Tuesday, July 6, 2010

50 వసంతాల జగపతి పిక్చర్స్

'జగపతి’ సంస్థకు ఇది స్వర్ణోత్సవ సంవత్సరం (1960-2010).‘జగపతి’ పేరు వినగానే బలమైన కథ, ప్రేక్షకుల్ని కదిలించే సన్నివేశాలు అద్భుతమైన నటన, వీటన్నిటినీ మించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే సంగీతం గుర్తుకువస్తాయి. అందుకే చిత్ర జగతిలో జగపతి సంస్థకు ప్రత్యేక స్థానం. దీని అధినేత వీరమాచినేని రాజేంద్రప్రసాద్. కాకినాడ కాలేజీ రోజుల్లోనే నాటకాల్లో స్త్రీ పాత్రలు పోషించి, హీరో అక్కినేనిని అభిమానించి, మద్రాసు చేరి హీరో వేషాలకోసం ప్రయత్నించి అది ఫలించక మిత్రులు రంగారావుతో కలిసి జగపతి సంస్థను ప్రారంభించి, వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘కుటుంబ కథా చిత్రం ‘అన్నపూర్ణ’ నిర్మించి 3-06-1960న విడుదల చేసారు. అంటే యాభై ఏళ్ల కిందట. ఇక వారి చిత్ర విశేషాలు చూద్దాం.అన్నపూర్ణ: 1959లో ఈ చిత్రానికి స్వీకారం చుట్టారు. వి.మధుసూదననరావు దర్శకులు. సదాశివబ్రహ్మం కథ, ఆరుద్ర పాటలు, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం, కమల్‌ఘోష్ కెమెరా. కొద్దిపాటి సస్పెన్స్‌తో కూడిన కుటుంబ కథా చిత్రం ‘అన్నపూర్ణ’లో టైటిల్ రోల్‌ను జమున పోషించగా హీరోపాత్రను జగ్గయ్య, ఇతర సహాయ పాత్రలను గుమ్మడి, ముక్కామల, సిఎస్‌ఆర్ నిర్వహించగా హాస్య జంటగా రేలంగి, గిరిజ రాణించారు. కథానాయికపై చిత్రీకరించిన ‘తళ తళా మిలమిల’ అనే గీతం, హాస్య జంటపై చిత్రీకరించిన ‘వగలాడి వయ్యారం భలే జోరు’ యుగళ గీతం ‘మనసేమిటో తెలిసిందిలే’ బాగా ప్రాచుర్యం పొందాయి. అన్నపూర్ణ చిత్రం 3-06-1950న విడుదలై ఆర్ధికంగా విజయాన్ని సాధించి, నిర్మాత రాజేంద్రప్రసాద్‌కు ధైర్యాన్నిచ్చింది.

ఆరాధన: జగపతి సంస్థ జైత్రయాత్ర ‘ఆరాధన’తో మొదలైందని చెప్పుకోవాలి. కారణం నిర్మాత రాజేంద్రప్రసాద్ అభిమాన హీరో అక్కినేని నాగేశ్వరరావు ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాక, జగపతి సంస్థ స్థాపించిన చిత్రాల్లో, పదమూడు చిత్రాలకు హీరోగా నటించారు. అలాగే ఆ సంస్థ ఆస్థాన కళాకారులుగా, గుమ్మడి, జగ్గయ్య ఎక్కువ సంఖ్యలో విలక్షణ పాత్రలు పోషించారు. ఆరాధన చిత్రానికి మూలం ఉత్తమకుమార్, సుచిత్రసేన్ నటించిన ‘సాగరిక’ బెంగాలీ చిత్రం. ఆత్రేయ, నార్ల చిరంజీవి, శ్రీశ్రీ రాసిన పాటలకు, సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. క్లిష్టమైన మానసిక సంఘర్షణకు లోనైన ‘అనురాధ’ పాత్రకు ప్రాణంపోసారు సావిత్రి. రమణారెడ్డి, రేలంగి, గిరిజ హాస్యాభిషేకం చేసారు. హీరోపై చిత్రీకరించిన ఘంటసాల పాట, ‘నా హృదయంలో నిదురించే చెలి’ నాయికపై చిత్రీకరించిన ‘నీ చెలిమి నేడే కోరితిని’, ‘వెన్నెలలో వికాసమే’ గీతాలు నేటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే వుంటాయి.

ఆత్మబలం: ఆరాధన తర్వాత భాగస్తుడు రంగారావు మరణించడంతో రాజేంద్రప్రసాద్ సోలో నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆత్మబలం’. దీనికి ‘అతుల్ జహీర్ ఆహ్వాన్’ అనే బెంగాలీ చిత్రం మూలం. ఈ చిత్రంతోనే జగపతి సంస్థలో, గీతరచయితగా ఆత్రేయ, సంగీత దర్శకునిగా కె.వి.మహదేవన్ హవా ప్రారంభమయి ఓ దశాబ్దం పాటు ఆంధ్ర దేశాన్ని కుదిపేసాయి.
జగ్గయ్యది విచిత్రమైన సైకిక్ క్యారెక్టర్. అతన్ని కంట్రోల్ చేసేది హీరో ఆనంద్. ఇద్దరి మధ్యా నలిగిపోయే కథానాయిక బి.సరోజాదేవి. చిత్రంలోని హిట్ సాంగ్స్ ‘చిటపట చినుకులు పడుతు వుంటే’, గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, పరుగులు తీసే నీ వయసునకు) అద్భుతంగా, నేత్రపర్వంగా చిత్రీకరించారు కెమెరామెన్ సి.నాగేశ్వరరావు. హీరో నాగేశ్వరరావు నిబంధనల మేరకు ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం హైదరాబాద్‌లో చిత్రీకరించారు. పద్ధతి ప్రకారం రమణారెడ్డి, రేలంగి, గిరిజ హాస్యాన్ని అందించారు.

అంతస్తులు: ప్రముఖ తమిళ రచయిత జావర్ సీతారామన్ అందించిన కథతో రూపొందిన చిత్రం అంతస్తులు. గుమ్మడి జమిందారు, క్రమశిక్షణకు మారుపేరు. భార్య జి.వరలక్ష్మి, పెద్దకొడుకు నాగేశ్వరరావు, చిన్నకొడుకు నాగరాజు. తండ్రి క్రమశిక్షణ తట్టుకోలేని చిన్న కొడుకు మరణిస్తాడు. అది చూసి జమిందారి బంధనాలనుంచి బయటపడ్డ కథనాయకుడు విలన్ జగ్గయ్య వలలో పడతాడు. తన తండ్రి చేసిన పొరపాటువల్ల అనాధగా బతుకుతున్న భానుమతికి ఆశ్రయం కల్పిస్తాడు. ప్రేమించిన సామాన్యురాలు మాలను వివాహం చేసుకుని మమతలకు, అనురాగాలకు అంతస్తులు అడ్డుకావని నిరూపిస్తాడు. ఆరోజు కుర్రకారును అంటే కాలేజీ స్టూడెంట్స్‌ను, యువతను ఉర్రూత లూపిన యుగళ గీతం ‘తెల్ల చీర కట్టుకున్నదెవరికోసం’, భానుమతిపై చిత్రీకరించిన ‘వినరా విస్సన్న’, ‘దులపర బుల్లోడా’ పాటలు, లాల్ అండ్ హార్డ్లీ తరహాలో రేలంగి, రమణారెడ్డి అందించిన హాస్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ రజిత పతకంతోపాటు రాష్ట్రప్రభుత్వ బంగారు నంది పురస్కారం లభించింది.

ఆస్తిపరులు: సిస్టర్ సెంటిమెంట్‌తో సాగిన ఈ చిత్రంలో జయలలిత అభినయం ఓ ప్రత్యేక ఆకర్షణ. అక్కినేని హీరో, విలన్ జగ్గయ్య ఇద్దరూ అన్నదమ్ములే. అయితే ఆస్తికోసం అన్నను అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో చేసిన కత్తియుద్ధం, క్లయిమాక్స్‌లో అగ్ని జ్వాలల మధ్య దిగుడు బావిలో హీరో చేసిన సాహస విన్యాసం చాలా డైనమిక్‌గా చిత్రీకరించారు దర్శకులు వి.మధుసూదనరావు.

అదృష్టవంతులు: ఈ చిత్రంలో కూడా జయలలిత గ్లామర్‌తోపాటు నటనకు నాట్యానికి అకాశం వున్న కథానాయిక జయ పాత్రను పోషించారు. అయ్యయ్యో బ్రహ్మయ్య పాటతో కొత్త తరహా స్టెప్స్‌కు నాంది పలికారు అక్కినేని. పతాక సన్నివేశం పరుగెత్తే రైలు టాప్‌మీద హీరో చేసిన ఫైట్ ఉత్కంఠ కలిగిస్తాయి. ఈచిత్రంలోని పాటలన్నీ హిట్టయి చిత్ర విజయానికి దోహదం చేసాయి. జగపతి సంస్థ నిర్మించిన తొలిచిత్రం అన్నపూర్ణ దర్శకుడు వి.మధుసూదనరావు, ఆ సంస్థకు అక్కినేనితో పనిచేసిన చివరి చిత్రం ‘అదృష్టవంతులు’.

అక్కాచెల్లెలు: ఎల్.వి.ప్రసాద్‌గారి సోదరుడు, ప్రముఖ ఎడిటర్ ఎ.సంజీవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో షావుకారు జానకి అక్కినేనితో జంటగా నటించి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ పాటతో అదరగొట్టారు. సస్పెన్స్‌తో సాగిన ఈ చిత్రంలో కృష్ణ,విజయనిర్మల రెండవ జంటగా నటించారు.

దసరా బుల్లోడు: నిర్మాత రాజేంద్రప్రసాద్ తాను పుట్టి పెరిగిన పల్లెటూరి వాతావరణం నేపథ్యంగా చేసుకుని ఈ కథను రూపొందించారు. వి.మధుసూదనరావు బిజీగా ఉండడంవల్ల హీరో నాగేశ్వరరావును దర్శకత్వం వహించమని కోరారు నిర్మాత. ఐతే అక్కినేని సున్నితంగా తిరస్కరించి, రాజేంద్రప్రసాద్‌నే దర్శకత్వం వహించమని ప్రోత్సహించారు. వాణిశ్రీ, చంద్రకళ, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, నాగభూషణం, సూర్యకాంతం, అంజలీదేవి, పద్మనాభం వంటి హేమాహేమీలు నటించారు. ఈ ముక్కోణ ప్రేమ కథా చిత్రానికి ఆత్రేయ, కె.వి.మహదేవన్, నృత్యదర్శకుడు హీరాలాల్, కెమెరామెన్ ఎస్.వెంకరత్నం కాంబినేషన్‌లో రూపొందిన పాటలన్నీ ప్రేక్షకులకు కనువిందు చేసాయి. దర్శకునిగా రాజేంద్రప్రసాద్ ప్రతిభకు జేజేలు పలికింది ఆంధ్రప్రేక్షక లోకం.

బంగారుబాబు: అక్కినేని, వాణిశ్రీ కాంబినేషన్‌లో రాజేంద్రప్రసాద్ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్, సినీతార జీవితం నేపథ్యంగా సాగిన ఈ చిత్ర షూటింగ్ సన్నివేశంలో ప్రముఖ నటులు కృష్ణ, సత్యనారాయణ, శివాజీ గణేశన్, రాజేష్‌ఖన్నా అతిథులుగా నటించారు. క్లైమాక్స్‌లో తీసిన హెలికాప్టర్ ఫైట్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శోభన్‌బాబు కథానాయకుడుగా రాజేంద్రప్రసాద్ రూపొందించిన చిత్రాలు ‘మంచిమనుషులు’, ‘పిచ్చి మారాజు’, ‘అందరూ దొంగలే’. అన్నపూర్ణ సంస్థతో కలిసి జగపతి సంస్థ అందించిన చిత్రం ‘రామకృష్ణులు’ ఇందులో ఎన్‌టిఆర్, జయసుధ, అక్కినేని, జయప్రద, సత్యనారాయణ ప్రధాన పాత్రధారులు. నిర్మాత రాజేంద్రప్రసాద్ వారి అబ్బాయి జగపతి బాబును, హీరోగా పరిచయం చేస్తూ వి.మధుసూదనరావు దర్శకత్వంలో తీసిన చిత్రం సింహస్వప్నం అనుకున్న విజయాన్ని సాధించలేదు. ఇంకా లంచావతారం, కిల్లర్, పెళ్లిపీటలు, బంగారు బుల్లోడు వంటి చిత్రాలను అందించారు. తెలుగులో 26, తమిళంలో 3, హిందీలో 3 చిత్రాలను జగపతి సంస్థ నిర్మించింది. వీటిలో రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రాలు 18. వాటిల్లో అధిక శాతం విజయాన్ని చవి చూసినవే. ఐతే మారుతున్న విలువలు, వేగం దృష్ట్యా నిర్మాణ రంగానికి దూరంగా వుంటున్నది జగపతి సంస్థ. ఫిలింనగర్‌లో దేవాలయాల సముదాయానికి రూపకల్పనచేసి చరితార్థుడైనారు రాజేంద్రప్రసాద్. చిత్రరంగానికి నిర్మాతగా, దర్శకునిగా వి.బి.రాజేంద్రప్రసాద్ అందించిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003వ సంవత్సరానికి రఘుపతి వెంకయ్య ప్రతిష్టాత్మక పురస్కారంతో సత్కరించింది.

4 comments:

madhuri said...

Excellent post! Very detailed but interesting.

విహారి(KBL) said...

Thank you so much.

madhuri said...

Vihaari garu, please give a blank mail.

సుభగ said...

మీ బ్లాగును ఇప్పుడే చూడడం తటస్తించింది.
నాకిష్టమైన పాత సినిమాల గురించి చాలా చక్కగా రాస్తున్నారు. ధన్యవాదాలు