల్లో ఈశ్వర్ చేసిన 3సిత్రాలు2 ఇన్నీ అన్నీనా? మాస్ జనాలని థియేటర్ దిశగా మళ్లించే సినిమా పోస్టర్‌కు క్లాసిక్ హంగులు అద్దారా.. సినిమాకో వేషం వేసే హీరోలకు అన్ని రకాల వేషాలూ అమరేలా విగ్గులు డిజైన్ చేసారా... సింగిల్ కట్ నుంచి 24షీట్ వరకు ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్నీ చేసేసారా?... సింగిల్ హ్యాండ్‌తో ఎన్ని జూనియర్ హ్యాండ్‌లను తయారుచేసి, సినిమా రంగానికి కానుకగా ఇచ్చారనీ..? ఇన్ని చేసిన 3ఈశ్వరుడి2కి ఈ రంగమే కాదు..జగమంతా తెలుసుని ఇప్పుడు జనానికి తెలిసింది..ఈ సినిమా పోస్టర్ పుస్తకంతో. సినిమా ఆర్టిస్టు ఈశ్వర్ జీవితకథ. పుట్టిందీ..పెరిగిందీ..సినిమారంగంలో నిలదొక్కుకున్న వైనం..ఇవేగా వుండేది. అచ్చంగా అంతే వుంటే..ఇంతలా చెప్పుకోనక్కర్లేదు. పేజీలు తిరగేసి, ఫొటోలు చూసేసి, పక్కన పెట్టేసుకోవచ్చు. కానీ ఈశ్వర్ డిజైన్ చేసిన సినిమా పోస్టర్‌లాగే ఈ పుస్తకం కూడా మనల్ని అంత సులువుగా కళ్లు తిప్పుకోనివ్వదు. పైగా ఏకబిగిన మొత్తం చదివేయమంటుంది. అలా అని గబగబా చదివేద్దామంటే వీలు కాదు. ఎందుకంటే దాన్నిండా విషయం కిక్కిరిసిపోయింది. ఇటు మన సినిమా డిజైనింగ్ రంగంలోనే కాదు, దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ విభాగంలో వినుతికెక్కినవారి వైనాలన్నీ విడమర్చి వివరించారు. అక్కడితో ఆగిపోయారా...మన 3గీతా2చార్యుల్లో కాస్త చేయితిరిగిన వారి గురించి విన్నవించుకున్నారు. ఇది తన కథ కాదు..తను దర్శించిన చిత్రప్రపంచం అని సవినయంగా కళ్లముందుకు తీసుకొచ్చారు.. వినయంగా అని ఎందుకనాల్సి వచ్చిందంటే, ఇంత మంచి విషయాలు అన్నీ ఓపిగ్గా సేకరించి, గుదిగుచ్చి అందించిన తరువాత కూడా 3తిలకాష్ట మహిషబంధనం2లా..ఓ అద్భుతమైన, గాంభీర్యమైన పేరు పెట్టకుండా, తను నముకున్న, తనను ఇంతవాణ్ణి చేసిన సినిమా పోస్టర్‌నే మకుటంగా వుంచారు ఈశ్వర్. పుస్తకంలో పలు ప్రధానాంశాలున్నాయి. ఒకటి ఈశ్వర్ అనే ఈశ్వరరావు పుట్టింది..పెరిగింది..ఎలా చెన్నపట్నం చేరిందీ. చెన్నపట్నంలో సినిమా రంగంలో కాలూనిన దగ్గర నుంచి నడిచిన తోవలో ఎదురైన అనుభవాలు..ఆపై, మన సినిమా ప్రచార రంగం, దాని ప్రగతి పయనం, వివిధ రకాల ప్రక్రియలూ,(ముఖ్యంగా పేజీ 85 నుంచి), కాలంతో పయనించిన వివిధ ప్రకటన సంస్థలు, వాటి వైనాలూ ఇవన్నీ ఒక ఎత్తు. ప్రపంచ ప్రఖ్యాత వర్ణ చిత్రాలూ, కళాకారులూ, బాలీవుడ్ ప్రచార కళాకారులూ, వారి సంక్షిప్త పరిచయాలూ, ఇవి చాలవన్నట్లు మన తెలుగు చిత్రకారులూ, వారి విఖ్యాత విలాసం జోడించారు మళ్లీ వెనక్కివచ్చి తెలుగు తమిళ సినీ ప్రముఖులూ, సంస్థలూ, స్టూడియోలూ, పలువురు పోస్టర్ డిజైనర్లూ ఇలా ఎందరెందరినో, ఆఖరికి తన దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరితో సహా.. స్మరించుకున్నారు..తలుచుకుని మురిసిపోయారు. ఇక ఇవన్నీ చాలవన్నట్లు, తన సుదీర్ఘ వృత్తి జీవితంలో తన కుంచె నుంచి వెలువడిన ఎన్నో చిత్రాలను ఆల్బమ్‌లా గుదిగుచ్చి అందించారు. పుస్తకం చదవుకుండా పొరపాటున ఈ బొమ్మల జోలికి వెళ్లారో..అలా అలా వాటి వెంట వెళ్లిపోయే ప్రమాదం వుంది. వాటిని చూడాలనే ఆతృతను అలాగే అదిమిపెట్టి, అక్షరాల వెంట పరుగులు పెట్టి, ఆ తరువాత ఈ వర్ణచిత్ర సౌరభాన్ని తనివితీరా ఆస్వాదిస్తే, ఆ అలసట మటుమాయమవుతుంది. పఠన ప్రయాణం పరిపూర్ణమవుతుంది. అంతా పూర్తయ్యాక, అప్పుడనిపస్తుంది. ఇంతకీ ఈశ్వర్ 3గీతాచార్యుడా.. ..రాతకారుడా? తన బొమ్మలంత అందంగానూ, పుస్తకం రాసేసాడే అని. అదే సమయంలో చేయి తిరిగిన స్క్రిప్ట్ రైటర్‌లా రాయదల్చుకున్నవి, చెప్పదల్చుకున్నవి ఒక పద్దతి ప్రకారం చెప్పాడే అని. కొసమెరుపేమిటంటే..అప్పుడప్పుడు పుస్తకంలోకి కైలాసం అనే పాత్రధారి వచ్చి ఈశ్వర్ మనసులోని మాటలు చటుక్కున చెప్పేసి, వేయాల్సిన చెణుకులు వేసేసి వెళ్లిపోతుంటాడు. భలే చమత్కారంగా. ఏదైనా చూడాల్సినదే కాదు..చదవాల్సింది కూడా సినిమా పోస్టర్?2 సినిమా పోస్టర్ రచన: ఈశ్వర్ వెల: రూ.450/- విజయా పబ్లికేషన్స్ 15, పలయకరన్ స్ట్రీట్ కలైమానగర్, చెన్నయ్-32 ఫోన్: 9848046535

1 comment:

kanthisena said...

సినిమా పోస్టర్‌పై మీ పరిచయం చాలా బాగుంది. ఇవ్వాలే విజయా పబ్లికేషన్స్ నుంచి ఈ పుస్తకాన్ని నేరుగా తెప్పించుకోబోతున్నాను. మీ పరిచయ కథనం ఒకే పేరాగా ఉండటంతో చదవటం ఇబ్బందిగా ఉంది. అలాగే మీ బ్లాగ్ థీమ్ కూడా మారిస్తే మంచిదేమో. ఎందుకంటే నల్ల రంగుపై తెల్లక్షరాలు కంటికి భారంగా కనిపిస్తున్నాయి. మంచి పరచయానికి అభినందనలు
రాజశేఖరరాజు
చందమామ
మొబైల్ 7305018409