సినిమా పాటలు వినోదంతోపాటు వికాసాన్ని సామాజిక ప్రయోజనాన్నీ అందిస్తుందని నమ్మేవారు ఆనాటి దర్శక నిర్మాతలు. ఆనాటి పాటల్లో దేశ నాయకుల గొప్పతనాన్ని, ఆశయాల్ని మనకి పాటల రూపంలో అందిస్తూ ఆదర్శాలను వల్లె వేయించేవారు.
మన సినిమా పాటల్లో సందర్భాన్నిబట్టి సన్నివేశాన్ని బట్టి లోతైన భావాల్తో చమత్కారంగా కవితాంశాన్ని ప్రయోగించే గేయ రచయితలూ మనకి లేకపోలేదు. అందుకే అటు విద్వత్తు పరంగా,ఇటు వాణిజ్యపరంగా విలక్షణమైన ఆకర్షణని సొంతం చేసుకుంది సినీ సంగీతం. కరుణా రసభరిత సన్నివేశాల్ని భావోద్వేగాల్నీ..సినిమా పాట మనసుకి హత్తుకునేలా చేయగలదు.
పాట వింటే ఆ సన్నివేశం కళ్లకు కట్టినట్టు వుండాలి. సినిమా సంగీతానికి శ్రావ్యత ముఖ్యం. కవి హృదయంతో రాసినదానిని సంగీత దర్శకుడు అంతే హృద్యంగా బాణీ అందిస్తే గాయనీ గాయకులు మరింత అందంగా తమ స్వరాలతో ఆ బాణీకి ప్రాణం పోస్తే..నటీనటులు కొత్తవారైనా పాట ఎప్పటికీ పచ్చగా వుంటుంది పరిమళిస్తూనే ఉంటుంది.
కేవలం పాటలే కాకుండా ప్రబోధాత్మక గీతాలను ఆనాటి కవులు సినిమాలద్వారా అందించారు. ప్రేక్షకులకి అందించాలని అప్పటి దర్శక నిర్మాతలు భావించేవారు. స్ఫూర్తిదాయకమైన పాటల గురించి చెప్పుకునేటప్పుడు అలవోకగా పెదాలపై పల్లవించే పాటలెన్నో.అయితే సినిమా పాట కేవలం సినిమా కథనానికే కాకుండా ఇతర సందర్భాల్లోనూ మన జీవితానికి హత్తుకునేలా ప్రతిధ్వనించేలా వుండాలి. సమాజంలో ప్రతీ ఒక్కరికీ అనువర్తించే రీతిలో ఇటువంటి గీతాలు ఎప్పుడు విన్నా మనకి నిత్యనూతనంగా ఉంటాయి!
మూల కథ ఏదైనా ప్రజాహితాన్ని ఆశించి ఆకాంక్షించి అభ్యుదయ భావాలతో ఆత్మీయంగా అందించే పాటలు ఎప్పుడూ చిరంజీవులే! సామాజిక శ్రేయస్సునీ, ప్రగతినీ అందించే ఉదాత్త భావాలు ఆనాటి సాంఘిక చిత్రాల్లో చొప్పించే రీతిలో వుండేవి. ఆ పాటల్లో సంగీతం, నృత్యం,సాహిత్యం అన్నీ సమపాళ్లలో రంగరించబడేవి. అందుకే ఆ పాటలు ఆద్యంతం వినాలనిపిస్తాయి! పాటకి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఏడ్చే పిల్లలకు జోలపాడితే ఆదమరిచి నిద్రపోతారు. అలసిన శ్రామిక కర్షక జీవులకు సేద తీర్చేది, వారి పనివేగాన్ని పెంచేది పాటే. అలాగే అంధకారంలో కొట్టుమిట్టాడే వారికి వెలుగులోకి ప్రగతి పధంలోకి నడిపించేది పాటే! ఇందుకు నిలువుటద్దాలు జానపద గీతాలే! పామరులనీ ఆలోచింపచేసీ, ఆనందింపచేసే ఓదార్పుని కలిగించేవి ఈ జానపద గీతాలే. మాటలనే హారంగా గుచ్చి దానికి శ్రావ్యమైన సంగీతాన్ని సమకూర్చి పాటని తీర్చిదిద్దితే అది ఎవరి మనసునైనా ఆకట్టుకుంటుంది. అందుకే సినిమా పాటల ప్రాముఖ్యత పెరిగింది.
సినిమాల్లో పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించడమే కాకుండా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి..అందుకే నిర్మాతలు పాటలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వాటిని చిత్రిస్తారు. జనం పదే పదే చూడాలనిపించే విధంగా పాటల్ని మలచడంవల్ల సినిమాకి ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. అలాగే పాటవల్ల పాత్రలకీ సన్నివేశాలకి జీవం వస్తుంది. జీవికి ప్రాణం ఎంత ముఖ్యమో పాటకి చిత్రీకరణ అంతే ముఖ్యం. మంచి ట్యూన్‌కి చిత్రీకరించినప్పుడు ఏదైనా లోపం జరిగేటప్పుడు సంగీత దర్శకుడి ప్రతిభ, శ్రమ నూటికి నూరుపాళ్లు వృధా అయ్యే అవకాశం వుంది. అందుకే నటీనటులతో పాటు చిత్రదర్శకుల పనితీరు పాటల్ని నిర్దేశిస్తాయి. లేకపోతే పాటలకి గుర్తింపు రాదు.
ప్రతిపాటకీ ప్రయోజనం వుండాలనుకోవడం ప్రయాసే. కానీ ఆనాటి పాటల్లో ఈ తరహా ప్రయోజనాలకోసం నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా ప్రతి ఒక్కరూ తాపత్రయపడేవారు! సమాజంలో ఎన్నో మార్పులతో పాటు సినీ గీతాల్లోనూ మార్పు వచ్చింది. సినిమాని ఎక్కువగా ఇష్టపడే పల్లె వాసులకోసం పాటలు ప్రత్యేకంగా రాయించేవారు. అందుకే అవి చదువురాని గ్రామీణులను, చదువుకునే మేధావులను ఆకర్షించేవి. సినిమా పాటలంటే కేవలం విని ఆనందించడానికే అని చాలామంది అభిప్రాయం! డ్యూయట్లు, సోలో సాంగులు, బృంద గీతాలు, హాస్య గీతాలు నృత్య రూపకాలు, హరికథ, బుర్రకథ, యక్షగానాలు ఇలా అన్ని రకాల పాటల్లోనూ సామాజిక ప్రయోజనాన్ని ఆశించే హితోపదేశాలు వుండేవి. అంటే రొమాంటిక్ పాటల్లోనూ సందేశాన్ని అందించేవారన్నమాట! జీవితంలో కష్టసుఖాలు, కలిమిలేములు, పగలురాత్రి వస్తుంటాయి అని నిర్వచించేవారూ ఉన్నారు.. ఆశించింది అందకపోవడం, అందని వాటికోసం వెతుక్కోవడం మనిషి పని అనీ చెప్పే మేధావులు వున్నారు. జీవితాన్ని నిరాశతో గడపవద్దని చెప్పే పాటలు అనేకం. వాటిని ఎప్పుడు విన్నా మనసు కుదుటపడడం సహజం. అప్పటి రచయితలు పాండిత్యంలోను ఆరితేరినవారు కావడంవల్ల పాటల్లో సాహిత్యం వెల్లివిరిసేది. అందుకే సమాజ శ్రేయస్సునీ, సంక్షేమాన్ని ప్రగతి భావాలని పాటల రూపంలో అందించడం ప్రధాన థ్యేయంగా ఉండేది. సినిమా వాళ్లలో కమిట్మెంట్ ఎక్కువగా వుండడంవల్ల కూడా మెరుగైన గీతాలకి సినిమా వేదిక అయింది. ఏ పాటకైనా చిత్రంలోని కథే ముఖ్యం. కథ, సన్నివేశం పాత్రల తీరు..ఇవే ఉదాత్తమైన పాటలకి ప్రేరణ అందిస్తాయి. ఉత్తమమైన పాటకి జీవాన్ని పోస్తాయి. కథాస్పర్శతో పాత్రల మనోభావాలకి అద్దం పట్టిన మధుర గీతాలెన్నో సంగీత ప్రియుల్ని రసానుభూతిని అందిస్తాయి. హీరో ఇమేజ్ కన్నా..చిత్రకధే ప్రధానపాత్ర వహించడంవల్ల మరింత మధురంగా కథా కథనాలు..గీతాలు ఆవిర్భవిస్తాయి. తెలుగు సినీ గీతాల సముద్రంలో తరచి తరచి చూస్తే ఎన్నో ఆణిముత్యాలు దొరుకుతాయి. సంగీతం, సాహిత్యం, గాయనీ గాయకుల గాత్ర వైవిధ్యం, కలగలిసి మనకెన్నో అద్భుత గీతాల్ని అందించాయి. వినోదమైనా, విషాదమైనా, ప్రణయమైనా, భక్తి రసమైనా సందర్భాన్నిబట్టి ఎప్పటికప్పుడు చక్కటి సినిమా పాటలు ఉదయిస్తునే వుంటాయి.
పాట బాగుండాలే కానీ ఎన్ని సంవత్సరాలైనా..కాలంతో పనిలేక పచ్చగానే వుంటుంది. సంగీతంతో మనకి ప్రవేశం లేకపోయినా, సినీ గీతాలు మన హృదయంలో ప్రకాశించడానికి ఒకే ఒక్క కారణం సంగీత దర్శకులూ, రచయితలూ. రచయిత మనోభావాన్ని సంగీత పరికరాల సాయంతో మధురంగా పలికించే స్వరకర్త పాటకి ప్రాణం..ఊపిరి!!
ఈనాటి పాటల్లో వేగమే తప్ప రాగమే లేదు. రాగాల కలయిక అపురూప గీతంగా మార్పుచెంది మనకో ఆహ్లాదభరితమైన పాటని అందించేవి ఆనాటి చిత్రాలు. అందుకే అప్పటి పాటలు మనం ఎన్నిసార్లు విన్నా మళ్లీ వింటే బాగుండును అనే భావన కలుగుతుంది. గంగిగోవు పాలు గరిటెడైన చాలు అన్నట్టు వినసొంపైన పాట ఒకటున్నా ఇప్పటి సినిమా విజయానికి రాచబాట వెయ్యడం ఖాయం. లేకపోతే హాల్లోంచి రెండ్రోజుల్లోనే మాయం. సినిమా అనేది పూర్తిగా కమర్షియల్ అయినా ప్రేక్షకులు కోరే భావగీతాలూ వుండాలి. అంతేకానీ ఓ ఫార్మాట్‌లా ఆరు పాటలు (ఐటంసాంగ్‌తో కలిపి) వుండాలని సినిమాని నిర్మిస్తే...అది చూసేవారికి ఏడు ఇంటర్వెల్స్ ఇచ్చే వాళ్లవుతారు. పాట మనసును ‘కదిలించేలా’ ఉండాలి. జనాన్ని ‘సీట్లోంచి కదిలించేలా’ ఉండకూడదని తీసేవాళ్లు భావించే రోజులు రావాలి. ఇప్పటి పాటల్లో సాహిత్యం వున్నా..సంగీత పరికరాల హోరు, ఎడిటింగ్ జోరూ ఇప్పటి పాటలోని సాహిత్యాన్ని హత్య చేస్తున్నాయని అందరూ భావిస్తున్నారు. ఆ భావనని నేటి పాటలు పటాపంచలు చేసి ‘పంచదార బొమ్మ’ల్లాంటి సినీ గీతాల్ని అందించగలిగితే మనస్ఫూర్తిగా చప్పట్లు కొడతారు. లేదంటే పెదవి విరిచి చప్పరించేస్తారు.
No comments:
Post a Comment