Wednesday, June 30, 2010

మూవీ ముచ్చట్లు



బుడిబుడి మాటల పిల్లలకు బుజ్జాయి పాటలు వినిపిస్తే ఆనందపడకుండా ఉంటారా? చక్కని కథలు బొమ్మలతో చెబితే ఆనందంగా తలలూపని బాలలుంటారా? అలాగే అందమైన స్వర్ణయుగంలాంటి అలనాటి సినిమా ముచ్చట్లు చెబుతుంటే ఆలకించని సినిమా ప్రియులుంటారా? ఎందరో మహానుభావులు తెలుగు చలనచిత్ర రంగాన్ని తీర్చిదిద్దారు. వారి అంకితభావం- కళాదృక్పథం ఒక చిత్రాన్ని వారు తీర్చిదిద్దిన తీరు అనన్య సామాన్యం. అప్పట్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాత దర్శకులకు సినిమాపై ఉన్న గౌరవం ప్రేక్షకునికి వారు ఒక కథను దృశ్యపరంగా చూపించడానికి చేసిన కృషిని ఎన్ని విధాలుగా చెప్పుకున్నా తనివితీరదు. అటువంటి ఓ మంచి పనిని స్థిర లక్ష్యంతో చేసిన ఎస్.వి.రామారావు హృదయం నుంచి వెలువడిన సినిమా సంగతులన్నీ భావితరాలకు అందించారు.
అప్పటి చిత్రాలు నిర్మించడానికి ఓ పాటను తయారు చేయడానికి, మాటలు రాయడానికి దృశ్యాన్ని చిత్రీకరించే విధానాన్ని వారు ఎంత భక్తితో చేసేవారో వివరించే ప్రయత్నం చేసారు. చలనచిత్ర రంగంలో వెలువడిన సాహిత్య గుభాళింపులు, ఆ తేనెలను విశే్లషించిన తీరు, ఇంకా చిత్ర ప్రముఖుల జీవనం, వారి కృషిలో ఎంత నిబద్ధతగా ఉన్నారో సచిత్రంగా సమర్పించిన పెద్దబాల శిక్షలా ఈ గ్రంథం ఆకర్షిస్తుంది.
తెలుగు భాషలో ఇప్పటివరకు దాదాపు ఐదువేల చిత్రాలు వచ్చాయని తెలుపుతూ అందులో అనేక విభాగాలుగా విడగొట్టి ఆ చిత్రాలను పరిచయం చేయడానికి ప్రయత్నించిందీ పుస్తకం. సినిమా ప్రక్రియ మొదలుపెట్టిన తొలిరోజులలో అప్పటివరకు ప్రదర్శించి ఆబాలగోపాలాన్ని అలరించిన నాటకరంగంలోని మంచి నాటకాలను చిత్రాలుగా నిర్మించేవారు. నాటకాలలో నటించే నటీనటులను సినిమాలో నటింపచేసేవారు. ఆ కాలంలో రంగస్థల నటులకు, సినిమా నటులకు తేడా ఏంలేదు. అంతా ఒక్కటే కులం, అదే నటకులం అనుకునేవారు. తరువాత వచ్చిన పరిణామాలు ఈ మాటను మార్చివేసాయి. జానపద కథలు ఎక్కువ ప్రచారంలో వున్నకాలంలో ప్రేక్షకులు జానపద చిత్రాలను ఆదరించారు. అలా మన తెలుగులో 175 జానపద చిత్రాలు, 75 డబ్బింగ్ జానపదాలు వచ్చాయి. వీటిలో అందరి పని ఒక ఎత్తయితే కెమెరామెన్ పనితనం ఒక ఎత్తుగా వుండేది. అందుకోసం అప్పట్లో మార్కస్ చారెట్లీ, యస్.యస్.లాల్, హెచ్.యస్.వేణు, రవికాంత్‌నగాయిచ్ వంటి ఛాయాగ్రాహకులకు తెలుగు తెర రుణపడి వుంది. చిరంజీవి జానపదంగా రాబోయిన ‘అబూది-బాగ్దాద్’, బాలకృష్ణ, భానుమతి కాంబినేషన్‌లో మిస్సయిన జానపదాల కథలు వింటే అయ్యో అనిపిస్తుంది. ఇటువంటి ముచ్చట్లు విన్నపుడు అలాగా- అన్న ఆశ్చర్యం ఆ చిత్రాలు రాలేదన్న విచారం కలుగుతుంది.
చారిత్రక చిత్రాల చరిత్రను ఒక విభాగంగా ఈ గ్రంథంలో చూడవచ్చు. చారిత్రక చిత్రాల అవసరం, దాన్ని గుర్తించిన ప్రముఖులు అలాంటి చిత్రాలు తీసి ప్రేక్షకుల కళ్లకు అలనాటి చరిత్రను చూపడానికి తీసుకున్న శ్రమను ఈ పుస్తకంలో చూస్తాం. ముఖ్యంగా ఎన్.టి.రామారావు చారిత్రక చిత్రాలపై పెంచుకున్న మక్కువ ఈ గ్రంథంలో గమనించవచ్చు. పౌరాణిక చిత్రాలు తొలిదశలో వచ్చిన చిత్రాలే మళ్లీ తీసి ప్రేక్షకుల నాడిని పట్టుకున్న దర్శక నిర్మాతల గూర్చి వివరించే ప్రయత్నం చేసారు. పౌరాణిక చిత్రాలంటే కమలాకర కామేశ్వరరావు, రామారావు గుర్తుకు రావడం తెలుగువారి అదృష్టంగా భావించాలి. అలాగే బాలలకోసం చిత్రాలు నిర్మించిన వారిగూర్చి వివరించారు.
శృంగార గీతాల్లో, జాబిలి పాటల్లో తెలుగు పాటల రచయితలు ఎలాంటి భావాలు చెప్పారు? సందర్భోచిత గీతాలు, తెరపై అద్భుతాలు సృష్టించిన దర్శకులు, అభినయంతో ప్రేక్షకులను రంజింపచేసిన మహానటుల గూర్చి వివరించే ప్రయత్నం చేసారు. హాస్యం అచ్చతెలుగులో ఓలలాడించిన హాస్యనటుల గూర్చిన పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసారు. వారి చిత్రాలన్నీ గీసిన శంకర్ అభినందనీయులు. ఎక్కడ ఏ నటుని దర్శకుని కళాకారుని చిత్రం వుండాలో అవన్నీ చేర్చి ముచ్చట్లకు రూపం కల్పించారు. అయితే అక్కడక్కడ ముద్రాక్షసాలు కనిపిస్తాయి. ఉదా- ఎవార్డు, కలైమామిడి, తరువాత పేజిల సెట్టింగ్ చదువరులకు ఇబ్బంది కలిగిస్తుంది. శీర్షికలు కూడా కలగాపులగంగా వుండడంతో సామాన్యునికి ఏది చదవాలో అర్థంకానివిధంగా వున్నాయి. విషయసూచిక కావాలనే పెట్టలేదని రచయిత చెప్పారు. కాని అది ఉంటేనే ఇంత పెద్ద ప్రయత్నాన్ని చదివేవాళ్లు సులభంగా ఆకలింపు చేసుకునే అవకాశం వుండేది. ఏదైనా ఓ మంచి ప్రయత్నం ఈ గ్రంథం. సినీప్రియులకు షడ్రసోపేత విందు భోజనం.

No comments: