Friday, January 6, 2012
అసలైన హాస్యానికి చిరునామా
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం’ అంటూ నవ్వుకు సరికొత్త నిర్వచనం చెప్పిన ‘జంధ్యాల’ పేరు వినగానే, ప్రతివారి పెదవులపై నవ్వు తొణికిసలాడుతుంది. ఆరోగ్యకరమైన హాస్యానికి చక్కని చిరునామా జంధ్యాల. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎక్కువ మంది ప్రతిభావంతులైన హాస్యనటులను అందించిన ఘనత కలిగిన దర్శకుడు జంధ్యాల.
తెలుగు సినిమా రంగంలో హాస్య దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్న జంధ్యాల పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో 1951 జనవరి 14న జన్మించారు. జంధ్యాల నారాయణమూర్తి, సూర్యకాంతం వీరి తల్లిదండ్రులు. జంధ్యాల వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్ర్తీ అనేది ఈయన పూర్తి పేరు. విద్యాభ్యాసం మొత్తం విజయవాడలో కొనసాగింది. జంధ్యాల కాలేజి రోజులనుంచే నాటకాలు రాస్తూ, దర్శకత్వం వహించారు. స్వయంగా విన్నకోట రామన్నపంతులు ఆధ్వర్యంలో ఒక నాటక సంస్థ ప్రారంభించారు. మొదటి నాటకం ‘‘ఏక్ దిన్ కా సుల్తాన్’’ ఎంతో పేరుతెచ్చిపెట్టింది. తన నాటకాలే కాకుండా, ఇతరులు రాసిన నాటకాల్ని ప్రదర్శించి, ప్రముఖుల్ని సత్కరిస్తుండేవారు. జంధ్యాల రాష్టవ్య్రాప్తంగా అనేక నాటక పరిషత్తుల్లో పాల్గొని ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రదర్శన అవార్డులు ఎన్నో పొందారు.
సినీ రంగంపై మక్కువతో మిత్రులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో 1973లో మద్రాసులో అడుగుపెట్టారు. మొదటిసారిగా ‘‘పెళ్ళికాని పెళ్ళి’’ అనే సినిమాకు రచన చేసారు. అయితే ‘‘దేవుడుచేసిన బొమ్మలు’’ సినిమా ముందు రిలీజైంది. దాదాపు 140 సినిమాలకు రచయితగా పనిచేసారు. ఎక్కువ సినిమాలు హాస్యరస ప్రధానమైనవే. కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి లాంటి ప్రముఖ దర్శకుల చిత్రాలకు రచనలు చేసారు. 1983లో ఏకంగా 80 సినిమాలకు మాటలు రాసారు. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక రికార్డు. హాస్య చిత్రాలకు ఎంత చిలిపిగా రాసారో, ‘‘శంకరాభరణం’’లాంటి చిత్రాలకు అంత హృద్యంగా రాసారు.
1981లో ‘‘ముద్దమందారం’’ సినిమా ద్వారా దర్శకులుగా మారారు. ప్రదీప్, పూర్ణిమ హీరో హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం శత దినోత్సవం జరుపుకుంది. దర్శకులుగా 40 సినిమాలు రూపొందించారు. వీటిలో నాలుగు స్తంభాలాట, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, నెలవంక, రావుగోపాలరావు, శ్రీవారి శోభనం, రెండురెళ్ళఆరు, సీతారామకళ్యాణం, పడమటి సంధ్యారాగం, అహనాపెళ్ళంట, వివాహ భోజనంబు, చూపులు కలిసిన శుభవేళ, బావా బావా పన్నీరు, ప్రేమ ఎంత మధురం, బాబాయ్ హోటల్, ఓహో నా పెళ్ళంట లాంటి సినిమాలు విజయవంతమవడంతోపాటు దర్శకులుగా జంధ్యాలకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. నరేష్, రాజేంద్రప్రసాద్ లాంటి కామెడీ హీరోలతోనే కాకుండా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన చిరంజీవి, బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు లాంటి అగ్ర హీరోలతో కూడిన తనదైన ముద్రలో చిత్రాలు రూపొందించడం ఒక్క జంధ్యాలకే సాధ్యమైంది.
జంధ్యాల ఎందరో హాస్య నటుల్ని తెలుగు తెరకు పరిచయం చేసారు. బ్రహ్మానందం, వేలు, వీరభద్రరావు, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి, కోట శ్రీనివాసరావులను సమర్థవంతమైన హాస్య కళాకారులుగా తీర్చిదిద్దారు. ‘‘నాలుగుస్తంభాలాట’’ సినిమాలో ‘‘సుత్తి’’ అనే పదాన్ని ప్రయోగించి, ఆ పదానికి ఎంతో ప్రాచుర్యం కల్పించారు. ఈ పదం ఇప్పటికీ జనసామాన్యంలో పదే పదే వినిపిస్తుంటుంది. అందులో నటించిన వేలు, వీరభద్రరావు ‘సుత్తిజంట’గా ఎంతో ప్రసిద్ధులయ్యారు. జంధ్యాల సినిమాల్లో ప్రత్యేక హాస్య పాత్రలు పోషించిన శ్రీలక్ష్మి హాస్య నటిగా తెలుగు తెరపై ఎంతోకాలం రాణించింది. ఎంతోమందిని పరిచయం చేసిన జంధ్యాల ‘‘ఆపద్బాంధవుడు’’ సినిమాలో నటించి, ఆ పాత్రకు ఎంతో వనె్నతెచ్చారు.
జంధ్యాల సినిమాల్లో సున్నితమైన హాస్యం ఉంటుంది. అది సుతారంగా తాకి మనసును గిలిగింతలు పెడుతుంది. ఇలాంటి హాస్యాన్ని సృష్టించి, హాస్యబ్రహ్మ అయిన జంధ్యాల 2001 జూన్ 19న తెలుగు ప్రేక్షకుల్ని విచార సాగరంలో ముంచి అనంత లోకానికి వెళ్ళిపోయారు. వెనుకటి తరం హాస్య రచయితలు పింగళి నాగేంద్రరావు, చక్రపాణి, సముద్రాల వంటి వారి బాటలో నడిచి, హాస్యాన్ని తన ఆయుధంగా నమ్మి, ఆరోగ్యవంతమైన హాస్యాన్ని తన చిత్రాల్లో చూపించిన జంధ్యాల, తెలుగువారి పెదవులపై చిరస్థాయిగా ఉంటారు.
జనవరి 14 జంధ్యాల జయంతి
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే! అనిపిస్తుంది నాకు. చక్కని విశ్లేషణ!
జంద్యాల గురించి బాగా రాసారు .
Post a Comment