Sunday, October 7, 2007

కొడైకెనాల్




అందరికి నమస్కారం.ఈ సారి అందాల పర్వత యువరాణి కొడైకెనాల్లో మిమ్మలిని విహరింపచేయటానికి మళ్ళీ వచ్చేసా.మేము పుదుక్కొట్టైలో వుండగా కొడైకెనాల్ వెళ్ళాం.నాకు అసలే కొత్త ప్రాంతాలు చూడటమంటే యమ పిచ్చి.అందుకే అందరిని పోరుపెట్టి ఎలాగైతే ఓ పదిమందిమి కలిసి సుమోలో కొడైకెనాల్,పళని,పొల్లాచ్చి చూడటానికి బయలుదేరాం.రాత్రి 11 గంటలకు బయలుదేరితే ఉదయం 5 గంటలకు అక్కడికి వెళ్ళిపోయాం.అక్కడ కాటేజ్ తీసుకొని ఊరు మీద పడ్డాం.ఆ సంగతులు తరువాతి టపాలలో చెప్తాను.ముందు కొడైకెనాల్ గురించి చెప్తాను.



తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో కేరళ సరిహద్దు దగ్గర రెండువేలకు పైగా మీటర్ల ఎత్తులో పళని కొండల్లో వుంది.మనదేశంలో అమెరికన్లు ఏర్పాటు చేసిన ఏకైక హిల్ స్టేషన్ ఇదే.పూర్వం గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ ప్రాంతం అమెరికన్ల వాళ్ళే వెలుగులోకి వచ్చింది.అప్పట్లో దక్షిణ తమిళనాడులో వాళ్ళు చాలా క్రైస్తవ మిషనరీలు నడిపేవారు. కాని వాళ్ళు వేడికి తట్టుకోలేక చాలా మంది రోగాల పాలై చాలా ఇబ్బందిపడే వాళ్ళు.దనితో మదురై సమీపంలో ఎదైనా చల్లని ప్రదేశంకోసం వేట ఆరంభించారు.అలా 1845 ప్రాంతంలో ఈ ప్రదేశాన్ని కనుగొన్నరు.




ఒకొక్కళ్ళు వచ్చి అక్కడ నివశించటం మొదలుపెట్టారు.అలా 1860 అక్కడ మొదటి చర్చ్ ను నిర్మించారు.ఇప్పటికి ఆ చర్చ్ అలాగే వుంది.ఒక మేజర్ అప్పట్లో యూకలిప్టస్ మొక్కలు తెచ్చి కొడై అంతా పాతాడు.అందుకే ఇప్పుడు కొడై ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి.ఎత్తుగా ,ఏపుగా వున్న యూకలిప్టస్,ఫైన్ వృక్షాలు కొడైకి వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతాయి.



1875లో మద్రాసు నుంచి మదురై కి రైలు వెయ్యటంతో ప్రయాణానికి కొంత వెసులుబాటు కలిగింది.తర్వాత 1914 లో కొండ పైకి రోడ్డు మార్గం ఏర్పడింది.



కొడైలో చాలా ప్రదేశాలు కొడై లేక్ సమీపంలోనే వుంటాయి.ఆ సంగతులు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తరువాతి టపాలలో.అంతవరకు శెలవు.

6 comments:

Viswanadh. BK said...

అద్బుతంగా ఉంది
పిక్చర్స్ కూడా అదుర్స్

నిజానికి ధామస్ అనే బ్రిటిషర్ ఒక్కడే అక్కడి మొక్కలన్నిటిని పాతాడట
అప్పట్లో అతడు బండల మద్య మొక్కలుపాతి నీళ్ళు పోస్తుంటే అందరూ అతడిని పనీ పాటా లేనట్టుంది అందుకే పిచ్చి పనులు చేస్తున్నాడు వీడో మేడ్ ధామస్ అనే వారట.

రాధిక said...

నేను చూసిన కొడై ఏనా ఇది అనిపిస్తుంది ఫొటోలు చూస్తుంటే.నా కళ్ళకన్నా మీ కెమెరా అందంగా చూపెడుతుంది ఆ ఊరుని.

Unknown said...

చక్కటి ఫోటోలతో సహా అందించినందుకు నెనర్లు. నేను భారతదేశములో ఇల్లు గట్రా కట్టుకుంటే కొడైకెనాల్లో కట్టుకోవాలని గట్టిగా నిశ్చయించేసుకున్నాను..నాకు అంతగా నచ్చిందా ఊరు. తరవాతి టపాలకోసం వేయిచూస్తుంటాను.

మేధ said...

చాలా బావుందండీ, కొడైకెనాల్ ట్రిప్.. అసలు ఇంత అందంగా ఎలా తీస్తున్నారు మీరు ఫొటోలని..?!
విశ్వనాధ్ గారు చెప్పిన థామస్ గురించి నేను కూడా చదివాను.. (అయితే ఆయన పేరు మాత్రం నాకు గుర్తు లేదు)

ramya said...

.కొడై అందాలన్నీ ఫొటోల్లో బంధించేసారు.అద్బుతంగా వున్నాయి.

విహారి(KBL) said...

అందరికి నెనెర్లండి.