ఆత్రేయ పేరు చెప్పగానే అందరికీ గుర్తువచ్చేది ఆయన మనసు పాటలు. ఆ తర్వాత వలపు పాటలు, వానపాటలు వగైరా..కానీ ఆత్రేయకు వీణపాటలంటే ప్రత్యేకమైన అభిమానమనీ, ఆయన హృదయాలను ద్రవింపచేసే విశిష్టమైన వీణపాటల్ని రాశారనీ చాలామందికి తెలియదు. ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లో ఎక్కువ వీణ పాటల్ని ఆలపించిన మధుర గాయని పి.సుశీల అయితే ఎక్కువ వీణపాటల్ని రాసిన కవి ఆచార్య ఆత్రేయే! లభిస్తున్న ఆధారాల మేరకు ఆత్రేయకు ఏడుసినిమాల్లో తొమ్మిది వీణపాటల్ని రాసే అవకాశాలు లభించాయి. (ఈ అంకెను నా ‘తెలుగు సినీ కవుల చరిత్ర’పుస్తకంలో ఆరుగా పేర్కొనడం పొరపాటు!). వీటిలో ఎనిమిదింటిని వీణావాణి అయిన పి.సుశీల ఆలపించగా ‘మురళీకృష్ణ’ చిత్రంలో పాటను మాత్రం జానకి పాడారు. ఈ వీణపాటల్లో ఆత్రేయ ఎంతటి వైవిధ్యాన్ని కనబరిచారో, ఆయన వీణపాటల నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం.
వీణను ప్రధాన వస్తువుగా తీసుకుని రాసిన పాటలు, వీణ ప్రధాన వాద్యంగా చిత్రీకరించిన పాటలు రెండూ తెలుగులో వీణపాటలుగానే పరిగణింపబడ్డాయి. ‘అర్ధాంగి’ చిత్రంలో ఆత్రేయ రాసిన
వద్దురా కన్నయ్య ఈ పొద్దు/ఇల్లు వదలిపోవద్దురా అయ్య/ పశువులింటికి పరుగులెత్తే వేళ/ పసిపాపలను బూచి పట్టుకెళ్లే వేళ..
అనే గొప్ప పాటలో వీణ ప్రసక్తి ఎక్కడా లేదు. అది వీణకోసం రాసింది కూడా కాదు. కాని దర్శకుడు తన అభిరుచిమేరకు ఆ పాటను వీణమీదే చిత్రీకరించాడు. ఇదికాక ఆద్యంతం వీణమీద లేదా ఆ వాదనానికి తగిన గానం మీద ఆత్రేయ మరి తొమ్మిదిపాటల్ని రాశారు. తెలుగు సినిమాల్లో వీణమీద చిత్రీకరించిన పాటలన్నీ ఇలా ఉద్దేశించి రాసినవి కావు!
ఆత్రేయ రెండేసి వీణపాటలు రాసిన చిత్రాల్లో మొదటిది ‘డా.చక్రవర్తి’ (1964). ఈ రెండు పాటల్లో తెరమీద ఒకటి కథానాయకుని చెల్లెలు (గీతాంజలి), రెండోది కథానాయిక (సావిత్రి) వీణ వాయిస్తూ పాడినట్టు చిత్రీకరించారు. వీటిలో మొదటిదానిలో వీణ ప్రసక్తి ఉంది. రెండోదానిలోలేదు. ముఖ్యంగా ఈ రెండూ గాన ప్రధానమైనవి. స్థూలంగా చూస్తే రెండుపాటల్లో భావ సారూప్యం కనిపించినా సూక్ష్మంగా పరిశీలిస్తే మొదటిపాటలో వినమ్రతతో కూడిన నివేదనం రెండోపాటలో తన ప్రణయగీతి కృష్ణుడికి మాత్రమే వినిపించాలనే ఆరాధనా భావం స్పష్టంగా కనిపిస్తాయి.
1. పాడమని నన్నడగవలెనా/ పరవశించి పాడనా/ నేనే పరవశించి పాడనా
2. పాడమని నన్నడగతగునా/ పదుగురెదుటా పాడనా/ కృష్ణా పదుగురెదుటా పాడనా
ఈ రెండు పల్లవులకు బసవరాజు అప్పారావుగీతం- పదిమందిలో పాట పాడుమని/బలవంతము చేయకు నాధా మూలమైనా ఆత్రేయ శైలి, శిల్పం-మూలాన్ని మరిపించాయి.
ఆత్రేయ ‘చక్రవాకం’ (1974) చిత్రంలో రాసిన వీణపాటలు బొమ్మ-బొరుసు తరహాకి చెందినవి.
1. వీణలోనా తీగలోనా/ ఎక్కడున్నది నాదము
అది ఎలాగైనది రాగము
2. వీణలోనా తీగలోనా/ ఎక్కడున్నది అపశ్రుతి-అది/ ఎలాగైనది విషాద గీతి -మొదటిది సంతోష సమయానికి, రెండోది విషాద సందర్భానికి రాసినవి. ఇలాంటి జమిలి పాటలు రాయడం ఆత్రేయకు కొట్టిన పిండి. రెండింటిలోనూ శ్రుతిరాగ గానాలను అన్వయించిన తీరు ఆత్రేయ సంగీత పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ‘మురళీకృష్ణ’ (1964) చిత్రంలో పెళ్లి పీటలపైనే సౌభాగ్యాన్ని కోల్పోయిన విధివంచిత అయిన యువతి పాత్ర (గీతాంజలి) ఆలపించిన
మోగునా ఈ వీణ, మూగవోయిన/ రాగహీన, అనురాగ హీన అనేపాటకు- ‘గోరింటాకు’ (1979) చిత్రంలో రెండవనాయిక (స్వప్న) పాత్ర పరిచయంలోనే వినిపించిన
పాడితే శిలలైనా కరగాలి/ జీవిత గతులైనా మారాలి/ నా పాటకు ఆ బలమున్నదో లేదో/ పాడిన పిదపే తెలియలా
పాటకు చాలా పోలికలున్నాయి. రెండో పాటలోని- తాళి కట్టెడి వేళకోసమై/ లేచి చూచినది విరిమాల/ కట్టే వేళకు కట్టని తాళిని/ కత్తిరించినది విధిలీల -అనే చరణం ఈ పాత్రలకున్న సాదృశ్యాన్ని స్పష్టం చేస్తుంది. ‘గోరింటాకు’ నిర్మాత మురారి తన చిత్రంలోని పాటకు ‘దేశోద్ధారకులు’ చిత్రంలో ఆత్రేయ రాసిన వీణపాట స్ఫూర్తి అంటారు. కానీ-అది జ్ఞాపక లోపం. ఈ పాటకు, పాత్రకు ‘మురళీకృష్ణ’యే మూలం!
‘దేశోద్ధారకులు’ (1973) చిత్రంలోని
ఈ వీణకు శృతిలేదు
ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదు
బతుకెందుకో అర్ధం కాదు
అనే పాట ఓ వేశ్య ప్రశ్నించే గుండెల్ని పిండే ఆర్తగీతం
ఆత్రేయ వీణపాటల్లో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది ప్రేమ్‌నగర్’ (1971)లోని
ఎవరో రావాలి, నీ హృదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి
అనే ఉద్వేగభరితమైన పాట. మూలపడిన మధురవీణ లాంటి కథానాయకుని ఆంతర్యం స్ఫురించేలా అద్భుతంగా రాసిన ఈ పాట నాయిక లత (వాణిశ్రీ) మీద చిత్రీకరించబడింది. ఆత్రేయ మనసు పొరల్లోంచి వచ్చిన ఈ పాటకు మామ బాణీ సుశీల గానం, వాద్య సహకారం ప్రాణం పోశాయి. కనె్న మనసులో పరవళ్లు తొక్కే పారవశ్యానికి అక్షరాకృతి నిచ్చింది ‘అత్తలూ-కోడళ్లు’ (1971) చిత్రంలోని ఆత్రేయ వీణపాట. ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో/ నాలోన పులకించు ఎన్ని భావాలో అనే ఈ పాటలో మోహన, కల్యాణి మొదలైన రాగాలను పేర్కొంటూ వలపుకూ సంగీతానికి అందంగా ముడివేశారు ఆత్రేయ. ఈ పాట, డా.చక్రవర్తిలోని ఆత్రేయ వీణ పాటలు పెళ్లి చూపుల్లో వధువు పాట పాడి వినిపించే కాలంలో తరచుగా వినిపించేవి.
వీణ కర్నాటక సంగీతానికి ప్రధానమైన, హృద్యమైన వాద్యం. కనువిందైన నాయిక వీణముందు కూర్చుని వీనుల విందుగా పాట పాడుతుంటే-ఆ మనోహరమైన దృశ్యం వీక్షకులనలరిస్తుందని ఆనాటి సినీ దర్శకులు తమ చిత్రాల్లో వీణపాటలకు స్థానం కల్పించేవారు. సాధారణంగా నాయిక మధురోహలలోనో, ప్రణయ స్మృతులలోనో తెలియాడే సన్నివేశానికి వీణపాటను రూపొందించేవారు. కానీ ఆత్రేయ వీణపాటల్లో అధిక శాతం ఆవేదనా భరితాలు కావడం, అవి ప్రేక్షకామోదాన్ని పొందడం గమనార్హం.
ఆత్రేయ వీణపాటలు బాణీ వెనక ఓ కథ ఉంది. దానిని ఆయన ఆత్మకథలో ‘తొలిగాయం’గా పద్యరూపంలో రాశారు. ఆయన ప్రియురాలు ‘బాణం’ వీణావాదనంలో నేర్పరి. కారణాంతరాలవల్ల ఆమెకు ఆత్రేయతో వివాహం కాలేదు. వివాహానంతరం ఆమె ఆయనకు తారసపడినప్పుడు -‘నీతో పెళ్లి జరగలేదు కనుక వీణను అటకెక్కించాను’ అందట! అప్పటినుంచి వీణ ప్రసక్తి వస్తే ఆత్రేయ పగిలిన హృదయంనుంచి ప్రకంపనలు వినిపించేవి! అవే ఆయన వీణపాటలయ్యాయి!
వెండితెర మీద వీణపాటలు కనుమరుగై చాలాకాలమయినా, ఇప్పటికీ ఆత్రేయ వీణపాటలు వినిపిస్తుండడం వాటి విశిష్టత!
2 comments:
chala bavundi.....
very good articles
Post a Comment