Monday, May 3, 2010

యాభై వసంతాల ‘పెళ్లి కానుక’

29-4-1960 విడుదలయిన పెళ్లికానుక యాభైఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా...



తొలి తెలుగు టాకీ రూపొందించిన 1931లోనే జన్మించారు దర్శకులు సి.వి.శ్రీధర్. మొదట నాటక రచయితగా పేరుపొంది, తమిళ చిత్రం ‘రక్తపాశం’ ద్వారా రచయితగా సినీ రంగంలో ప్రవేశించారు. ఆయన ప్రతిభను గుర్తించిన అన్నపూర్ణా పిక్చర్స్ అధినేతలు అక్కినేని, దుక్కిపాటి మధుసూధనరావు వారి ‘తోడికోడళ్ళు’ తమిళ వెర్షన్ ‘ఎంగల్ వీట్టు మహాలక్ష్మీ’లో మాటల రచయితగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. శ్రీధర్ తొలిసారి స్వయంగా కధ, స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించింది ‘‘కల్యాణ పరిసు’’ అనే తమిళ చిత్రానికి. ఈ తమిళ చిత్రంలో హీరోగా జెమినీ గణేశన్, అతిథిపాత్రలో అక్కినేని నటించగా, తెలుగులో పెళ్లికానుక పేరుతో తీస్తే దాంట్లో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు, అతిథి పాత్రలో జగ్గయ్య నటించారు. దీని హిందీ వెర్షన్ ‘నజరానా’లో హీరోగా రాజ్‌కపూర్, అతిథి పాత్రలో జెమినీ గణేశన్ పోషించారు. మూడు భాషల్లోనూ ఈ చిత్రం విజయ దుందుభి మ్రోగించి, దర్శకునిగా శ్రీధర్‌ను అందలమెక్కించింది.

కథాంశం: మాలతికి గీత, వాసంతి ఇద్దరు కూతుళ్ళు. తండ్రిలేని సంసారం, గీత కుట్టుమిషన్ ద్వారా కుటుంబాన్ని పోషిస్తూ, చెల్లెలు వాసంతిని బి.ఎ చదివిస్తుంటుంది. భాస్కర్, వాసంతి కాలేజీలో సహాధ్యాయులు. కాలేజీ ఆటలపోటీలనుంచి వాసంతి ప్రేమలో పడ్డ భాస్కర్ వ్రాసుకున్న ప్రేమలేఖ బయపడడంతో ప్రిన్సిపాల్ అతన్ని కాలేజీ నుంచి, హాస్టల్ నుంచి సస్పెండ్ చేసారు. స్నేహితుడి సాయంతో ఉద్యోగం సంపాదించి, వాసంతి వాళ్లింటి మేడపైన రూమ్‌లో అద్దెకు దిగుతాడు. వాసంతి, భాస్కర్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ సంగతి తెలియని గీత, భాస్కర్‌ను ప్రేమిస్తుంది. అక్కపట్లగల ప్రేమ, కృతజ్ఞతల కారణంగా వాసంతి తన ప్రేమను త్యాగంచేసి, భాస్కర్‌ను ఒప్పించి గీత, భాస్కర్‌ల పెళ్లి జరిపిస్తుంది. తల్లి మరణించటంతో అక్క ఇంటికి చేరిన వాసంతి ప్రవర్తనను అర్థం చేసుకోక గీత, భాస్కర్‌ను, వాసంతిని అనుమానిస్తుంది, అవమానిస్తుంది. దానివల్ల వాసంతి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. భర్తద్వారా నిజం తెలుసుకున్న గీత పశ్చాతాపంతో తన బాబుకు వాసంతి తల్లిని చేయమని భర్తను కోరి మరణిస్తుంది. వాసంతి ఇంటినుంచి వెళుతూ, ఓ యాక్సిడెంట్‌ద్వారా తనను ప్రేమించిన రఘు ఇంటికి చేరుతుంది. అతని తండ్రి కోరికపై రఘును పెండ్లాడడానికి అంగీకరిస్తుంది. స్నేహితుడు సత్యంద్వారా విషయం తెలుసుకున్న భాస్కర్ పెళ్లికి వచ్చి ఓ ఉత్తరం ద్వారా తన బాబును గీత కోరిక ప్రకారం ‘పెళ్లికానుక’గా అందజేసి శూన్యంలోకి వెళ్లిపోతాడు.

హాస్యకథ: భాస్కర్ స్నేహితుడు సత్యం (రేలంగి), అతని భార్య కాంతం (గిరిజ), ఓ జంట. ఉద్యోగం ఉన్నట్టు అబద్దాలాడి పెళ్లి చేసుకొని, నిజం బయట పడ్డాక, కవి గంఢబేరుండం అని డాంబికాలు పలికి, అదీ అబద్ధం అని తేలాక బుద్ధి తెచ్చుకుని భార్యా, బిడ్డతో సహా సంచార టీ ఉద్యోగిగా పనిచేస్తూ ‘కధ చివరి మలుపు’కు సాయం పడతాడు.

సంగీత, సాహిత్యాలు:
మిస్సమ్మ, విప్రనారాయణ, ప్రేమలేఖలు, శోభ చిత్రాలద్వారా గాయకుడుగా పేరుపొందిన ఎ.ఎం.రాజా, ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహంచి ఈ చిత్రంలోని వైవిధ్య గీతాలను కూడా ఆలపించారు. వారి శ్రీమతి జిక్కి మాత్రం ఒక్కపాట ‘‘పులకించని మది పులకించు’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగిలిన పాటలను పి.సుశీల, ఎస్.జానకి పాడారు. ఈ చిత్రానికి ఆత్రేయ ‘తన మార్కు’ సంభాషణలు కూర్చారు. సముద్రాల సీనియర్, ఆత్రేయ, ఆరుద్ర, చెరువు ఆంజనేయశాస్ర్తీ, తమ సాహిత్యంతో మరుపురాని, మధురమైన పాటల పందిళ్ళు వేశారు. ప్రతి దీపావళికి వినిపించే ఆడే పాడే పసివాడా హ్యాపిసాంగ్ ఆత్రేయ రాయగా, విషాద గీతం ‘ఆడేపాడే పసివాడా’, ‘అమ్మలేని నినుచూడ’ గీతాన్ని చెరువు ఆంజనేయశాస్ర్తీ రాసారు. ప్రేమ భావాన్ని చూపులతోనే ఒలికిస్తూ, హృదయాలను కొల్లగొట్టే భాస్కర్(అక్కినేని)గా కళ్లతోనే బదులు పలికే అందాల హీరోయిన్ వాసంతి (బి.సరోజాదేవి)గా ముద్దు, ముద్దుమాటలు, వౌనంగా భాస్కర్‌ను ఆరాధించిన గీత (కృష్ణకుమారి), తమ అభినయంతో, ఈ ముక్కోణపు ప్రేమకధను రక్తికట్టించారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు దర్శకుని ప్రతిభకు పట్టం కడుతూ అత్యంత సహజంగా చిత్రీకరింపబడ్డాయి.

దర్శకత్వ మెరుపులు: దర్శకునిగా శ్రీధర్ సింబాలిక్ షాట్స్ ఉపయోగించిన సన్నివేశాలు మొదట భాస్కర్, వాసంతి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉదయించి, యుగళగీతం పాడబోయమేముందు వార్దిదరి సైకిళ్ల చక్రాలు ఒక్కవేపునకు తిరగటం, గీత, భాస్కర్‌ను ప్రేమించిందని తెలియగానే వాసంతి మనసులో ప్రేమా, కృతజ్ఞత ఈ రెండు విరుద్ధ భావాల సంఘర్షణ త్రాసులో చూపటం, ఒకవైపు ప్రేమ, రెండోవైపు అక్కపట్ల కృతజ్ఞత, చివరకు అక్కవైపు ముల్లు మొగ్గటం. అదేవిధంగా భాస్కర్‌ను తన అక్కతో పెళ్లికి ఒప్పించే సందర్భంలో వారిరువురి ప్రేమ గుర్తుగా భాస్కర్‌వద్ద పెరుగుతున్న కుండీలో మొక్క వాడిపోవటం, భాస్కర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు నిండుగా ఉన్న మందు సీసా, వెనుకనుంచి గీత అతన్ని పైకి తీసి మందులు వేస్తూ సేవచేయటం, కోలుకుంటన్న సందర్భంగా సీసాలో మందు, ఖాళీ అవటం చూపారు. వాసంతితో ఆఫీసు మేనేజర్ రఘు తను ఆమెను ప్రేమిస్తున్నాను, పెళ్లాడమని కోరటం, వాసంతి తనకా ఊహలేదని తిరస్కరిస్తే రఘుచేతిలోని గాజు పేపర్ వెయిట్ గుండ్రంగా తిరిగే అతని చేతికి రావటం, ఈ సన్నివేశాన్ని గ్లాస్ టేబిల్‌పై వాసంతి, రఘుల ప్రతిబింబాలను చూపుతూ చిత్రీకరించారు.
భాస్కర్‌ను పెళ్లికి ఒప్పించే సన్నివేశం, కథాపరంగాను, ఇంచుమించు యధాతథంగా ‘‘మంచి కుటుంబం’’ చిత్రంలో వి.మధుసూదన్‌రావు, నాగేశ్వరరావు, కాంచనలపై చిత్రీకరించారు. పెళ్లి తరువాత భాస్కర్, గీతను ఆదరించే విషయం వాసంతి ఓ ఉత్తరం ద్వారా పరిష్కారం చూపితే ‘మంచి మనసులు’ చిత్రంలో ‘శాంతి’ (సావిత్రి) ఓ పాట ద్వారా మారుస్తారు. ఈ రెండు చిత్రాలకు అనుకోకుండా శ్రీధర్ మార్గ దర్శకులయ్యారు. పెళ్లయిన తరువాత భాస్కర్, గీత రైల్లో వెళుతుండగా ఒంటరిగా మిగిలిన వాసంతిపై ‘తీరెనుగా నేటితోనే తీయనిగాధ’ గీతం చివరలో ఒంటరిగా వెళుతున్న భాస్కర్‌పై ‘రిపీట్’ చేయటంతో కథాపరంగా ఈ పాట ప్రభావం ప్రేక్షకులపై చెరగని ముద్రవేసింది. వాసంతి, గీత చేత పెళ్లి కూతురుగా అలంకరింపబడి, భార్య సీమంతానికై వచ్చిన భాస్కర్‌కు ఎదురయినప్పుడు స్పందించబోయిన అతన్ని కళ్లతోనే వారించి, ఆ తరువాత ‘తన హృదయంలో అతని పట్ల పవిత్ర భావం తప్ప మరేది లేదని తనను చూసి ఎప్పుడు చలించనని’ భాస్కర్‌వద్ద వాగ్ధానం తీసుకునే సన్నివేశంలోనూ, వాసంతి పాత్రను, ఆదర్శవంతమైన, వ్యక్తిత్వంగల మహిళగా తీర్చిదిద్దారు. పదికాలాలపాటు గుర్తుండిపోయే ఉదాత్త కథను, మహోదాత్తంగా చిత్రీకరించిన దర్శకులు శ్రీధర్ చిరస్మరణీయుడు.

1 comment:

కంది శంకరయ్య said...

ఈ చిత్రం మొదటిసారి విడుదల ఐనప్పుడు (1960) నా వయస్సు 10 సంవత్సరాలు. అప్పుడు చూడలేదు. తరువాత ఎప్పుడో రెండవసారో, మూడవసారో వచ్చినప్పుడు చూశాను. నాకు నచ్చిన సినిమాలలో ఇదీ ఒకటి. ముఖ్యంగా ఈ చిత్రం లోని పాటలు అన్నీ నాకు ఎంతో ఇష్టం. మంచి చిత్రాన్ని గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.