Wednesday, June 30, 2010

మూవీ ముచ్చట్లు



బుడిబుడి మాటల పిల్లలకు బుజ్జాయి పాటలు వినిపిస్తే ఆనందపడకుండా ఉంటారా? చక్కని కథలు బొమ్మలతో చెబితే ఆనందంగా తలలూపని బాలలుంటారా? అలాగే అందమైన స్వర్ణయుగంలాంటి అలనాటి సినిమా ముచ్చట్లు చెబుతుంటే ఆలకించని సినిమా ప్రియులుంటారా? ఎందరో మహానుభావులు తెలుగు చలనచిత్ర రంగాన్ని తీర్చిదిద్దారు. వారి అంకితభావం- కళాదృక్పథం ఒక చిత్రాన్ని వారు తీర్చిదిద్దిన తీరు అనన్య సామాన్యం. అప్పట్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాత దర్శకులకు సినిమాపై ఉన్న గౌరవం ప్రేక్షకునికి వారు ఒక కథను దృశ్యపరంగా చూపించడానికి చేసిన కృషిని ఎన్ని విధాలుగా చెప్పుకున్నా తనివితీరదు. అటువంటి ఓ మంచి పనిని స్థిర లక్ష్యంతో చేసిన ఎస్.వి.రామారావు హృదయం నుంచి వెలువడిన సినిమా సంగతులన్నీ భావితరాలకు అందించారు.
అప్పటి చిత్రాలు నిర్మించడానికి ఓ పాటను తయారు చేయడానికి, మాటలు రాయడానికి దృశ్యాన్ని చిత్రీకరించే విధానాన్ని వారు ఎంత భక్తితో చేసేవారో వివరించే ప్రయత్నం చేసారు. చలనచిత్ర రంగంలో వెలువడిన సాహిత్య గుభాళింపులు, ఆ తేనెలను విశే్లషించిన తీరు, ఇంకా చిత్ర ప్రముఖుల జీవనం, వారి కృషిలో ఎంత నిబద్ధతగా ఉన్నారో సచిత్రంగా సమర్పించిన పెద్దబాల శిక్షలా ఈ గ్రంథం ఆకర్షిస్తుంది.
తెలుగు భాషలో ఇప్పటివరకు దాదాపు ఐదువేల చిత్రాలు వచ్చాయని తెలుపుతూ అందులో అనేక విభాగాలుగా విడగొట్టి ఆ చిత్రాలను పరిచయం చేయడానికి ప్రయత్నించిందీ పుస్తకం. సినిమా ప్రక్రియ మొదలుపెట్టిన తొలిరోజులలో అప్పటివరకు ప్రదర్శించి ఆబాలగోపాలాన్ని అలరించిన నాటకరంగంలోని మంచి నాటకాలను చిత్రాలుగా నిర్మించేవారు. నాటకాలలో నటించే నటీనటులను సినిమాలో నటింపచేసేవారు. ఆ కాలంలో రంగస్థల నటులకు, సినిమా నటులకు తేడా ఏంలేదు. అంతా ఒక్కటే కులం, అదే నటకులం అనుకునేవారు. తరువాత వచ్చిన పరిణామాలు ఈ మాటను మార్చివేసాయి. జానపద కథలు ఎక్కువ ప్రచారంలో వున్నకాలంలో ప్రేక్షకులు జానపద చిత్రాలను ఆదరించారు. అలా మన తెలుగులో 175 జానపద చిత్రాలు, 75 డబ్బింగ్ జానపదాలు వచ్చాయి. వీటిలో అందరి పని ఒక ఎత్తయితే కెమెరామెన్ పనితనం ఒక ఎత్తుగా వుండేది. అందుకోసం అప్పట్లో మార్కస్ చారెట్లీ, యస్.యస్.లాల్, హెచ్.యస్.వేణు, రవికాంత్‌నగాయిచ్ వంటి ఛాయాగ్రాహకులకు తెలుగు తెర రుణపడి వుంది. చిరంజీవి జానపదంగా రాబోయిన ‘అబూది-బాగ్దాద్’, బాలకృష్ణ, భానుమతి కాంబినేషన్‌లో మిస్సయిన జానపదాల కథలు వింటే అయ్యో అనిపిస్తుంది. ఇటువంటి ముచ్చట్లు విన్నపుడు అలాగా- అన్న ఆశ్చర్యం ఆ చిత్రాలు రాలేదన్న విచారం కలుగుతుంది.
చారిత్రక చిత్రాల చరిత్రను ఒక విభాగంగా ఈ గ్రంథంలో చూడవచ్చు. చారిత్రక చిత్రాల అవసరం, దాన్ని గుర్తించిన ప్రముఖులు అలాంటి చిత్రాలు తీసి ప్రేక్షకుల కళ్లకు అలనాటి చరిత్రను చూపడానికి తీసుకున్న శ్రమను ఈ పుస్తకంలో చూస్తాం. ముఖ్యంగా ఎన్.టి.రామారావు చారిత్రక చిత్రాలపై పెంచుకున్న మక్కువ ఈ గ్రంథంలో గమనించవచ్చు. పౌరాణిక చిత్రాలు తొలిదశలో వచ్చిన చిత్రాలే మళ్లీ తీసి ప్రేక్షకుల నాడిని పట్టుకున్న దర్శక నిర్మాతల గూర్చి వివరించే ప్రయత్నం చేసారు. పౌరాణిక చిత్రాలంటే కమలాకర కామేశ్వరరావు, రామారావు గుర్తుకు రావడం తెలుగువారి అదృష్టంగా భావించాలి. అలాగే బాలలకోసం చిత్రాలు నిర్మించిన వారిగూర్చి వివరించారు.
శృంగార గీతాల్లో, జాబిలి పాటల్లో తెలుగు పాటల రచయితలు ఎలాంటి భావాలు చెప్పారు? సందర్భోచిత గీతాలు, తెరపై అద్భుతాలు సృష్టించిన దర్శకులు, అభినయంతో ప్రేక్షకులను రంజింపచేసిన మహానటుల గూర్చి వివరించే ప్రయత్నం చేసారు. హాస్యం అచ్చతెలుగులో ఓలలాడించిన హాస్యనటుల గూర్చిన పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసారు. వారి చిత్రాలన్నీ గీసిన శంకర్ అభినందనీయులు. ఎక్కడ ఏ నటుని దర్శకుని కళాకారుని చిత్రం వుండాలో అవన్నీ చేర్చి ముచ్చట్లకు రూపం కల్పించారు. అయితే అక్కడక్కడ ముద్రాక్షసాలు కనిపిస్తాయి. ఉదా- ఎవార్డు, కలైమామిడి, తరువాత పేజిల సెట్టింగ్ చదువరులకు ఇబ్బంది కలిగిస్తుంది. శీర్షికలు కూడా కలగాపులగంగా వుండడంతో సామాన్యునికి ఏది చదవాలో అర్థంకానివిధంగా వున్నాయి. విషయసూచిక కావాలనే పెట్టలేదని రచయిత చెప్పారు. కాని అది ఉంటేనే ఇంత పెద్ద ప్రయత్నాన్ని చదివేవాళ్లు సులభంగా ఆకలింపు చేసుకునే అవకాశం వుండేది. ఏదైనా ఓ మంచి ప్రయత్నం ఈ గ్రంథం. సినీప్రియులకు షడ్రసోపేత విందు భోజనం.

Monday, June 21, 2010

సుందరం.. సమ్మోహనం.. ఎం.ఎస్.రామారావు గానం




మోపర్తి సీతారామారావు అంటే ఎవరో చాలామందికి వెంటనే స్ఫురించకపోవచ్చును. కాని ఎం.ఎస్.రామారావు అనగానే తెలుగు సినిమాల తొలి నేపథ్య గాయకుడుగా సంగీతాభిమానులందరకూ పాత తరం ప్రేక్షకులకూ ఆయన సుపరిచితులు. ఇంకా వివరంగా వ్రాయాలంటే ‘సుందరదాసు’ అనగానే ఆయన యావత్ ఆంధ్రదేశానికీ ప్రసిద్ధులు. ఆయన రచించి, సంగీతం సమకూర్చి గానం చేసిన ‘సుందరకాండ’ గీతాలు యావదాంధ్ర దేశంలోనూ మారుమ్రోగాయి. మారుమ్రోగుతున్నాయి. ఇంకా మారు మ్రోగుతూనే ఉంటాయి. శ్రీమద్ రామాయణంలోని మధురమైన ‘సుందరకాండ’ కథను, తేట తెలుగులో, మృదు మధురమైన శైలిలో ఆయన పాడిన తీరు అపూర్వం, అద్వితీయం. ఈ విధంగా త్రిపాత్రాభినయం చేసిన వారు (రచన, సంగీతం, గానం) ఆయనకు ముందు మరొక గాయకులు లేరనడం అతిశయోక్తి కాదు.
‘సుందరదాసు’ బిరుదాంకితులైన ఎం.ఎస్.రామారావుగారు 3-7-1921 తేదీన గుంటూరు జిల్లా తెనాలి సమీపానగల ‘మోపర్రు’ గ్రామంలో జన్మించారు. ఊరిపేరే ఇంటిపేరుకూడా అయ్యింది. 1941వ సంవత్సరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గాయకుడిగా స్థిరపడాలనే ఆశతో, మదరాసు వెళ్లారు. అప్పుడు తెలుగు చిత్రాలు తీయటంలో వాహినీ సంస్థ అగ్రగామిగా ఉండేది. వాహినీ సంస్థవారి ఆస్థాన కథా రచయిత సముద్రాల రాఘవాచార్య గారి సహకారంవల్ల, 1942 సంవత్సరంలో బి.ఎన్.రెడ్డిగారి నిర్మాణ, దర్శకత్వంలో వెలువడిన వాహినీ వారి ‘దేవత’ చిత్రంలో మొట్టమొదటిసారిగా ఒక నేపథ్య గీతం పాడారు. ‘‘ఈ వసంతమూ నిత్యము కాదోయ్’’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ (నేపథ్య గీతం) పాడి, తెలుగు చలనచిత్ర తొలి నేపథ్య గాయకుడుగా ప్రసిద్ధి కెక్కారు. ఆ తరువాత ‘చెంచులక్ష్మీ’ (1943), ‘తహసీల్దార్’ (1944) మొదలైన చిత్రాలలో ఆ చిత్ర కథా నాయకుడూ, నాటి ప్రముఖ హీరో అయిన సిహెచ్. నారాయణరావు గారికి ప్లేబాక్ పాటలు పాడారు. ‘తహసీల్దార్’ చిత్రంతో పడవ నడిపేవాడుగా, తానే ఆ పాత్ర ధరించి పాడిన పాట (నండూరి సుబ్బారావు గారు రచించిన ‘ఎంకిపాట’) ‘ఈ రేయి నన్నోల నేరవా రాజా’ అన్న పాట ఎం.ఎస్. రామారావు గారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. లోగడ ఎం.ఎస్.రామారావు గారి గురించి చాలామంది వ్రాసిన వ్యాసాలలో ‘ఈ రేయినన్నోల్ల’ అన్నదే వారి మొట్టమొదటిపాట అని వ్రాశారు. కాని అది పొరపాటు. ‘దేవత’ (1942)లోని ‘ఈ వసంతమూ నిత్యము కాదోయ్’ అన్నదే వారి తొలిపాట. ఆ తరువాత రామారావుగారు ఎన్నో యుగళ గీతాలూ, విషాద గీతాలు పాడారు. అప్పటి ప్రముఖ హీరో సిహెచ్.నారాయణరావు గారు నటించిన అన్ని చిత్రాలలో నారాయణరావుగాకి, ఎంఎస్ రామారావుగారే తన వాయిస్ ఇచ్చి పాడారు. ‘తసీల్దార్’, ‘చెంచులక్ష్మీ’, ‘మనదేశం’, ‘లక్ష్మమ్మ’, ‘పేరంటాలు’, ‘మొదటిరాత్రి’, ‘మానవతి’ వంటి అనేక చిత్రాలలో నారాయణరావు గారికి రామారావు గారు పాడిన పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. ‘మనదేశం’లో కథానాయిక కృష్ణవేణి గారితో కలిసి, రామారావుగారు నారాయణరావు గారికి పాడిన యుగళగీతం ‘ఏమిటీ ఈ సంబంధం - ఎందుకో ఈ అనుబంధం’ తెలుగు సినిమా యుగళ గీతాలలో, మొదట్టమొదటి 10 స్థానాలలో నిలిచే యుగళగీతాలలో ఒకటి అని ప్రఖ్యాత సినీ సంగీత విశే్లషకులు వి.ఎ.కె.రంగారావుగారు పేర్కొన్నారు. ఇది అక్షరాల నిజం.
ఇవిగాక విషాద గీతాలూ, నేపథ్య గీతాలూ ఆలపించటంలో ఎం.ఎస్.గారు బహుదిట్ట. ‘పోరా బాబూ పో’ (దీక్ష), ‘శోకపు తుపాను చెలరేగిందా’ (పిచ్చిపుల్లయ్య), ‘జీవిత మింతేరా మానవ జీవితమింతేరా’ (జయసింహ), ‘బ్రతుకిదేనా సంఘమునా’ (పరదేశి), ‘కనీసం ప్రతి మనిషికీ కూడు గుడ్డ నీదైనా ఉండాలా (మేరికం) వంటి పాటలు, ఆయన పాడిన పాటలతో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. క్రమేపీ తెలుగు చలనచిత్ర సంగీతంలో వచ్చిన మార్పుల వలనా, హీరోగా సిహెచ్.నారాయణరావు వెనుకబడటంవలనా, గాయకుడుగా ఘంటసాల గారు అప్రతిహతంగా ఎదగడంవలనా, ఎంఎస్ రామారావు గారికి అవకాశాలు సన్నగిల్లాయి. అయినప్పటికీ ఎంఎస్‌గారిని అభిమానించే ఎన్.టి. రామారావుగారు, తను నిర్మించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో కొన్ని అపురూపమైన శ్లోకాలు పాడించారు. ఆ రామారావుగారు (ఎన్.టి.), ఈ రామారావుగారిని (ఎంఎస్) ప్రత్యేకంగా పిలిపించుకుని ‘సీతారామ కల్యాణం’ చిత్రంలో కొన్ని మధురమైన శ్లోకాలు, పరశురాముడు పాత్రధారి శర్మగారికి ఒక దండకం పాడించారు. ఇవన్నీ చిరస్మరణీయాలే. ఆ తరువాత ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ (1975) చిత్రంలో అంగదుని పాత్రధారికి ఒక చక్కని మధురమైన శ్రీరామస్తోత్రం పాడారు.
సినిమాలలో అవకాశాలు తగ్గిన తరువాత ఆయన దృష్టి ఆధ్యాత్మికతవైపు మళ్లింది. మదరాసు నుండి రాజమండ్రి వెళ్లి అక్కడ ఒక గురుకుల పాఠశాల స్థాపించి ఆంజనేయస్వామి వారి మీద అచంచల భక్తితో ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ వచ్చారు.
ఆ సమయంలోనే సాక్షాత్తూ ఆంజనేయస్వామి వారే వీరికి కలలో సాక్షాత్కరించి ‘సుందరకాండ’ను గానం చేయమని ఆదేశించినట్టు చెబుతారు. ఈ విధంగా ‘హనుమత్ సాక్షాత్కారం’ పొందిన మహానుభావులు ఎం.ఎస్.రామారావు గారు. శ్రీరాముని ఆదేశంతో బమ్మెరపోతన ఏ విధంగా భాగవతమును ఆంధ్రీకరించారో, అలాగే హనుమతుని ఆదేశంతో, ఆయన నాయకుడైన సుందరకాండను, తేట తెలుగులో రచించి, సంగీతం అందించి తన మృదుమధుర కంఠస్వరంతో గానం చేశారు. ‘శ్రీ హనుమాను గురుదేవులు నాయెడ పలికిన సీతారామ కథా, నే పలికెద సీతారామ కథా’ అనే మకుటంతో వీరు పాడిన ‘సందరకాండ’ అశేష తెలుగు ప్రజానీకానికి ఒక పెన్నిధి వంటిది. ఇప్పటివరకూ అనేకసార్లు రేడియోలోనూ, టీవీలలోనూ, ఆంధ్ర దేశమంతటా మారు మ్రోగింది. ప్రతీ తెలుగువాడి ఇంట్లోనూ ఎప్పుడో ఒకప్పుడు, వినిపిస్తూనే వుంటుంది. అంతేగాక తులసీదాసుగారి హనుమాన్ చాలీసానుకూడా తేట తెలుగులో అనువదించి గానం చేశారు. ఈ రెండూ తెలుగువారికి తరిగిపోని నిధి నిక్షేపాలు.
ఈ మహానుభావుని ప్రతిభను గుర్తించి, తెలుగు గానాభిమానులు 7-4-1977 తేదీన వీరికి ఘనసన్మానం చేసి ‘సుందర దాసు’ అని బిరుదును ప్రదానం చేశారు.
ఈ మధుర గాయక భక్త శిఖామణులు 20-4-1992 తేదీన హైదరాబాద్‌లో పరమ పదించారు. ఎం.ఎస్.రామారావుగారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చును. రామారావు, ఘంటసాల వంటి అమరగాయకులకు మరణం లేదు. వీరు పాడిన సినిమా పాటలూ, ముఖ్యంగా సుందరకాండ తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆంజనేయస్వామి వారు చిరంజీవులు. అలాగే ఎం.ఎస్.రామారావుగారి పాటలూ, వారి సుందరకాండ కూడా చిరంజీవులే.

ఆయన గానం చేసిన హనుమాన్ చాలీసా ఈ కింద వినండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Friday, June 11, 2010

తెలుగు సినిమాకు ‘శుభప్రదం’

పాశ్చాత్యసంగీతపు పెనుతుపానుకు రెపరెపలాడుతున్న శాస్ర్తియసంగీతాన్ని కాపాడ్డానికి చేతులడ్డుపెట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.ఇంచుమించు ఇవే మాటలు చెపుతాడు శంకరాభరణం చిత్రం క్లయిమాక్స్ సన్నివేశంలో శంకరశాస్త్రి పాత్రధారి.ఇప్పుడు కళాతపస్వి విశ్వనాధ్ అదే పనిచేస్తున్నారనిపిస్తుంది..
ఎనభై సంవత్సరాల వయస్సు శరీరానికి. దాదాపు యాభై అయిదేళ్ల్ల అనుభవంలో..దగ్గరదగ్గర యాభై అయదు సినిమాలు.. వచ్చిన తరుణంలో,మళ్లీ మరోసారి మెగాఫోన్ పట్టుకుని కెమేరా వెనక్కు రావడం... ఇంకోసారి కట్..ఓకె. చెప్పేందుకు మాత్రం కాదు..తెలుగుసినిమా ప్రేక్షకులకు మరోసారి ఓ మంచి ‘తెలుగుసినిమా’ చూపించేందుకు..
మరోసారి కళాతపస్వి ఓపిక తెచ్చుకుని తనదైన బాణీలో అందిస్తున్న సినిమా ‘శుభప్రదం’.

విశ్వనాధ్ చాలా సినిమాల్లో అవకాశం దొరికినపుడల్లా, తెలుగుసినిమా పోకడలపై చిన్న చిన్న సెటైర్లు వేస్తుంటారు. అవి చిన్నవైనా చీమమిర్చిలా చురుక్కుమంటుటాయ.‘మలేరియా వ్యాధిగ్రస్తుడి మూలుగుల్లాంటి సంగీతం..కాటెయ్యనా, వాటెయ్యనా లాంటి సంగీతమూ..వస్తున్నాయని, గతంలోని ఓ చిత్రంలో చాన్నాళ్ల క్రితం చురక వేసారు. అవి అక్షరాలా నిజమైకూర్చున్నాయి ఇప్పుడు. హీరో ‘నీయమ్మ’ అనకుండా, హీరోయిన్ ‘నీయబ్బ’ అనడం ఫ్యాషనైపోయింది.
ఇలాంటి సమయంలో విశ్వనాధ్ సినిమా రావడం అంటే నిజంగా తెలుగుసినిమాకు శుభప్రదమే.
కానీ మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా విశ్వనాధ్ సినిమా వుంటుందా? స్వరాభిషేకం చిత్రం జనానికి అంతగా పట్టలేదన్నది చేదువాస్తవం. మరోపక్క అల్లరి నరేష్‌ను కేవలం కామెడీ చిత్రాల్లోనే జనాలు చూస్తున్నారన్నది మరో నిజం. కాస్త ట్రాక్ పక్కకు తప్పిద్దామని నరేష్ తండ్రి ఈవీవీ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పైగా విశ్వనాధ్ సినిమాల్లో కామెడీ అక్కడక్కడ చటుక్కున మెరిసి, చురుక్కుమనిపిస్తుంది. చిన్న సన్నివేశాలైనా ఎన్నాళ్లైనా గుర్తుండిపోతాయి. అంతేకానీ ఔట్ అండ్ ఔట్ కామెడీ వుండదు. వీటన్నింటి నేపథ్యంలో విశ్వనాధ్ ‘శుభప్రదం’జయప్రదంగా ప్రేక్షకులకు రీచ్ అవుతుందా?

అవుతుందనే భావిస్తున్నారు..సినిమా నిర్మాతలు. ‘సినిమాలో నరేష్ కనిపించినపుడల్లా..అది ఔట్ అండ్ ఔట్ కామెడీనే..కానీ నేపధ్యమంతా విశ్వనాధ్ విశ్వరూపమే’ అన్నది వారి మాట.. నరేష్ కామెడీ హీరో ఇమేజ్‌ను ఏమాత్రం విస్మరించలేదని, పైగా కథ పూర్తిగా అందుకు తగినదేనని వారి ఫీలింగ్.
అసలు కథలో హీరో పాత్రే నరేష్‌కు సూటైన పాత్ర. అచ్చంగా బద్ధకిష్టి..కష్టపడడానికి పెద్దగా ఇష్టపడనివాడు. ఇలా అనగానే విశ్వనాధ్ ‘శుభోదయం’లోని చంద్రమోహన్ పాత్ర..అది చేసే విన్యాసాలు గుర్తుకువస్తాయి. ‘..కావచ్చు..ఆ పాత్ర ఛాయలైతే వుండొచ్చు కానీ..ఇది పూర్తిగా భిన్నమైన పాత్ర..పైగా సినిమాటిక్ ఛాయలు వుండవు..పుట్టిన బుద్ధి..అన్న సామెతలా, అలాగే సాగిపోయే క్యారెక్టర్’ అంటున్నాయి యూనిట్ వర్గాలు.నిజానికి ఇలాంటి క్యారెక్టర్ మరో డైరక్టర్ ఎవరైనా అయతే సినిమా చివరకు వచ్చేసరికి పరివర్తన చెందుతుంది. కానీ విశ్వనాధ్ చిత్రం స్టయల్ వేరు కదా..ఎలాంటి క్యారెక్టర్ అలాగే నడుస్తుంది తప్ప సినిమాటిక్ వ్యవహారాలుండవు.

ఇంతవరకు కథ గురించి విశ్వనాధే కాదు ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. కానీ తెలుస్తున్న మేరకు ఈజీగోయింగ్‌ను నమ్ముకున్న కుర్రాడు అనుకోకుండా ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం, ఆమె తండ్రి పెళ్లికి నిరాకరించడం, ఆఖరికి మెత్తబడి అంగీకరించడం, వారి కాపురం సాగిన వైనం..ఇందులో శరత్‌బాబులాంటి పెద్దమనిషి పాత్ర జోక్యం..కేరళ నుంచి విజయనగరం వరకు షూటింగ్ జరిపినది ఇదే.
సరే కథ, కథనాలు అలా వుంచితే, ఎనభై ఏళ్ల వయసులో విశ్వనాధ్ షూటింగ్ ఎలా జరపగలిగారు?
ఆయనకు వయస్సు ఎంతమాత్రం అడ్డంకి కాలేదట. ఇప్పటి యువదర్శకుల మాదిరిగానే 56 రోజుల్లో సినిమా పూర్తిచేయగలిగారట. అదీ ఎండలు మండుతున్న కాలంలో. పక్కాగా స్క్రిప్ట్‌తో, తనదైన చిత్రీకరణతో విశ్వనాధ్ సినిమాను అనుకున్న సమయంలో కచ్చితంగా ముగించగలగడం చెప్పుకోదగ్గ విషయమే. నిర్మాతలకు కావాల్సింది కూడా అదే కదా.
అందమైన అమ్మాయి
విశ్వనాధ్ సినిమా అంటే అందమైన చిత్రం. అందునా అందులో అందమైన అమ్మాయి..అది జయప్రదైనా, సుమలతైనా, మీనాక్షిశేషాద్రి అయినా ఆఖరికి తాళ్లూరి రామేశ్వరి అయినా. మరి ఇప్పుడు ఈ సినిమాలో. మంజరీ ఫడ్నీస్. ఆ ఉత్తరాది అమ్మాయి, ఇప్పుడు అచ్చమైన విశ్వనాధ్ హీరోయిన్లా మారిపోయింది. చూస్తున్నవారు కళ్లు తిప్పుకోలేనంత తెలుగుదనం. మీనాక్షిశేషాద్రి..జయప్రద కలిసినంత అందం. నిజంగా సరైన హీరోయిన్ దొరికిందని సంబరపడుతున్నారు షూటింగ్ స్టిల్స్ చూసినవారంతా. అచ్చమైన తెలుగుదనంతో కూడిన మేకప్‌తో మంజరి కాస్తా పక్కింటి అమ్మాయలా మారిపోయంది.

మణిశర్మ సంగీతం

విశ్వనాధ్ సినిమాకు సంగీతానికి వున్న బంధం గురించి సినీ అభిమానులకు విడమర్చి చెప్పడం అంటే డిగ్రీ పూర్తిచేసిన వాడికి ఎబిసీడీల గురించి వివరించినట్లే. ఆదుర్తి దగ్గర అసిస్టెంట్‌గా వున్నప్పటి నుంచే మామ మహదేవన్‌తో బంధం ఏర్పడింది. ఆదుర్తి-మహదేవన్‌ల బంధంలాగే విశ్వనాధ్-మామ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు సినిమాను సుసంపన్నం చేసాయ. ఆ బంధం మధ్యమధ్య కాస్త తప్పినా..దాదాపు పాతిక చిత్రాల సంగీతబంధం. అటువంటి బంధం స్వాతికిరణంతో శాశ్వతంగా వీడిపోయింది. అద్భుతమైన పాటలు పొదిగిన ఆ చిత్రమే అటు మామ-విశ్వనాధ్‌ల బంధానికి, ఇటు మామ సినీ సంగీతానికి ఆఖరుచిత్రం. అప్పటి నుంచీ విశ్వనాధ్ చిత్రానికి ఒక్కొక్కరు మారుతూనే వస్తున్నారు. ఎవరు మారినా పాటల మాధుర్యానికి ఎంతమాత్రం కొరత లేదు. కానీ ఇంతవరకు విశ్వనాధ్ దృష్టి మణిశర్మపై పడలేదు. మంచి విద్వత్ వున్న మణిశర్మకు ఆ ప్రతిభాప్రకర్ష ప్రదర్శించే సరైన అవకాశమూ రాలేదు. ఇప్పుడదే ‘శుభప్రద’మైంది. ఆ కసితో తనేమిటో, విశ్వనాధ్ ఇచ్చిన అవకాశం ఇచ్చిన ఊపు ఏమిటో తెలిసేలా, ఆరుపాటలు స్వరపరిచాడు మణిశర్మ. ‘వౌనమే చెబుతోంది..ఏ మాట నీ మాటున దాగివుందో..’ ‘నీ చూపే కడదాక నాకలిమి..’, ‘బయిలెల్లె బయిలెల్లె పల్లకి’..‘తప్పట్లోయ్ తాళాలోయ్’..ఇవి నాలుగు పాటల పల్లవులు. త్వరలో వచ్చే ఆడియో కోసం విశ్వనాధ్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వీటిని సిరివెనె్నల, అనంత్‌శ్రీరామ్, రామజోగయ్య శాస్ర్తీ రచించారు. విశాఖ ఆకాశవాణిలో పనిచేసే రాంభట్ల తొలిసారి ఓ గీతం రాసారు. అలాగే విశాఖకే చెందిన ఎస్పీబాలు బంధువు ఒకరు కీలకపాత్ర ధరించారు. ఇక బాలు అయితే ఓసారి సినిమాలో అలా తళుక్కున మెరిసారు. విశ్వనాధ్-బాలుల సోదర బంధం జగద్వితమే కదా. ఒకపాటనైనా వేటూరి చేత రాయించాలనుకున్నా కుదరలేదని తెలిసింది. లేకుంటే విశ్వనాధ్ సినిమాతో ఆరంభమై విశ్వనాధ్ సినిమాకే ఆఖరి పాట రాసి వుండేవాడేమో ఆ మహానుభావుడు వేటూరి.

కేరళ టు విజయనగరం వయా అన్నవరం
కథ రీత్యా హీరో నేపథ్యం కేరళలో ప్రారంభమవుతుంది. అందుకే అక్కడ ఎక్కువభాగం షూటింగ్ జరిపారు. కేరళలో చిత్రీకరించిన సన్నివేశాల్లో బాలు పాల్గొన్న సన్నివేశం కూడా వుంది. ఒక పాటల కార్య క్రమంలో బాలు, నరేష్‌ల నడుమ సంభాషణ, జానపద సంగీత ప్రస్తావన, పాట, ఇందులో భాగం. ఇక కథలో కీలకమైన మరో పాత్ర ఇంటి కోసం ఆ నోటా ఈ నోటా విని విజయనగరం సమీపంలోని ఒక ఫార్మ్‌హౌస్‌లో షూటింగ్ జరిపారు. దాదాపు అయిదెకరాల స్థలంలోని రిచ్‌నెస్ వుట్టిపడే ఇల్లు అది. దానికి కొన్ని అదనపు సొగసులు అమర్చి షూటింగ్ జరిపారు. ఈ నడుమ అన్నవరం కొండ కింద పంపా రిజర్వాయిర్ పక్కన పదిహేనులక్షల వ్యయంతో హీరో ఇంటి కోసం చక్కటి సెట్ వేసారు. ఇటు దేవుడి కొండ, అటు నిండుగా నీరున్న పంపా రిజర్వాయర్, నడుమ చక్కటి ఇల్లు. విశ్వనాధ్ శంకరాభరణం, సూత్రధారుల్లో కొన్ని సన్నివేశాలు అన్నవరంలో షూట్ చేసారు. శంకరాభరణంలో సామజవరగమన ఇక్కడి రిజర్వాయిర్ పక్కన , అలాగే టీటీడీ కళ్యాణమండపం పైన చిత్రీకరించారు. మళ్లీ చాన్నాళ్లకు విశ్వనాధ్ తన సినిమా షూటింగ్ అన్నవరంలో జరపడం మరో విశేషం.
చివరగా మిగిలిపోయన పాట చిత్రీకరణను రామానాయుడు స్టూడియోలో ఈనెల ఫస్ట్ నుంచీ ప్రారంభించి మూడు రోజుల్లో ముగించారు.
ఫైట్లు?
విశ్వనాధ్ సినిమాలో ఫైట్లుంటాయా? మహాఅయతే రెండు పిడిగుద్దులు, అంతవరకే అది జీవితనౌక అయనా, శుభలేఖ అయనా, సిరిసిరిమువ్వ అయనా. కానీ చిన్నబ్బాయ, ఆపద్భాంధవుడు లాంటి స్టార్ సినిమాలు కొంచెం మినహాయంపు. శుభమస్తులో కూడా ఓ బుల్లి ఫైట్ వున్నట్లు వినికిడి. ఎప్పటిలాగే విశ్వనాధ్ సినిమాల్లో కనిపించే తారాగణం శరత్‌బాబు, అనంత్,
ఇక సిరిసిరిమువ్వ నుంచి ప్రారంభమైన (ఆపద్భాంధవుడు, చిన్నబ్బాయి, ప్రెసిడెంట్ పేరమ్మ వదిలేస్తే) స,శ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా పేరూ..శుభప్రదం. సినిమా జయప్రదం అయితే తెలుగుసినిమాకు శుభప్రదం.

Friday, June 4, 2010

సినిమా సెంటిమెంట్స్

చిత్రపరిశ్రమలో సెటిమెంట్లదే అగ్రతాంబూలం. నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు, తారలు తమ సక్సెస్‌కోసం తపిస్తూ సెంటిమెంట్ల వెంబడి నడవడం ఇక్కడ సహజం. వేలనుండి లక్షలవరకు సెంటిమెంట్లపై ఖర్చు చేయడం కూడా కామన్. అయితే సక్సెస్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా లభించాలో అలాగే లభించినా దానిని పొందిన వారు మాత్రం ఆ సక్సెస్‌ని సెంటిమెంట్ ఖాతాలో జమ చేసి సంబరాలు జరుపుకుంటారు. కొన్ని సెంటిమెంట్లు క్రమేపీ అలవాటుగా మారిపోయిన సందర్భాలు కూడా చిత్రపరిశ్రమలో అనేకం వుంటాయి. ఏది ఏమైనా అడుగుతీసి అడుగు వేసే ముందు సెంటిమెంట్‌దే ఇక్కడ హవా అన్నది నిజం.
నిర్మాతల్లో స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడికి తాను తీసే ప్రతి సినిమా రీలునూ తిరుపతి, విజయవాడల్లో పూజ చేయించడం సెంటిమెంట్ (అలవాటు). మోహన్‌బాబు తాను తీసే సినిమాలో ఒక పాటను జేసుదాసుచేత పాడించుకోవడం సెంటిమెంట్. శ్యామ్ ప్రసాద్‌రెడ్డికి కోడి రామకృష్ణను దర్శకునిగా పెట్టుకుంటే పెద్ద సక్సెస్ వస్తుందనే (తలంబ్రాలు నుండి అరుంధతి వరకు ‘ఆగ్రహం’ సినిమాకు తప్ప) ఒక సెంటిమెంట్. భార్గవ్ ఆర్ట్స్‌పై వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం ‘మ’ అనే అక్షరంపై పెట్టుకోవడం నిర్మాత ఎస్.గోపాలరెడ్డికి సెంటిమెంట్. ఇలా నిర్మాతల సెంటిమెంట్ ఇండస్ట్రీలో బోల్డెన్ని వున్నాయి.
టెక్నీషియన్ల విషయానికి వస్తే ఫలానా టెక్నీషియన్‌ని సినిమాకి పెట్టుకుంటే ఎక్కువ సక్సెస్ వస్తుందనే నమ్మకంతో ఇండస్ట్రీలో అనేక కాంబినేషన్స్ రన్ అవుతుంటాయి. ఇలా రన్ అయిన కాంబినేషన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్-విజయభాస్కర్, కోటి-ఇవివి, లోక్‌సింగ్-కోదండరామిరెడ్డి, ఎస్.ఎ.రాజ్‌కుమార్-సూపర్ గుడ్ ఫిలింస్, చక్రి-పూరీ జగన్నాధ్, సీతారామశాస్ర్తీ-త్రివిక్రమ్ శ్రీనివాస్, కోడిరామకృష్ణ-్భర్గవఆర్ట్స్, ఎమ్‌ఎస్ ఆర్ట్స్ ఇలా ఎన్నో సక్సెస్ కాంబినేషన్‌లలో వివిధ టెక్నీషియన్స్ పనిచేసారు, చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా వుండడంవలన కొంతమందికి భారీగా లాభం చేకూరినా కొంతమంది భారీగా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీళ్లనే సినిమా భాషలో ఐరన్‌లెగ్స్‌గా అంటారు పాపం! వీళ్లు కూడా ఒకప్పుడు గోల్డెన్ లెగ్సే కానీ పిరియడ్ (సక్సెస్) ముగియడంతో ఈ అపవాదు మోయాల్సి వస్తుంది.
సినిమాల్లో ఎప్పుడూ సక్సెస్‌కే ప్రాధాన్యత. సక్సెస్ వుంటేనే ఇండస్ట్రీలో పలకరింతలు, పులకరింతలు. సక్సెస్‌లో పనిచేసిన సెంటిమెంట్ ఒక్క ఫ్లాప్‌తో మనుషుల మధ్య అంతరాలను పెంచేస్తుంది. అంటే సక్సెస్సే సెంటిమెంటన్నమాట.
తారల విషయానికి వస్తే వెంకటేష్ తన ప్రతి సినిమాలో మొదటి షాట్‌లో బ్లాక్ డ్రెస్‌లో కనిపించడం సెంటిమెంట్. హీరో సినిమాలో నిద్రలో కలగని లేవడంతో సినిమాకు బద్ధకం పోయి పెద్ద హిట్ కావడం చాలా సినిమాల్లో రుజువైంది (గ్యాంగ్ లీడర్‌లో చిరంజీవి, పెళ్లిసందడిలో శ్రీకాంత్) సినిమా మొదటి సీన్‌లో ‘విధవ’ రూపం కనిపిస్తే అట్టర్‌ప్లాప్ అవుతుందని సెంటిమెంట్. అక్కినేని-వాణిశ్రీ, రామారావు-కృష్ణకుమారి, అక్కినేని-సావిత్రి, అక్కినేని-శ్రీదేవి, రామారావు-జయసుధ, కృష్ణ-విజయనిర్మల, శోభన్‌బాబు-జయసుధ, చిరంజీవి-రాధిక, వెంకటేశ్-సౌందర్య, బాలకృష్ణ-విజయశాంతి సూపర్‌హిట్ కాంబినేషన్స్‌గా వెలిగాయి. ఇదే సెంటిమెంట్‌తో ప్రస్తుత హీరోలు కూడా కాంబినేషన్స్ కోరుకోవడం జరుగుతుంది.
కొంతమంది నిర్మాతలు సెంటిమెంట్‌తో అవసరం లేకపోయినా ఏదో ఒక షాట్‌ని ఫలానా ప్లేస్‌లో తీయాలని, ఫలానా కామెడీ ఆర్టిస్టు వుండాలని నిర్ణయం తీసుకోవడం సెంటిమెంటే. తారలు హెడ్ బ్యాండ్స్, రింగ్స్ ఎక్కువగా రకరకాలవి సెంటిమెంట్‌తో ధరించడం జరుగుతుంది. అవకాశాలు జోరందుకున్నప్పుడే కాదు అవకాశాలు రాకపోడవంతో కూడా తారలు విపరీతమైన సెంటిమెంట్‌గా భావించి పూజలు, హోమాలు, జాతకాలతో కాలం గడిపేస్తారు. కులమతాలకు అతీతంగా సెంటిమెంట్లను పాటించడంలో తారలదే అగ్రస్థానం.
ప్రస్తుతం సెంటిమెంట్ హవాలో బాలకృష్ణ ‘సింహా’ నడుస్తుంది. ఆరేళ్లుగా కనీసం ఏవరేజ్ సినిమాను కూడా తన ఖాతాలో వేసుకోని బాలయ్య అనుకోకుండా భారీ హిట్ కొట్టడంతో బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు ఒక్కసారిగా అవకాశాలు వెల్లువెత్తి బాలకృష్ణను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇదే చిత్ర పరిశ్రమలోని వి‘చిత్రం’. హిట్ వస్తే అవకాశాలు కోకొల్లలు. ఫట్‌వస్తే మొత్తం నిల్‌లు. ఈ విషయంలో అగ్రహీరోలు, అండదండలు వున్న హీరోలు తప్ప చాలామంది కుర్ర హీరోలు కుదేల్ అయిపోయారు.
‘సింహా’ విషయానికొస్తే ఈ మాట తగిలిన సినిమాలన్నీ బాలకృష్ణకు భారీ హిట్స్‌గా మిగలడంతో ఆయనకు సెంటిమెంట్ మరింత రెట్టింపుఅయి రాష్ట్రంలో వున్న లక్ష్మీ నరసింహ ఆలయాల సందర్శన యాత్రకు పురిగొల్పింది. ఇదో కొత్త తరహా సినిమా విజయయాత్రగా చెప్పవచ్చును. అదేవిధంగా బాలకృష్ణ రాబోయే సినిమా పేర్లలోగాని, పాత్ర పేర్లలోగానీ ‘సింహ’ శబ్దం ఎక్కువగా వినిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ‘సింహ’ శబ్దం నందమూరి మూడు తరాలవారికి (ఎన్టీఆర్, బాలయ్య,జూ.ఎన్టీఆర్) హిట్స్‌నివ్వడమే కాదు మిగతా నటులకు కూడా భారీగానే ఉపయోగపడింది. ఎన్టీఆర్‌కు సింహబలుడు, సింహగర్జన, కొండవీటి సింహం, జయసింహ భారీ హిట్స్ ఇస్తే రాజకీయ రంగానికి వచ్చే ముందు సింహం నవ్వింది భారీ ఫ్లాప్‌గా నిలిచి నిరాశపరిచింది. బాలకృష్ణ విషయానికి వస్తే బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, సింహలు భారీ విజయాలను సాదిస్తే సీమసింహం భారీ ఫ్లాప్‌గా నిలిచింది. జూ.ఎన్టీఆర్‌కి సింహాద్రి భారీ హిట్‌గా నిలిచింది.
సూపర్‌స్టార్ కృష్ణకు పల్నాటి సింహం, అడవి సింహాలు హిట్స్‌గా నిలిచాయి. చిరంజీవికి సింహపురి సింహం, కొదమ సింహం భారీ హిట్స్‌గా మిగిలాయి. రజనీకాంత్‌కి సైతం తెలుగులో నరసింహ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సింహాతో వచ్చే టైటిల్ అందరికీ బిగ్గెస్ట్ హిట్స్‌నే ఇచ్చింది. ఆయా సినిమాలు ఆయా సమయాల్లో భారీ వసూళ్లతోనే నిలిచాయి. కాకపోతే ‘సింహ’ శబ్దంతో వచ్చిన టైటిల్స్ ఎక్కువగా బాలకృష్ణకు దక్కడం విశేషం. ఒక్కో నటుడు ఒక్కో తరహా టైటిల్‌కి సరిపోవడం కూడా సెంటిమెంటే. చిరంజీవికి ‘దొంగ’, కృష్ణకు గూఢచారి టైటిల్స్, శోభన్‌బాబుకి లేడీస్ టైటిల్స్, వెంకటేష్‌కి ‘రా’ శబ్దంతో వచ్చే టైటిల్స్, గోపీచంద్‌కి సున్నాతో ముగిసే టైటిల్స్ (రణం, లక్ష్యం, నిజం, శౌర్యం) ఇలా...టైటిల్స్ కూడా హీరోలకు ప్లస్ మైనస్‌లుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఆర్య సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడంతో అదే సినిమా దర్శకుడు అదే హీరోతో నిర్మించిన చిత్రానికి ఇది ఆర్య సినిమాకు సీక్వెల్ కాదని చెబుతునే ఆర్య-2 అని టైటిల్ పెట్టడంతో సినిమా ప్లాప్ లిస్టుకి పోయింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నం ఉడికిందో లేదో ఓ మెతుకు పట్టుకుంటే తెలిసిపోయినట్టు సెంటిమెంట్‌ను పట్టుకుని తెలుసుకోవచ్చన్నది చాలామంది నమ్మకం. అప్పుడప్పుడు ఈ సెంటిమెంట్ అంచనాలు తారుమారు కావచ్చు లేక ఆశ్చర్యపడే అద్భుతాలు సృష్టించవచ్చు. మొత్తానికి ఇక్కడ సెంటిమెంట్‌దే హవా, అగ్రతాంబూలం అన్నది అక్షర సత్యం.