Thursday, July 15, 2010

చైతన్యానికి చిరునామా బాలచందర్


ఇతర భాషా చిత్రాల్లో లబ్ద ప్రతిష్టులైన దర్శకులు ఎందరో, తెలుగు చిత్ర పరిశ్రమలోనూ సత్తా చూపారు. అటువంటివారిలో ప్రధముడు కైలాసం బాలచందర్. తమిళ చిత్ర దర్శకుడుగా ఎంత పేరు గడించారో, తెలుగులో కూడా అంత ఘనత సాధించారని చెప్పవచ్చు. కళాతపస్వి విశ్వనాధవారిలా, బాలచందర్ ’స్త్రీ’ పాత్రల ప్రత్యేకతే వేరు. సమాజంలో, కుటుంబంలో అనేక పాత్రలను పోషిస్తూ, సతమతమయ్యే స్త్రీలయొక్క సున్నిత భావోద్వేగాలను, మానసిక సంఘర్షణలను మనం గమనిస్తూ ఉంటాము.

అంతులేని కథ:

మధ్య తరగతి యువతి సరిత (జయప్రద) తన కుటుంబం కోసం, గర్విష్టి, రాక్షసి అనే బిరుదులు ఇంటా బయటా పొందుతుంటుంది. పైకి కఠినంగా ప్రవర్తిస్తూ తన సంపాదనంతా కుటుంబం కోసమే ఖర్చుచేస్తూ చెల్లెలు కోసం తన ప్రేమనుకూడా వదులుకొని పెళ్లికాని ఉద్యోగినిగానే జీవితం గడిపే అమ్మాయి. మన సమాజంలో ఇలాంటివారు కన్పిస్తూనే ఉంటారు. వారందరి ప్రతినిధిగా ఈ పాత్రను మలిచిన తీరు అభినందనీయం. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ‘్ఫటాఫట్’ అంటూ జీవితాన్ని తేలికగా తీసుకొని ఎదురు దెబ్బతిన్న ‘జయలక్ష్మీ’ ఈమె తల్లి ‘జయ విజయ’ ‘తల్లీ కూతుళ్ల మధ్య ఏ పోరయినా ఉండచ్చు కానీ సవితి పోరు ఉండకూడదు’ అంటూ ఆత్మహత్య చేసుకుంటుంది. కారణం కూతురు ప్రియుడుచే వంచింపబడడం, విచ్చలవిడి తనం తెచ్చే ముప్పును సున్నితంగా చూపారు పై పాత్రలచే.

ఆకలి రాజ్యం:

ఈ చిత్రంలో హీరోయిన్ దేవి (శ్రీదేవి). తాగుబోతు తండ్రిని, బామ్మను కష్టపడి నాటకాల్లో వేషాలు వేసి పోషిస్తుంటుంది. డబ్బున్న నాటకాల యజమాని పెళ్లడతానని వెంటాడినా, తిరస్కరిస్తుంది. ‘ఆకలి అంటే నాకు గౌరవం’ అంటూ, ఆత్మగౌరవం, చంపుకోలేని వ్యక్తిత్వంగల రంగా పేదవాడయినా, అతన్ని ప్రేమించి, అతనితో జీవితం పంచుకోటానికి సిద్ధపడుతుంది. డబ్బు కంటె, ప్రేమకు విలువనిచ్చిన వ్యక్తిత్వం ఈమెది.

మరోచరిత్ర:

ప్రేమకధా చరిత్రలో కొత్తమలుపులు సృష్టించారు బాలచందర్ ఈ చిత్రంలో. హీరోయిన్ స్వప్న (సరిత) పెద్దల మాటకు విలువనిచ్చి యేడాది ప్రియునికి దూరంగా గడపటానికి, మనసు కట్టడి చేసికొని ‘తుది గెలుపు ప్రేమకే నని రుజువు చేయాలని తపిస్తుంది. తను పతనం కావటమే కాక ఎదుటివాళ్లనూ తన దారిలోకి మళ్లించాలని చూసే ‘పాప’. భర్తపోవటంతో తనను తాను నియంత్రించుకుని ప్రశాంతగా జీవిస్తున్న ‘మాధవి’. ఆవేశం, తొందరపాటుగల హీరో, ఆమెను చేపట్టబోయినా, అతన్ని సరిదిద్ది ప్రేమికుల్ని కలపాలని కృషిచేసిన ధీర. ఎప్పుడోకాని మాధవి, స్వప్నలు మన కెదురుగారు ఈ సంఘంలో.

గుప్పెడు మనసు:

ఇందులో మూడు పాత్రలు, విద్య (సుజాత), సెన్సార్ ఆఫీసర్, రచయిత్రి. సరిత (బేబీ). సరిత తల్లి శ్రీమతి (కాకినాడ శ్యామల). శ్రీమతి ఒకప్పటి మాజీ నటీమణి, అనుకోకుండా ఆమెకు ఒక చిత్రంలో నటించే అవకాశం రావటం, దానికోసం ఆమె పడే ఎగ్జయిట్‌మెంట్, ఉదయం లేవాలని అలారం పెట్టుకుని శాశ్వత నిద్రలోకి జారుతుంది. ‘స్త్రీ’ భావోద్వేగాల స్థాయి తెలిపే సన్నివేశం అత్యంత సహజంగా చిత్రీకరించారు దర్శకులు బేబీ (సరిత) అంకుల్ శరత్‌బాబు ఇంటిలో ఓ బలహీన క్షణంలో తప్పుచేసి ఆ ఇంటినుంచి వెళ్లిపోయి బిడ్డను కని స్వతంత్రంగా జీవిస్తూ ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగిస్తుంది. విద్య సెన్సార్ ఆఫీసరుగా ఏ పాయింట్‌ను ఒప్పుకోనని ఇంటికి వస్తుందో, ఇంటివద్ద అదే సంఘటన ఎదురు కావటంతో తన అభ్యంతరాన్ని ఉపసంహరించుకున్నట్టు ఫోనుచేస్తుంది. ఆదర్శవంతమైన రచయిత్రి, సామాన్య గృహిణి ఈ రెండు స్వభావాల వైవిధ్యాలను తన నటనతో సుజాత, చిత్రీకరణలో దర్శకులు అద్భుతంగా ఆవిష్కరించారు.

ఇది కథకాదు:

మానసిక, శారీరక హింసలు పెట్టే శాడిస్టు భర్త (చిరంజీవి) నుంచి విడాకులు పొంది బిడ్డతో బయటకు వస్తుంది సుహాసిని (జయసుధ). అక్కడ ఆమెకు తన మాజీ ప్రియుడు భరణి (శరత్‌బాబు)ని కలుసుకుంటుంది. అతన్ని భర్తగా పొందాలని ఆశ, ఆకాంక్ష, కట్టుబాట్లను ఎదిరించాలని కోరిక ఉన్నా, భర్త కట్టిన తాళిని గుండెలపై నుంచి తీయలేక క్రొత్త జీవితాన్ని స్వాగతించలేని పిరికితనం. ఈ పాత్రలోని వైవిధ్యం, చిత్రీకరణలోను, జయసుధ నటనతోను పరాకాష్ట చేరుకుంది. ఆఫీసులో ఆమెను మూగగా ఆరాధిస్తున్న ‘జానీ’. మనసు తెలిసినా, భర్తకు, ప్రియునికే ఆమె ప్రాధాన్యాన్నిస్తుంది. ఒక్క చుక్క కన్నీరు ఆమె కంటినుంచి తెప్పించాలని చివరి వరకూ ప్రయత్నించిన ఆమె భర్త, ఆమె కెంతో ఇష్టమయిన మోనాలిసా చిత్రాన్ని కత్తితో గాయపరిచినా చలించని ధీర యువతి. కొడుకు చేసిన తప్పకు కోడలికి, మనవడికి అండగా నిలవటానికి కోడలి గుండెలపై తాళితీసి దేవుని హుండీలో వేసి, క్రొత్తగా జీవితం మొదలు పెట్టమని ఆశీర్వదించే సుహాసిని అత్తగారి పాత్ర, వయస్సు మళ్లినా ప్రగతిశీల భావంతో రూపొందింది.

సింధుభైరవి:

శాస్ర్తియ సంగీతంలో అద్బుత గాయకుణ్ణి పల్లె పదాలవైపూ నడిపించి, అతని ఆరాధనలో ఆకర్షణలో తన సరస్వం అర్పించిన భైరవి (సుహాసిని). తన ఉనికి అతని భార్య కిష్టం లేదని మొదట దూరమయి, తన విరహంతో అతడు సంగీతానికి దూరమయి, పతనం కావటం భరించలేక, అతని ఉన్నతికి పాటుపడుతుంది. అతనివల్ల పొందిన బిడ్డను ఆ కుటుంబానికి కానుకగా ఇచ్చి అతని జీవితంనుంచి నిష్క్రమిస్తుంది. వయస్సులో తనుచేసిన తప్పుకు ప్రతి రూపంగా ఎదుట నిలిచిన కూతురును ఆదరించలేక తిరస్కరించలేక సతమతమమయ్యే తల్లిగా మణిమాల. సమాజంలో ఇటువంటి వారి జీవితాల, స్వభావాల అంతర్ మధనం తెలియవస్తుంది.

47 రోజులు:

చిత్రంలో ఏమీ చదువులేని యువతిగా, మోసగాడైన భర్తనుంచి, పారిస్‌నుంచి తప్పించుకుని, ఇండియా వచ్చి వంటరిగా జీవితం సాగించిన ధైర్యవంతురాలు ‘జయప్రద’.మన్మధలీల చిత్ర నాయికి ‘హలం’ భర్త అలవాట్లను భరించలేక ఎలా నలిగిపోయింది. చివరకు ఏం నిర్ణయించుకున్నది సరదాగా, హాస్యంగా కొంత చూపారు. చివరలో జయప్రద తన భర్త చేత ‘దట్ ఫెలో’ అనిపించటం ఓ విశేషం.

బాలచందర్ తొలి చిత్రం ‘భలే కోడళ్ళు’లో ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు కోడళ్ళు, పక్కింటి సినిమా తార ప్రభావంతో పడిన కల్లోలం, తరువాత ఎలా చక్కదిద్దుకున్నారో తమ ‘కాపురాలను’ హాస్యంతో రంగరించి చూపారు.

‘బొమ్మ బొరుసు’లోని అహంకారి అత్త, స్వాభిమానంగల కూతురు పాత్రలు ఓ విలక్షణ సృష్టి.
కడుపుకోసం ఒళ్లమ్ముకుని కొడుకు చేతిలో హత్య కావించబడిన యువతి ‘జయమాలిని’, ఉంచుకున్నవాడి గౌరవం కాపాడడానికి హత్యానేరం మీద వేసుకుని జైలుకెళ్లిన ‘దబ్బపండు’ (వై.విజయ). కుండలమ్ముకుంటున్నా అల్లరిగా, మహారాణి కలలు కనే పాపమ్మ (సరిత) రౌడీగా ఉన్నవాడికి, చదువు సంస్కారం నేర్పి రాష్టమంత్రిగా, ఉన్నతునిగా మార్చిన రాణి (జయసుధ) వీరందరూ బాలచందర్ చెప్పినట్లు ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’’.
తనను నిచ్చెనలా వాడుకుని ఉన్నతంగా ఎదిగిన వాడిని క్షమించి, సాయపడే చెవిటి కథానాయిక ‘కోకిలమ్మ’ (సరిత)
బాలచందర్ మహిళా పాత్రలన్నీ తమ వ్యక్తిత్వాన్ని, అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నతిని సాధించినవే. విశ్వనాధ వారు నృత్య, సంగీతాలకు తమ ‘స్త్రీ’ పాత్రలద్వారా పెద్ద పీట వేస్తే, బాలచందర్ పాత్రలు సామాజిక దృష్ట్యా ప్రాచుర్యం పొందాయి. మరుపురాని విధంగా మనసులపై బలమైన ముద్రవేశాయి.

2 comments:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

బాలచందర్ చిత్రాలను బాగా విశ్లేషించారు

సుభగ said...

బాలచందర్ గారి సినిమాలను అద్భుతంగా విశ్లేషించారండీ!
మీ నుంచి ఇలాంటి మరెన్నో టపాలను ఆశిస్తున్నాము.