చిత్రపరిశ్రమలో సెటిమెంట్లదే అగ్రతాంబూలం. నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు, తారలు తమ సక్సెస్కోసం తపిస్తూ సెంటిమెంట్ల వెంబడి నడవడం ఇక్కడ సహజం. వేలనుండి లక్షలవరకు సెంటిమెంట్లపై ఖర్చు చేయడం కూడా కామన్. అయితే సక్సెస్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా లభించాలో అలాగే లభించినా దానిని పొందిన వారు మాత్రం ఆ సక్సెస్‌ని సెంటిమెంట్ ఖాతాలో జమ చేసి సంబరాలు జరుపుకుంటారు. కొన్ని సెంటిమెంట్లు క్రమేపీ అలవాటుగా మారిపోయిన సందర్భాలు కూడా చిత్రపరిశ్రమలో అనేకం వుంటాయి. ఏది ఏమైనా అడుగుతీసి అడుగు వేసే ముందు సెంటిమెంట్‌దే ఇక్కడ హవా అన్నది నిజం.
నిర్మాతల్లో స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడికి తాను తీసే ప్రతి సినిమా రీలునూ తిరుపతి, విజయవాడల్లో పూజ చేయించడం సెంటిమెంట్ (అలవాటు). మోహన్‌బాబు తాను తీసే సినిమాలో ఒక పాటను జేసుదాసుచేత పాడించుకోవడం సెంటిమెంట్. శ్యామ్ ప్రసాద్‌రెడ్డికి కోడి రామకృష్ణను దర్శకునిగా పెట్టుకుంటే పెద్ద సక్సెస్ వస్తుందనే (తలంబ్రాలు నుండి అరుంధతి వరకు ‘ఆగ్రహం’ సినిమాకు తప్ప) ఒక సెంటిమెంట్. భార్గవ్ ఆర్ట్స్‌పై వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం ‘మ’ అనే అక్షరంపై పెట్టుకోవడం నిర్మాత ఎస్.గోపాలరెడ్డికి సెంటిమెంట్. ఇలా నిర్మాతల సెంటిమెంట్ ఇండస్ట్రీలో బోల్డెన్ని వున్నాయి.
టెక్నీషియన్ల విషయానికి వస్తే ఫలానా టెక్నీషియన్ని సినిమాకి పెట్టుకుంటే ఎక్కువ సక్సెస్ వస్తుందనే నమ్మకంతో ఇండస్ట్రీలో అనేక కాంబినేషన్స్ రన్ అవుతుంటాయి. ఇలా రన్ అయిన కాంబినేషన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్-విజయభాస్కర్, కోటి-ఇవివి, లోక్‌సింగ్-కోదండరామిరెడ్డి, ఎస్.ఎ.రాజ్‌కుమార్-సూపర్ గుడ్ ఫిలింస్, చక్రి-పూరీ జగన్నాధ్, సీతారామశాస్ర్తీ-త్రివిక్రమ్ శ్రీనివాస్, కోడిరామకృష్ణ-్భర్గవఆర్ట్స్, ఎమ్ఎస్ ఆర్ట్స్ ఇలా ఎన్నో సక్సెస్ కాంబినేషన్లలో వివిధ టెక్నీషియన్స్ పనిచేసారు, చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా వుండడంవలన కొంతమందికి భారీగా లాభం చేకూరినా కొంతమంది భారీగా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీళ్లనే సినిమా భాషలో ఐరన్లెగ్స్గా అంటారు పాపం! వీళ్లు కూడా ఒకప్పుడు గోల్డెన్ లెగ్సే కానీ పిరియడ్ (సక్సెస్) ముగియడంతో ఈ అపవాదు మోయాల్సి వస్తుంది.
సినిమాల్లో ఎప్పుడూ సక్సెస్‌కే ప్రాధాన్యత. సక్సెస్ వుంటేనే ఇండస్ట్రీలో పలకరింతలు, పులకరింతలు. సక్సెస్‌లో పనిచేసిన సెంటిమెంట్ ఒక్క ఫ్లాప్‌తో మనుషుల మధ్య అంతరాలను పెంచేస్తుంది. అంటే సక్సెస్సే సెంటిమెంటన్నమాట.
తారల విషయానికి వస్తే వెంకటేష్ తన ప్రతి సినిమాలో మొదటి షాట్లో బ్లాక్ డ్రెస్‌లో కనిపించడం సెంటిమెంట్. హీరో సినిమాలో నిద్రలో కలగని లేవడంతో సినిమాకు బద్ధకం పోయి పెద్ద హిట్ కావడం చాలా సినిమాల్లో రుజువైంది (గ్యాంగ్ లీడర్లో చిరంజీవి, పెళ్లిసందడిలో శ్రీకాంత్) సినిమా మొదటి సీన్లో ‘విధవ’ రూపం కనిపిస్తే అట్టర్‌ప్లాప్ అవుతుందని సెంటిమెంట్. అక్కినేని-వాణిశ్రీ, రామారావు-కృష్ణకుమారి, అక్కినేని-సావిత్రి, అక్కినేని-శ్రీదేవి, రామారావు-జయసుధ, కృష్ణ-విజయనిర్మల, శోభన్‌బాబు-జయసుధ, చిరంజీవి-రాధిక, వెంకటేశ్-సౌందర్య, బాలకృష్ణ-విజయశాంతి సూపర్‌హిట్ కాంబినేషన్స్‌గా వెలిగాయి. ఇదే సెంటిమెంట్‌తో ప్రస్తుత హీరోలు కూడా కాంబినేషన్స్ కోరుకోవడం జరుగుతుంది.
కొంతమంది నిర్మాతలు సెంటిమెంట్‌తో అవసరం లేకపోయినా ఏదో ఒక షాట్‌ని ఫలానా ప్లేస్‌లో తీయాలని, ఫలానా కామెడీ ఆర్టిస్టు వుండాలని నిర్ణయం తీసుకోవడం సెంటిమెంటే. తారలు హెడ్ బ్యాండ్స్, రింగ్స్ ఎక్కువగా రకరకాలవి సెంటిమెంట్‌తో ధరించడం జరుగుతుంది. అవకాశాలు జోరందుకున్నప్పుడే కాదు అవకాశాలు రాకపోడవంతో కూడా తారలు విపరీతమైన సెంటిమెంట్‌గా భావించి పూజలు, హోమాలు, జాతకాలతో కాలం గడిపేస్తారు. కులమతాలకు అతీతంగా సెంటిమెంట్లను పాటించడంలో తారలదే అగ్రస్థానం.
ప్రస్తుతం సెంటిమెంట్ హవాలో బాలకృష్ణ ‘సింహా’ నడుస్తుంది. ఆరేళ్లుగా కనీసం ఏవరేజ్ సినిమాను కూడా తన ఖాతాలో వేసుకోని బాలయ్య అనుకోకుండా భారీ హిట్ కొట్టడంతో బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు ఒక్కసారిగా అవకాశాలు వెల్లువెత్తి బాలకృష్ణను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇదే చిత్ర పరిశ్రమలోని వి‘చిత్రం’. హిట్ వస్తే అవకాశాలు కోకొల్లలు. ఫట్వస్తే మొత్తం నిల్లు. ఈ విషయంలో అగ్రహీరోలు, అండదండలు వున్న హీరోలు తప్ప చాలామంది కుర్ర హీరోలు కుదేల్ అయిపోయారు.
‘సింహా’ విషయానికొస్తే ఈ మాట తగిలిన సినిమాలన్నీ బాలకృష్ణకు భారీ హిట్స్‌గా మిగలడంతో ఆయనకు సెంటిమెంట్ మరింత రెట్టింపుఅయి రాష్ట్రంలో వున్న లక్ష్మీ నరసింహ ఆలయాల సందర్శన యాత్రకు పురిగొల్పింది. ఇదో కొత్త తరహా సినిమా విజయయాత్రగా చెప్పవచ్చును. అదేవిధంగా బాలకృష్ణ రాబోయే సినిమా పేర్లలోగాని, పాత్ర పేర్లలోగానీ ‘సింహ’ శబ్దం ఎక్కువగా వినిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ‘సింహ’ శబ్దం నందమూరి మూడు తరాలవారికి (ఎన్టీఆర్, బాలయ్య,జూ.ఎన్టీఆర్) హిట్స్నివ్వడమే కాదు మిగతా నటులకు కూడా భారీగానే ఉపయోగపడింది. ఎన్టీఆర్‌కు సింహబలుడు, సింహగర్జన, కొండవీటి సింహం, జయసింహ భారీ హిట్స్ ఇస్తే రాజకీయ రంగానికి వచ్చే ముందు సింహం నవ్వింది భారీ ఫ్లాప్‌గా నిలిచి నిరాశపరిచింది. బాలకృష్ణ విషయానికి వస్తే బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, సింహలు భారీ విజయాలను సాదిస్తే సీమసింహం భారీ ఫ్లాప్‌గా నిలిచింది. జూ.ఎన్టీఆర్‌కి సింహాద్రి భారీ హిట్‌గా నిలిచింది.
సూపర్‌స్టార్ కృష్ణకు పల్నాటి సింహం, అడవి సింహాలు హిట్స్‌గా నిలిచాయి. చిరంజీవికి సింహపురి సింహం, కొదమ సింహం భారీ హిట్స్‌గా మిగిలాయి. రజనీకాంత్‌కి సైతం తెలుగులో నరసింహ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సింహాతో వచ్చే టైటిల్ అందరికీ బిగ్గెస్ట్ హిట్స్‌నే ఇచ్చింది. ఆయా సినిమాలు ఆయా సమయాల్లో భారీ వసూళ్లతోనే నిలిచాయి. కాకపోతే ‘సింహ’ శబ్దంతో వచ్చిన టైటిల్స్ ఎక్కువగా బాలకృష్ణకు దక్కడం విశేషం. ఒక్కో నటుడు ఒక్కో తరహా టైటిల్‌కి సరిపోవడం కూడా సెంటిమెంటే. చిరంజీవికి ‘దొంగ’, కృష్ణకు గూఢచారి టైటిల్స్, శోభన్‌బాబుకి లేడీస్ టైటిల్స్, వెంకటేష్‌కి ‘రా’ శబ్దంతో వచ్చే టైటిల్స్, గోపీచంద్‌కి సున్నాతో ముగిసే టైటిల్స్ (రణం, లక్ష్యం, నిజం, శౌర్యం) ఇలా...టైటిల్స్ కూడా హీరోలకు ప్లస్ మైనస్లుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఆర్య సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడంతో అదే సినిమా దర్శకుడు అదే హీరోతో నిర్మించిన చిత్రానికి ఇది ఆర్య సినిమాకు సీక్వెల్ కాదని చెబుతునే ఆర్య-2 అని టైటిల్ పెట్టడంతో సినిమా ప్లాప్ లిస్టుకి పోయింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నం ఉడికిందో లేదో ఓ మెతుకు పట్టుకుంటే తెలిసిపోయినట్టు సెంటిమెంట్‌ను పట్టుకుని తెలుసుకోవచ్చన్నది చాలామంది నమ్మకం. అప్పుడప్పుడు ఈ సెంటిమెంట్ అంచనాలు తారుమారు కావచ్చు లేక ఆశ్చర్యపడే అద్భుతాలు సృష్టించవచ్చు. మొత్తానికి ఇక్కడ సెంటిమెంట్‌దే హవా, అగ్రతాంబూలం అన్నది అక్షర సత్యం.
1 comment:
ఈ సెంటిమెంట్లు గోలేదో బలే వుందే...:-)
Post a Comment