Tuesday, August 24, 2010

వెలుగు తగ్గుతున్న తెలుగు పాట

సినిమా పాటలు వినోదంతోపాటు వికాసాన్ని సామాజిక ప్రయోజనాన్నీ అందిస్తుందని నమ్మేవారు ఆనాటి దర్శక నిర్మాతలు. ఆనాటి పాటల్లో దేశ నాయకుల గొప్పతనాన్ని, ఆశయాల్ని మనకి పాటల రూపంలో అందిస్తూ ఆదర్శాలను వల్లె వేయించేవారు.
మన సినిమా పాటల్లో సందర్భాన్నిబట్టి సన్నివేశాన్ని బట్టి లోతైన భావాల్తో చమత్కారంగా కవితాంశాన్ని ప్రయోగించే గేయ రచయితలూ మనకి లేకపోలేదు. అందుకే అటు విద్వత్తు పరంగా,ఇటు వాణిజ్యపరంగా విలక్షణమైన ఆకర్షణని సొంతం చేసుకుంది సినీ సంగీతం. కరుణా రసభరిత సన్నివేశాల్ని భావోద్వేగాల్నీ..సినిమా పాట మనసుకి హత్తుకునేలా చేయగలదు.
పాట వింటే ఆ సన్నివేశం కళ్లకు కట్టినట్టు వుండాలి. సినిమా సంగీతానికి శ్రావ్యత ముఖ్యం. కవి హృదయంతో రాసినదానిని సంగీత దర్శకుడు అంతే హృద్యంగా బాణీ అందిస్తే గాయనీ గాయకులు మరింత అందంగా తమ స్వరాలతో ఆ బాణీకి ప్రాణం పోస్తే..నటీనటులు కొత్తవారైనా పాట ఎప్పటికీ పచ్చగా వుంటుంది పరిమళిస్తూనే ఉంటుంది.
కేవలం పాటలే కాకుండా ప్రబోధాత్మక గీతాలను ఆనాటి కవులు సినిమాలద్వారా అందించారు. ప్రేక్షకులకి అందించాలని అప్పటి దర్శక నిర్మాతలు భావించేవారు. స్ఫూర్తిదాయకమైన పాటల గురించి చెప్పుకునేటప్పుడు అలవోకగా పెదాలపై పల్లవించే పాటలెన్నో.అయితే సినిమా పాట కేవలం సినిమా కథనానికే కాకుండా ఇతర సందర్భాల్లోనూ మన జీవితానికి హత్తుకునేలా ప్రతిధ్వనించేలా వుండాలి. సమాజంలో ప్రతీ ఒక్కరికీ అనువర్తించే రీతిలో ఇటువంటి గీతాలు ఎప్పుడు విన్నా మనకి నిత్యనూతనంగా ఉంటాయి!
మూల కథ ఏదైనా ప్రజాహితాన్ని ఆశించి ఆకాంక్షించి అభ్యుదయ భావాలతో ఆత్మీయంగా అందించే పాటలు ఎప్పుడూ చిరంజీవులే! సామాజిక శ్రేయస్సునీ, ప్రగతినీ అందించే ఉదాత్త భావాలు ఆనాటి సాంఘిక చిత్రాల్లో చొప్పించే రీతిలో వుండేవి. ఆ పాటల్లో సంగీతం, నృత్యం,సాహిత్యం అన్నీ సమపాళ్లలో రంగరించబడేవి. అందుకే ఆ పాటలు ఆద్యంతం వినాలనిపిస్తాయి! పాటకి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఏడ్చే పిల్లలకు జోలపాడితే ఆదమరిచి నిద్రపోతారు. అలసిన శ్రామిక కర్షక జీవులకు సేద తీర్చేది, వారి పనివేగాన్ని పెంచేది పాటే. అలాగే అంధకారంలో కొట్టుమిట్టాడే వారికి వెలుగులోకి ప్రగతి పధంలోకి నడిపించేది పాటే! ఇందుకు నిలువుటద్దాలు జానపద గీతాలే! పామరులనీ ఆలోచింపచేసీ, ఆనందింపచేసే ఓదార్పుని కలిగించేవి ఈ జానపద గీతాలే. మాటలనే హారంగా గుచ్చి దానికి శ్రావ్యమైన సంగీతాన్ని సమకూర్చి పాటని తీర్చిదిద్దితే అది ఎవరి మనసునైనా ఆకట్టుకుంటుంది. అందుకే సినిమా పాటల ప్రాముఖ్యత పెరిగింది.
సినిమాల్లో పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించడమే కాకుండా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి..అందుకే నిర్మాతలు పాటలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వాటిని చిత్రిస్తారు. జనం పదే పదే చూడాలనిపించే విధంగా పాటల్ని మలచడంవల్ల సినిమాకి ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. అలాగే పాటవల్ల పాత్రలకీ సన్నివేశాలకి జీవం వస్తుంది. జీవికి ప్రాణం ఎంత ముఖ్యమో పాటకి చిత్రీకరణ అంతే ముఖ్యం. మంచి ట్యూన్‌కి చిత్రీకరించినప్పుడు ఏదైనా లోపం జరిగేటప్పుడు సంగీత దర్శకుడి ప్రతిభ, శ్రమ నూటికి నూరుపాళ్లు వృధా అయ్యే అవకాశం వుంది. అందుకే నటీనటులతో పాటు చిత్రదర్శకుల పనితీరు పాటల్ని నిర్దేశిస్తాయి. లేకపోతే పాటలకి గుర్తింపు రాదు.
ప్రతిపాటకీ ప్రయోజనం వుండాలనుకోవడం ప్రయాసే. కానీ ఆనాటి పాటల్లో ఈ తరహా ప్రయోజనాలకోసం నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ప్రతి ఒక్కరూ తాపత్రయపడేవారు! సమాజంలో ఎన్నో మార్పులతో పాటు సినీ గీతాల్లోనూ మార్పు వచ్చింది. సినిమాని ఎక్కువగా ఇష్టపడే పల్లె వాసులకోసం పాటలు ప్రత్యేకంగా రాయించేవారు. అందుకే అవి చదువురాని గ్రామీణులను, చదువుకునే మేధావులను ఆకర్షించేవి. సినిమా పాటలంటే కేవలం విని ఆనందించడానికే అని చాలామంది అభిప్రాయం! డ్యూయట్‌లు, సోలో సాంగులు, బృంద గీతాలు, హాస్య గీతాలు నృత్య రూపకాలు, హరికథ, బుర్రకథ, యక్షగానాలు ఇలా అన్ని రకాల పాటల్లోనూ సామాజిక ప్రయోజనాన్ని ఆశించే హితోపదేశాలు వుండేవి. అంటే రొమాంటిక్ పాటల్లోనూ సందేశాన్ని అందించేవారన్నమాట! జీవితంలో కష్టసుఖాలు, కలిమిలేములు, పగలురాత్రి వస్తుంటాయి అని నిర్వచించేవారూ ఉన్నారు.. ఆశించింది అందకపోవడం, అందని వాటికోసం వెతుక్కోవడం మనిషి పని అనీ చెప్పే మేధావులు వున్నారు. జీవితాన్ని నిరాశతో గడపవద్దని చెప్పే పాటలు అనేకం. వాటిని ఎప్పుడు విన్నా మనసు కుదుటపడడం సహజం. అప్పటి రచయితలు పాండిత్యంలోను ఆరితేరినవారు కావడంవల్ల పాటల్లో సాహిత్యం వెల్లివిరిసేది. అందుకే సమాజ శ్రేయస్సునీ, సంక్షేమాన్ని ప్రగతి భావాలని పాటల రూపంలో అందించడం ప్రధాన థ్యేయంగా ఉండేది. సినిమా వాళ్లలో కమిట్‌మెంట్ ఎక్కువగా వుండడంవల్ల కూడా మెరుగైన గీతాలకి సినిమా వేదిక అయింది. ఏ పాటకైనా చిత్రంలోని కథే ముఖ్యం. కథ, సన్నివేశం పాత్రల తీరు..ఇవే ఉదాత్తమైన పాటలకి ప్రేరణ అందిస్తాయి. ఉత్తమమైన పాటకి జీవాన్ని పోస్తాయి. కథాస్పర్శతో పాత్రల మనోభావాలకి అద్దం పట్టిన మధుర గీతాలెన్నో సంగీత ప్రియుల్ని రసానుభూతిని అందిస్తాయి. హీరో ఇమేజ్ కన్నా..చిత్రకధే ప్రధానపాత్ర వహించడంవల్ల మరింత మధురంగా కథా కథనాలు..గీతాలు ఆవిర్భవిస్తాయి. తెలుగు సినీ గీతాల సముద్రంలో తరచి తరచి చూస్తే ఎన్నో ఆణిముత్యాలు దొరుకుతాయి. సంగీతం, సాహిత్యం, గాయనీ గాయకుల గాత్ర వైవిధ్యం, కలగలిసి మనకెన్నో అద్భుత గీతాల్ని అందించాయి. వినోదమైనా, విషాదమైనా, ప్రణయమైనా, భక్తి రసమైనా సందర్భాన్నిబట్టి ఎప్పటికప్పుడు చక్కటి సినిమా పాటలు ఉదయిస్తునే వుంటాయి.
పాట బాగుండాలే కానీ ఎన్ని సంవత్సరాలైనా..కాలంతో పనిలేక పచ్చగానే వుంటుంది. సంగీతంతో మనకి ప్రవేశం లేకపోయినా, సినీ గీతాలు మన హృదయంలో ప్రకాశించడానికి ఒకే ఒక్క కారణం సంగీత దర్శకులూ, రచయితలూ. రచయిత మనోభావాన్ని సంగీత పరికరాల సాయంతో మధురంగా పలికించే స్వరకర్త పాటకి ప్రాణం..ఊపిరి!!
ఈనాటి పాటల్లో వేగమే తప్ప రాగమే లేదు. రాగాల కలయిక అపురూప గీతంగా మార్పుచెంది మనకో ఆహ్లాదభరితమైన పాటని అందించేవి ఆనాటి చిత్రాలు. అందుకే అప్పటి పాటలు మనం ఎన్నిసార్లు విన్నా మళ్లీ వింటే బాగుండును అనే భావన కలుగుతుంది. గంగిగోవు పాలు గరిటెడైన చాలు అన్నట్టు వినసొంపైన పాట ఒకటున్నా ఇప్పటి సినిమా విజయానికి రాచబాట వెయ్యడం ఖాయం. లేకపోతే హాల్లోంచి రెండ్రోజుల్లోనే మాయం. సినిమా అనేది పూర్తిగా కమర్షియల్ అయినా ప్రేక్షకులు కోరే భావగీతాలూ వుండాలి. అంతేకానీ ఓ ఫార్మాట్‌లా ఆరు పాటలు (ఐటంసాంగ్‌తో కలిపి) వుండాలని సినిమాని నిర్మిస్తే...అది చూసేవారికి ఏడు ఇంటర్వెల్స్ ఇచ్చే వాళ్లవుతారు. పాట మనసును ‘కదిలించేలా’ ఉండాలి. జనాన్ని ‘సీట్లోంచి కదిలించేలా’ ఉండకూడదని తీసేవాళ్లు భావించే రోజులు రావాలి. ఇప్పటి పాటల్లో సాహిత్యం వున్నా..సంగీత పరికరాల హోరు, ఎడిటింగ్ జోరూ ఇప్పటి పాటలోని సాహిత్యాన్ని హత్య చేస్తున్నాయని అందరూ భావిస్తున్నారు. ఆ భావనని నేటి పాటలు పటాపంచలు చేసి ‘పంచదార బొమ్మ’ల్లాంటి సినీ గీతాల్ని అందించగలిగితే మనస్ఫూర్తిగా చప్పట్లు కొడతారు. లేదంటే పెదవి విరిచి చప్పరించేస్తారు.

Tuesday, August 3, 2010

సినీ కవి భీష్ములు సముద్రాల


తెలుగు చలనచిత్ర సాహిత్య కళామతల్లిని, నవ్యమైన, రసవంతమైన, నందనవనాలలో, పూబాటలందు నడిపించిన రచయిత సినీ కవికులపతి, సినీ భీష్ములు, శ్రీమాన్ సముద్రాల వెంకటరాఘవాచార్యులు. తెలుగు టాకీ పుట్టిన ఆరు సంవత్సరాలకు (1937) సముద్రాలవారు సినీ రచయితగా కలంపట్టారు. మూడు దశాబ్దాలు (1937-1968) వరకూ రచనచేసి, తరువాత సినీ కవులెందరికో మార్గదర్శకులైనారు. సముద్రాలవారు 1902 జూలై 19వ తేదీన రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామంలో జన్మించారు. రేపల్లే హైస్కూలులో స్కూలు ఫైనల్ వరకూ చదివి, తరువాత భాషాప్రవీణ పూర్తి చేశారు. వారు పండితకవి. ఎన్నో అవధానాలు, శతావధానాలు చేశారు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, తమిళ, హిందీ భాషల్లో ప్రావీణ్యం పొందారు. కావ్యాలు రచించగలిగిన ప్రజ్ఞ ఉన్నా, సినీ రచయితగామారి, సినీ సాహిత్యాన్ని గ్రాంధిక భాషనుంచి వాడుక భాషవైపు మళ్లించారు. సినీరంగ ప్రవేశం: 1932లో గూడవల్లి రామబ్రహ్మంగారి పరిచయంతో మద్రాసు వెళ్లి ‘ప్రజామిత్ర’ పత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు. రామబ్రహ్మంగారి రికమండేషన్‌తో హెచ్.వి.బాబు దర్శకత్వంలో 1937లో జానపద చిత్రం ‘కనకతార’కు స్వతంత్రంగా రచన చేయటంద్వారా వారి సినీరంగ ప్రస్థానం మొదలయ్యింది. సముద్రాల - వాహిని: వాహిని సంస్థద్వారా, వరుసగా మూడు సాంఘిక చిత్రాలు విడుదలయ్యాయి. 1939లో ‘వందేమాతరం’, 1940లో సుమంగళి, 1941లో దేవత. ఈ చిత్రాలకు రచయిత సముద్రాలవారే. 1942లో కె.వి.రెడ్డిని దర్శకునిగా పరిచయంచేస్తూ వాహినీవారు నిర్మించిన భక్తిరస చిత్రం ‘భక్తపోతన’ (ప్రసిద్ధ గీతం సర్వమంగళనామా, సీతారామా)లో తమ సాహితీ విశ్వరూపాన్ని చూపారు సముద్రాల. 1945లో ‘స్వర్గసీమ’కు పాటలు, 1947 యోగి వేమనకు మాటలు, పాటలు సమకూర్చి, ఆ చిత్రాలకు విజయం సాధించిపెట్టారు.
సముద్రాల - ఘంటసాల: సముద్రాల వారిది, ఘంటసాలవారి అత్తవారి ఊరు పెదపులివర్రు ఒకటే కావటంవల్ల సముద్రాల వారు ఘంటసాలను మద్రాసు రప్పించి ‘స్వర్గసీమ’ చిత్రంలో భానుమతితో కలిసి ‘లే నవ్వుల చిరునవ్వులు’ అనే యుగళగీతం ద్వారా గాయకునిగా అవకాశం కల్పించారు. అంతేకాక విజయవారి షావుకారు చిత్రానికి సంగీత దర్శకునిగా ఘంటసాలను సిఫార్సు చేశారు సముద్రాల. ఘంటసాల, సముద్రాల పట్ల గురుభావం కలిగి ఉండేవారు. తాను నిర్మించిన ‘భక్తరఘునాధ్’ (నీగుణ గానము, నీపద ధ్యానము) రచన, దర్శకత్వ బాధ్యతలు సముద్రాలవారి కప్పగించారు.
సముద్రాల - మల్లాది: తెలుగు భాషకు జిలుగు, వెలుగులు కలిగించిన రచయిత, మల్లాది రామకృష్ణ శాస్ర్తీ. సముద్రాల వారితో, మల్లాదికి సినీ రంగానికి పూర్వమే స్నేహబంధం ఉంది. రామబ్రహ్మంగారి ‘పల్నాటి యుద్ధం’ చిత్రానికి మొదటిసారి మల్లాది, సముద్రాల పనిచేశారు. సముద్రాల రచనలపై మల్లాది ముద్రపడేంత గాఢంగా ఇద్దరూ చివరి వరకు కలిసిపోయారు. మల్లాదివారి పాండిత్యం సముద్రాలవారి సాహిత్యానికి నగిషీలు చెక్కింది.
అక్కినేని - సముద్రాల: అక్కినేని నటించిన చారిత్రాత్మక చిత్రం ‘పల్నాటియుద్ధం’. ఇందులో పౌరుషాన్ని పురిగొల్పే రచన చేశారు సముద్రాల. అక్కినేని స్వయంగా పాడి నటించిన ‘మానవ నైజమ్ము మాననే నైతి’ చెప్పుకోతగినది. అక్కినేనికి సముద్రాలవారంటే ఆనాటినుంచి గౌరవం, పూజ్యభావం సముద్రాల వారి సంభాషణలకు అర్థాలు వారి నడిగి తెలుసుకొని, తన నటన మెరుగు పరచుకున్నానని అక్కినేని ప్రస్తావిస్తుంటారు. సముద్రాల రచన చేసిన, తెనాలి రామకృష్ణ (చేసేది ఏమిటో చేసేయి సూటిగా) అమరశిల్పి జక్కన్న (నిలువుమా, నీలవేణి), భక్త జయదేవ (నాదు ప్రేమ భాగ్యరాశి) ముఖ్యంగా విప్రనారాయణ (విరికన్నెలు, అరవిరిసిన కన్నులు) అక్కినేని నట జీవితంలో మరుపురాని చిత్రాలు.
సముద్రాల - వినోదా - శరత్‌బాబు: 1950 ప్రాంతంలో డి.ఎల్, సముద్రాల, వేదాంతం రాఘవయ్య, సి.ఆర్.సుబ్బరామన్ వినోదా సంస్థ ప్రారంభించారు, మూడు చిత్రాలు నిర్మించారు. ‘స్త్రీసాహసం’, ‘శాంతి’, ‘దేవదాసు’, శరత్ సాహిత్యంలోని దేవదాసు, బాటసారి చిత్రాలకు రచన చేసిన సముద్రాల మూల రచనకు (శరత్) మెరుగులు దిద్ది ‘దేవదాసు’లో ప్రతి పాట ఆణిముత్యంగా (జగమే మాయ, కల ఇదని) హృదయాలను కదిలించే సంభాషణలతో రక్తికట్టించి, తమ సంస్థకు అఖండ విజయాన్ని అందించి కొత్త చరిత్ర సృష్టించారు. శరత్ సాహిత్యంలోని బడదీది (బాటసారి)లో అతి తక్కువ మాటలతో భావ ప్రకటనకు ప్రాధాన్యమిచ్చారు సముద్రాల. ఈ చిత్రంలో (ఓ బాటసారి, కనులకు తోచి చేతికందని) పాటలో ‘అల్పబుద్ధితో జ్ఞానదాతను సలుపకు పరిహాసం’ అని సృష్టికర్తను వినుతించారు.
సముద్రాల - దర్శకుడు: ‘స్త్రీ సాహసం’ చిత్ర నిర్మాణంలోని అనుభవంతో సముద్రాల వారు స్వయంగా మూడు పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. వినాయక చవితి (దినకరా శుభకరా) బబ్రువాహన (మాసరి విలాసులు) భక్త రఘునాధ్.
సముద్రాల - జానపదం: సముద్రాల వారి రచనతో విజయం సాధించిన జానపద చిత్రాలు ‘రత్నమాల’, ‘బాలరాజు’, ‘స్వప్న సుందరి’, ‘స్త్రీసాహసం’ విషాదాంత ప్రేమకథా చిత్రాలు లైలామజ్ను, అనార్కలి. ఈ చిత్రాల్లో పాటలు బాలరాజు (తీయని వెన్నెల రేయి’, ‘తేలి చూడుము హాయి’, ‘బ్రతుకొక్క గడియే చాలుగా, ‘సాగుమా సాహిణి’ (స్వప్నసుందరి) ‘కళలకు రాణులు కపురపు వీణలు’ (స్త్రీ సాహసం) ఓ తారక (చండీరాణి), హాయి హాయిగా ఆమని సాగే (సువర్ణసుందరి), ‘విరితావులలీల’ (లైలా మజ్ను) విషాద గీతం ‘పయనయే ప్రియతమ’ (లైలా మజ్ను) కలిసె నెలరాజు (అనార్కలి) మాధుర్య సుధా ధారలు.
సాంఘిక చిత్రాలు: సముద్రాల పాటలు మాత్రమే వ్రాసిన చిత్రాలలో ఎన్నదగినవి స్వర్గసీమ (మధుర వెన్నెలరేయి), షావుకారు (ఏమననే చిన్నారి) ‘భలే తాత మన బాపూజీ..బాలల తాత బాపూజీ.. (దొంగరాముడు), ఈ గీతాలన్నీ రసజ్ఞ శ్రోతల నలరిస్తూనే వున్నాయి.
పౌరాణిక చిత్రాలు: సముద్రాల వారి వైవిధ్యభరితమైన సాహిత్యంతో, పరిపుష్టమైన సంక్లిష్టమైన, సంభాషణలతో అలరారిన పౌరాణిక చిత్రాల్లో ఎన్నదగినవి ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘దీపావళి’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘భూకైలాస్‘, ‘శ్రీకృష్ణావతారం’, ‘సీతారామ కళ్యాణం’. ఆయా చిత్రాల్లోని సంభాషణలు అగ్రనటీ, నటులందరి గొంతులనుంచి జాలువారి, తెలుగు ప్రేక్షకుల మనస్సులను ఉత్తేజించి రంజింపజేశాయి. ముఖ్యంగా కీచక, దుర్యోధనుల పాత్రల్లో ఎస్.వి.రంగారావు, రావణ, దుర్యోధన పాత్రల్లో ఎన్.టి.రామారావుల వాచకం, ఆ సంభాషణలు పలకిన తీరు అపూర్వం. పాటల విషయానికి వస్తే నర్తనశాలలోని ‘జననీ శివకామిని’, ‘దేవా దీనబాంధవా (పాండవ వనవాసం, ‘నీలకంఠరా దేవా (భూకైలాస్), ప్రియురాల సిగ్గేలనే (శ్రీకృష్ణ పాండవీయం) తెనుగు నాట ప్రతి పెళ్లి పందిళ్లలో వినిపించే చిరస్మరణీయ గీతం ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ శ్రీరామనవమి వేడుకలకు ఈ పాటను మరిపించే పాట, ఇంకోటి లేదు. లవకుశ (ఏ నిమిషానికి ఏమి జరుగునో) ఎనె్నన్నో రసగుళికలు, పాటల ప్రవాహాలు, సముద్రాల వారి కలంనుంచి జాలువారాయి.
వారసత్వం: ‘జూనియర్ సముద్రాల’గా పేరుపొందిన సముద్రాల వెంకటరామానుజం వీరి కుమారులే. వారి కుమార్తె ‘శుభశ్రీ’ చొరవతో ఫిలింనగర్‌లో సముద్రాల విగ్రహాన్ని ప్రతిష్టించటం చెప్పుకోదగిన విశేషం. నవరసాలను కురిపించే గీతాలను, ఆంధ్రుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని చరితను (లవకుశ), సాహితీపరంగా ఆంధ్ర దేశానికి అందించిన సినీ కవికుల భీష్మాచార్యులు సీనియర్ సముద్రాల చిరస్మరణీయులు, వీరి చివరి చిత్రం ‘వీరాంజనేయ’. వీరి చివరిగీతం ‘శ్రీరామకథా గానం’ కావటము విశేషమే.