Tuesday, August 3, 2010
సినీ కవి భీష్ములు సముద్రాల
తెలుగు చలనచిత్ర సాహిత్య కళామతల్లిని, నవ్యమైన, రసవంతమైన, నందనవనాలలో, పూబాటలందు నడిపించిన రచయిత సినీ కవికులపతి, సినీ భీష్ములు, శ్రీమాన్ సముద్రాల వెంకటరాఘవాచార్యులు. తెలుగు టాకీ పుట్టిన ఆరు సంవత్సరాలకు (1937) సముద్రాలవారు సినీ రచయితగా కలంపట్టారు. మూడు దశాబ్దాలు (1937-1968) వరకూ రచనచేసి, తరువాత సినీ కవులెందరికో మార్గదర్శకులైనారు. సముద్రాలవారు 1902 జూలై 19వ తేదీన రేపల్లె తాలూకా పెదపులివర్రు గ్రామంలో జన్మించారు. రేపల్లే హైస్కూలులో స్కూలు ఫైనల్ వరకూ చదివి, తరువాత భాషాప్రవీణ పూర్తి చేశారు. వారు పండితకవి. ఎన్నో అవధానాలు, శతావధానాలు చేశారు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, తమిళ, హిందీ భాషల్లో ప్రావీణ్యం పొందారు. కావ్యాలు రచించగలిగిన ప్రజ్ఞ ఉన్నా, సినీ రచయితగామారి, సినీ సాహిత్యాన్ని గ్రాంధిక భాషనుంచి వాడుక భాషవైపు మళ్లించారు. సినీరంగ ప్రవేశం: 1932లో గూడవల్లి రామబ్రహ్మంగారి పరిచయంతో మద్రాసు వెళ్లి ‘ప్రజామిత్ర’ పత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు. రామబ్రహ్మంగారి రికమండేషన్‌తో హెచ్.వి.బాబు దర్శకత్వంలో 1937లో జానపద చిత్రం ‘కనకతార’కు స్వతంత్రంగా రచన చేయటంద్వారా వారి సినీరంగ ప్రస్థానం మొదలయ్యింది. సముద్రాల - వాహిని: వాహిని సంస్థద్వారా, వరుసగా మూడు సాంఘిక చిత్రాలు విడుదలయ్యాయి. 1939లో ‘వందేమాతరం’, 1940లో సుమంగళి, 1941లో దేవత. ఈ చిత్రాలకు రచయిత సముద్రాలవారే. 1942లో కె.వి.రెడ్డిని దర్శకునిగా పరిచయంచేస్తూ వాహినీవారు నిర్మించిన భక్తిరస చిత్రం ‘భక్తపోతన’ (ప్రసిద్ధ గీతం సర్వమంగళనామా, సీతారామా)లో తమ సాహితీ విశ్వరూపాన్ని చూపారు సముద్రాల. 1945లో ‘స్వర్గసీమ’కు పాటలు, 1947 యోగి వేమనకు మాటలు, పాటలు సమకూర్చి, ఆ చిత్రాలకు విజయం సాధించిపెట్టారు.
సముద్రాల - ఘంటసాల: సముద్రాల వారిది, ఘంటసాలవారి అత్తవారి ఊరు పెదపులివర్రు ఒకటే కావటంవల్ల సముద్రాల వారు ఘంటసాలను మద్రాసు రప్పించి ‘స్వర్గసీమ’ చిత్రంలో భానుమతితో కలిసి ‘లే నవ్వుల చిరునవ్వులు’ అనే యుగళగీతం ద్వారా గాయకునిగా అవకాశం కల్పించారు. అంతేకాక విజయవారి షావుకారు చిత్రానికి సంగీత దర్శకునిగా ఘంటసాలను సిఫార్సు చేశారు సముద్రాల. ఘంటసాల, సముద్రాల పట్ల గురుభావం కలిగి ఉండేవారు. తాను నిర్మించిన ‘భక్తరఘునాధ్’ (నీగుణ గానము, నీపద ధ్యానము) రచన, దర్శకత్వ బాధ్యతలు సముద్రాలవారి కప్పగించారు.
సముద్రాల - మల్లాది: తెలుగు భాషకు జిలుగు, వెలుగులు కలిగించిన రచయిత, మల్లాది రామకృష్ణ శాస్ర్తీ. సముద్రాల వారితో, మల్లాదికి సినీ రంగానికి పూర్వమే స్నేహబంధం ఉంది. రామబ్రహ్మంగారి ‘పల్నాటి యుద్ధం’ చిత్రానికి మొదటిసారి మల్లాది, సముద్రాల పనిచేశారు. సముద్రాల రచనలపై మల్లాది ముద్రపడేంత గాఢంగా ఇద్దరూ చివరి వరకు కలిసిపోయారు. మల్లాదివారి పాండిత్యం సముద్రాలవారి సాహిత్యానికి నగిషీలు చెక్కింది.
అక్కినేని - సముద్రాల: అక్కినేని నటించిన చారిత్రాత్మక చిత్రం ‘పల్నాటియుద్ధం’. ఇందులో పౌరుషాన్ని పురిగొల్పే రచన చేశారు సముద్రాల. అక్కినేని స్వయంగా పాడి నటించిన ‘మానవ నైజమ్ము మాననే నైతి’ చెప్పుకోతగినది. అక్కినేనికి సముద్రాలవారంటే ఆనాటినుంచి గౌరవం, పూజ్యభావం సముద్రాల వారి సంభాషణలకు అర్థాలు వారి నడిగి తెలుసుకొని, తన నటన మెరుగు పరచుకున్నానని అక్కినేని ప్రస్తావిస్తుంటారు. సముద్రాల రచన చేసిన, తెనాలి రామకృష్ణ (చేసేది ఏమిటో చేసేయి సూటిగా) అమరశిల్పి జక్కన్న (నిలువుమా, నీలవేణి), భక్త జయదేవ (నాదు ప్రేమ భాగ్యరాశి) ముఖ్యంగా విప్రనారాయణ (విరికన్నెలు, అరవిరిసిన కన్నులు) అక్కినేని నట జీవితంలో మరుపురాని చిత్రాలు.
సముద్రాల - వినోదా - శరత్‌బాబు: 1950 ప్రాంతంలో డి.ఎల్, సముద్రాల, వేదాంతం రాఘవయ్య, సి.ఆర్.సుబ్బరామన్ వినోదా సంస్థ ప్రారంభించారు, మూడు చిత్రాలు నిర్మించారు. ‘స్త్రీసాహసం’, ‘శాంతి’, ‘దేవదాసు’, శరత్ సాహిత్యంలోని దేవదాసు, బాటసారి చిత్రాలకు రచన చేసిన సముద్రాల మూల రచనకు (శరత్) మెరుగులు దిద్ది ‘దేవదాసు’లో ప్రతి పాట ఆణిముత్యంగా (జగమే మాయ, కల ఇదని) హృదయాలను కదిలించే సంభాషణలతో రక్తికట్టించి, తమ సంస్థకు అఖండ విజయాన్ని అందించి కొత్త చరిత్ర సృష్టించారు. శరత్ సాహిత్యంలోని బడదీది (బాటసారి)లో అతి తక్కువ మాటలతో భావ ప్రకటనకు ప్రాధాన్యమిచ్చారు సముద్రాల. ఈ చిత్రంలో (ఓ బాటసారి, కనులకు తోచి చేతికందని) పాటలో ‘అల్పబుద్ధితో జ్ఞానదాతను సలుపకు పరిహాసం’ అని సృష్టికర్తను వినుతించారు.
సముద్రాల - దర్శకుడు: ‘స్త్రీ సాహసం’ చిత్ర నిర్మాణంలోని అనుభవంతో సముద్రాల వారు స్వయంగా మూడు పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. వినాయక చవితి (దినకరా శుభకరా) బబ్రువాహన (మాసరి విలాసులు) భక్త రఘునాధ్.
సముద్రాల - జానపదం: సముద్రాల వారి రచనతో విజయం సాధించిన జానపద చిత్రాలు ‘రత్నమాల’, ‘బాలరాజు’, ‘స్వప్న సుందరి’, ‘స్త్రీసాహసం’ విషాదాంత ప్రేమకథా చిత్రాలు లైలామజ్ను, అనార్కలి. ఈ చిత్రాల్లో పాటలు బాలరాజు (తీయని వెన్నెల రేయి’, ‘తేలి చూడుము హాయి’, ‘బ్రతుకొక్క గడియే చాలుగా, ‘సాగుమా సాహిణి’ (స్వప్నసుందరి) ‘కళలకు రాణులు కపురపు వీణలు’ (స్త్రీ సాహసం) ఓ తారక (చండీరాణి), హాయి హాయిగా ఆమని సాగే (సువర్ణసుందరి), ‘విరితావులలీల’ (లైలా మజ్ను) విషాద గీతం ‘పయనయే ప్రియతమ’ (లైలా మజ్ను) కలిసె నెలరాజు (అనార్కలి) మాధుర్య సుధా ధారలు.
సాంఘిక చిత్రాలు: సముద్రాల పాటలు మాత్రమే వ్రాసిన చిత్రాలలో ఎన్నదగినవి స్వర్గసీమ (మధుర వెన్నెలరేయి), షావుకారు (ఏమననే చిన్నారి) ‘భలే తాత మన బాపూజీ..బాలల తాత బాపూజీ.. (దొంగరాముడు), ఈ గీతాలన్నీ రసజ్ఞ శ్రోతల నలరిస్తూనే వున్నాయి.
పౌరాణిక చిత్రాలు: సముద్రాల వారి వైవిధ్యభరితమైన సాహిత్యంతో, పరిపుష్టమైన సంక్లిష్టమైన, సంభాషణలతో అలరారిన పౌరాణిక చిత్రాల్లో ఎన్నదగినవి ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘దీపావళి’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘భూకైలాస్‘, ‘శ్రీకృష్ణావతారం’, ‘సీతారామ కళ్యాణం’. ఆయా చిత్రాల్లోని సంభాషణలు అగ్రనటీ, నటులందరి గొంతులనుంచి జాలువారి, తెలుగు ప్రేక్షకుల మనస్సులను ఉత్తేజించి రంజింపజేశాయి. ముఖ్యంగా కీచక, దుర్యోధనుల పాత్రల్లో ఎస్.వి.రంగారావు, రావణ, దుర్యోధన పాత్రల్లో ఎన్.టి.రామారావుల వాచకం, ఆ సంభాషణలు పలకిన తీరు అపూర్వం. పాటల విషయానికి వస్తే నర్తనశాలలోని ‘జననీ శివకామిని’, ‘దేవా దీనబాంధవా (పాండవ వనవాసం, ‘నీలకంఠరా దేవా (భూకైలాస్), ప్రియురాల సిగ్గేలనే (శ్రీకృష్ణ పాండవీయం) తెనుగు నాట ప్రతి పెళ్లి పందిళ్లలో వినిపించే చిరస్మరణీయ గీతం ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ శ్రీరామనవమి వేడుకలకు ఈ పాటను మరిపించే పాట, ఇంకోటి లేదు. లవకుశ (ఏ నిమిషానికి ఏమి జరుగునో) ఎనె్నన్నో రసగుళికలు, పాటల ప్రవాహాలు, సముద్రాల వారి కలంనుంచి జాలువారాయి.
వారసత్వం: ‘జూనియర్ సముద్రాల’గా పేరుపొందిన సముద్రాల వెంకటరామానుజం వీరి కుమారులే. వారి కుమార్తె ‘శుభశ్రీ’ చొరవతో ఫిలింనగర్లో సముద్రాల విగ్రహాన్ని ప్రతిష్టించటం చెప్పుకోదగిన విశేషం. నవరసాలను కురిపించే గీతాలను, ఆంధ్రుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని చరితను (లవకుశ), సాహితీపరంగా ఆంధ్ర దేశానికి అందించిన సినీ కవికుల భీష్మాచార్యులు సీనియర్ సముద్రాల చిరస్మరణీయులు, వీరి చివరి చిత్రం ‘వీరాంజనేయ’. వీరి చివరిగీతం ‘శ్రీరామకథా గానం’ కావటము విశేషమే.
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
మీ ఆసక్తిని, అభిరుచిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానండి.
ఎన్నో మంచి పాటలను, సంభాషణలను రచించిన సముద్రాల గారి గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలు..
మంచి టపా
http://loadj.ru/
http://logan-baks.blogspot.com/
Post a Comment